తాగునీటితోనే గిరిజనులకు ‘సూపర్‌బగ్‌’ ముప్పు

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 07:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆంత్రోపాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, హెచ్‌సీయూ సంయుక్త అధ్యయనంలో వెల్లడి

గిరిజనుల్లో సూక్ష్మజీవుల రోగ నిరోధక శక్తి క్రమం

ఈనాడు, హైదరాబాద్‌: కొండాకోనలు, వాగులు, వంకల్లోని నీటిని తాగుతున్న గిరిజనులకు ‘సూపర్‌బగ్‌’ (యాంటీబయాటిక్‌లకు లొంగని సూక్ష్మజీవులు) ముప్పు పొంచి ఉందని ఆంత్రోపాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు సంయుక్త పరిశోధనలో పేర్కొన్నారు. ‘వన్‌హెల్త్‌ లెన్స్‌’ పేరుతో ఆంత్రోపాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిశోధకులు ఆఫ్రిద్‌ మోయిలిక్, జిన్‌ఖాన్‌ కౌల్, పీఎన్‌ వేణుగోపాల్, హెచ్‌సీయూ ఆచార్యుడు డాక్టర్‌ నాగరాజారామ్‌లు.. ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లోని మారుమూల అటవీ ప్రాంతాలకు వెళ్లి గిరిజనుల జీర్ణకోశ వ్యవస్థపై అధ్యయనం చేశారు. 103 మంది మల నమూనాలను సేకరించి యాంటీ మైక్రోబియాల్‌ నిరోధకతను పరిశీలించినట్లు డా.నాగరాజారామ్‌ వివరించారు. తమ అధ్యయనం ఇటీవలే ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌ మైక్రోబయాలజీ’తో ప్రచురితమైందని తెలిపారు. 

సహజ ఆహారం తింటున్నా: గిరిజనులు సహజ సిద్ధమైన ఆహారం తీసుకుంటున్నా.. తాగుతున్న నీళ్ల కారణంగా యాంటీబయాటిక్స్‌ సైతం పనిచేయని సూక్ష్మజీవులు వారి జీర్ణకోశంలో పెరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇరుల, జేను కురుబ, కురంబ తెగల గిరిజనులను తమ పరిశోధనలకు ఎంపిక చేసుకున్న అధ్యయనకర్తలు.. కొద్దిరోజులు వారితోపాటు ఉండి ఆహారపు అలవాట్లను క్షుణ్నంగా పరిశీలించారు. అడవుల్లో ప్రవహించే నీళ్లలో సూక్ష్మస్థాయిలో కొన్ని లోహాలున్నాయని, వాటినే వీరు తాగుతున్నారని తెలుసుకున్నారు. మరికొందరు బోరుబావి నీరు తాగుతున్నా.. రోగ నిరోధకశక్తి క్రమంగా తగ్గుతోందని గుర్తించారు. సూపర్‌బగ్, యాంటీ మైక్రోబియాల్‌ ముప్పు నుంచి గిరిజనులను రక్షించాలంటే వారికి సురక్షితమైన నీరు, వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని డా.నాగరాజారామ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు