అంకురాలను ప్రోత్సహించేలా కొత్త పాలసీ

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 04:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

2029 నాటికి రూ.50 వేల కోట్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం
డీఆర్‌డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి కామత్‌

అంకుర సంస్థలు అభివృద్ధి చేసిన ఉత్పత్తులను పరిశీలిస్తున్న డీఆర్‌డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి కామత్‌

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ రంగంలో అంకుర సంస్థలను మరింత భాగస్వాములను చేసేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) నూతన పాలసీని తీసుకురాబోతోంది. ఏఐ, డ్రోన్స్, శాటిలైట్, సైబర్‌ సెక్యూరిటీ, హైపర్‌సోనిక్‌ లాంటి డీప్‌ టెక్నాలజీతో అంకుర సంస్థలు పనిచేసేలా కొత్త స్టార్టప్‌ విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో ఇది అందుబాటులోకి వస్తుందని డీఆర్‌డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి కామత్‌ ప్రకటించారు. 

విదేశాలకు మన ఉత్పత్తులు 

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత డీఆర్‌డీవో వ్యూహాలకు పదును పెట్టింది. వేర్వేరు ఆయుధ వ్యవస్థల అభివృద్ధిలో భాగంగా డ్రోన్ల ప్రాధాన్యాన్ని గుర్తించింది. ప్రత్యేకించి మధ్యస్థ ఎత్తు-దీర్ఘ సమయం, అధిక ఎత్తు-దీర్ఘ సమయం పనిచేసే డ్రోన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. సంబంధిత మినియేచర్‌ ఆయుధాలను రూపకల్పన చేస్తోంది. ఇందులో ప్రైవేటు సంస్థలనూ భాగస్వాములను చేస్తోంది. ప్రస్తుతం దేశంలో వార్షికంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు తయారవుతున్నాయి. 2029 నాటికి వాటిని రూ.3 లక్షల కోట్లకు పెంచాలనేది లక్ష్యం. ప్రస్తుతం రూ.23,500 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతుల్ని 2029 నాటికి రూ.50,000 కోట్లను పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచితేనే అది సాధ్యమవుతుందని డీఆర్‌డీవో విశ్వసిస్తోంది. ఇందుకు గతంలో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (టీవోటీ) విధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా పరిశ్రమలతో 2,100కుపైగా లైసెన్సింగ్‌ ఒప్పందాలను కుదుర్చుకుంది. 

స్టార్టప్‌లకు లాభదాయకంగా...  

డ్రోన్‌ సాంకేతికతలో ప్రైవేటురంగం చాలా పరిణతి సాధించిందని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రోన్‌లకు ఆయుధాలను అమర్చడం, జీపీఎస్‌ రహిత, ఎలక్ట్రానిక్‌ యుద్ధ రీతులకు తగ్గట్టుగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు, అంకుర సంస్థలతో కలిసి పని చేయడానికి డీఆర్‌డీవో సిద్ధపడుతోంది. అంకుర సంస్థల కోసం డీఆర్‌డీవో గతంలోనూ పలు పథకాలు తీసుకొచ్చింది. ఇండియన్‌ డిజైన్డ్‌ డెవలప్డ్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చర్డ్‌ పథకం, డీఆర్‌డీవో ఇండస్ట్రీ అకడమిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, ఓపెన్‌ టెస్ట్‌ ఫెసిలిటీస్, అంకుర సంస్థలకు శిక్షణ   వంటివి అందులో ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు