పరిమిత కొనుగోళ్లతో.. అపరిమిత నష్టాలు

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 04:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

రాష్ట్ర ప్రభుత్వమే కొనాలంటూ రైతుల ఆందోళనలు
కేంద్రంలో 25% సీలింగ్‌ ఎత్తివేయాలని రాష్ట్రాల డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులు అటు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇటు రైతులకు ఇబ్బందికరంగా మారాయి. మార్కెట్లో పంటలకు గిట్టుబాటు ధరలు దక్కనప్పుడు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ అభియాన్‌(పీఎం ఆశా) కింద ప్రవేశపెట్టిన ధర మద్దతు పథకం(పీఎస్‌ఎస్‌) ప్రయోజనాలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. దేశంలో 14 ప్రధాన పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటిస్తోంది. ఇందులో ఒక్క పత్తికి మాత్రం ఎలాంటి పరిమితులు విధించకుండా నేరుగా కేంద్రమే కొంటోంది. మిగిలిన పంటలను ముందు రాష్ట్రాలు కొనుగోలు చేస్తే, తరువాత కేంద్రం సీసీఐ, నాఫెడ్‌ తదితర సంస్థల ద్వారా సేకరిస్తోంది. అయితే ఆయా రాష్ట్రాలు పంట ఉత్పత్తుల్లో కేవలం 25 శాతమే కొనుగోలు చేయాలని పరిమితి విధించడం, ప్రధానమైన మొక్కజొన్న, జొన్న తదితర పంటలను ఈ పథకంలో చేర్చకపోవడం సమస్యగా మారింది.  

మార్క్‌ఫెడ్‌పై ఆర్థికభారం

  • పంటల్లో కొన్నింటికి 25% పరిమితి విధింపు, మరికొన్నింటికి పీఎస్‌ఎస్‌లో అనుమతి లేకపోవడంతో రైతులకు మద్దతు ధర దక్కట్లేదు. దీంతో వారు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. 
  • సోయా, పెసర, మినుములకు ధర పడిపోవడంతో ప్రభుత్వమే కొనాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.  
  • తెలంగాణలో శనగలు, పెసలు, వేరుసెనగలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా నాలుగేళ్లుగా కొనుగోలు చేస్తుండగా.. 25% కంటే అధికంగా నిల్వలు వచ్చాయి. 
  • మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం అనుమతించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొంటోంది. ఈ ఒక్క పంటతోనే మార్క్‌ఫెడ్‌ రూ.4 వేల కోట్లు నష్టపోయింది. 
  • ఈ ఏడాది రూ.2,400 కోట్లతో మొక్కజొన్న సేకరణ చేపట్టింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటోంది. 

తక్షణమే సీలింగ్‌ రద్దు చేయాలి 

ధర మద్దతు పథకం లొసుగుల మయంగా ఉందని రెండేళ్లుగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నా స్పందన లేదు. తెలంగాణలో నువ్వులు, శనగలు, వేరుసెనగ, సోయాబీన్, పెసలు వంటి పంటలు విస్తారంగా సాగవుతాయి. కేంద్రం 25% సీలింగ్‌ విధించినా రైతులు నష్టపోవద్దని ఆర్థికంగా భారమైనా అధికంగా కొంటున్నాం. కేంద్రం తక్షణమే 25% సీలింగ్‌ రద్దు చేయాలి. మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్‌ఎస్‌లో చేర్చాలి.

తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ మంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు