Road Accident: తప్పు దిద్దుకోలేని ఆ క్షణం!

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 18:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

రోజూ వెళ్లే రోడ్డే కదా... రోజూ దాటే జంక్షనే కదా...అన్న నిర్లక్ష్యమో... ఏమో కానీ సెల్‌ఫోన్‌ వాడుతూ కొందరు... అడ్డగోలు డ్రైవింగ్‌తో మరికొందరు... నిబంధనలు తోసిరాజని ఇంకొందరు...  ప్రమాదాలకు కారణమవుతున్నారు. నిలువెల్లా నిర్లక్ష్యం ఆవరించిన ఒక్క క్షణం కొంప ముంచేస్తుంది.. గుర్తుపెట్టుకోండి. సిగ్నళ్లు, జంక్షన్ల వద్ద ఆగడానికైనా... వాటిని దాటడానికైనా కొన్ని నిబంధనలు ఉన్నాయి.. అనుసరిస్తే అందరికీ మేలు!


ఎడమవైపు ఆగి.. కుడి వైపు పయనమా?

  • కూడలిలో నిబంధనలనుబట్టి కొన్నిచోట్ల నేరుగా ముందుకు వెళ్లడానికి, కుడి, ఎడమల వైపు వెళ్లడానికి సిగ్నలింగ్‌ వ్యవస్థ ఉంటుంది. 
  • కొందరు కూడలిలో తమ బండికి ఖాళీ లేదని పూర్తిగా ఎడమవైపు ఆగి గ్రీన్‌సిగ్నల్‌ పడ్డాక కుడివైపు వెళ్లే ప్రయత్నం చేస్తారు. 
  • అప్పటివరకు కూడలి వద్ద నిరీక్షించిన వాహనదారులు సిగ్నల్‌ పడ్డాక ఒక్కసారిగా వేగంగా ముందుకు వచ్చేస్తారు. ఇలా అడ్డదిడ్డంగా వచ్చే వాహనాలతో ప్రమాదం పొంచి ఉంటుంది.  

పాదచారులను చూస్తున్నారా..?

  • పాదచారులు దాటేందుకు రోడ్లపై జీబ్రా లైన్లుంటాయి. అక్కడ తప్పనిసరిగా వేగం తగ్గించాలి. కొందరు వాటిని గుర్తించకుండా వెళుతుంటారు. 
  • రోడ్డు దాటేవాళ్లు దగ్గరగా ఉంటే వేగాన్ని నియంత్రించడం కష్టం అవుతుంది, కాబట్టి  జీబ్రా లైన్లను ముందే గుర్తించి వేగాన్ని తగ్గించుకోవాలి. 

నియంత్రణ లేని వేగం

  • కూడళ్ల దగ్గర వేగం తగ్గించకుండా దూసుకుపోయే వాళ్లను మనం చూస్తుంటాం. రెడ్‌ సిగ్నల్‌ పడ్డా పట్టించుకోకపోతే, ఎదురుగా వచ్చే వాహనాలతో ప్రమాదం పొంచి ఉంటుంది. 
  • కుడి వైపు, ఎడమవైపు మళ్లేటప్పుడు సిగ్నల్‌ సరిగ్గా ఇవ్వాలి. ఒకవైపు సిగ్నల్‌ ఇచ్చి మరోవైపు వెళ్లడం, అసలు సిగ్నలే ఇవ్వకపోవడం.. రెండూ అపాయకరమే. మరోవైపు వెళ్లేందుకు వేగం తగ్గిస్తాం. కానీ వెనకాల వాహనాలు వేగంగా వచ్చేస్తాయి.  ఈ సమయంలో సిగ్నల్‌ తప్పుగా ఇస్తే వాహనాలు ఢీ కొనొచ్చు. 

మొబైల్‌ చూడొద్దు...

  • కొన్ని కూడళ్ల దగ్గర రెడ్‌సిగ్నల్‌ పడ్డాక సమయం ఉంది కదా అని కొందరు మొబైల్‌ తీసి మాట్లాడుతుంటారు. మెసేజ్‌లు పెడుతుంటారు. వీడియోలు చూసేవాళ్లూ ఉన్నారు.  
  • ఇలా చేయడం వల్ల వెనుక వాహనదారులు వేగంగా దూసుకొచ్చినప్పుడు ప్రమాదాలు జరగొచ్చు. డ్రైవింగ్‌లో మొబైల్‌ వాడకం మీ ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. 
  • మరికొందరు డ్రైవింగ్‌ చేస్తూనే మొబైల్‌ను చెక్‌ చేస్తూ, మెసేజ్‌లు పెడుతుంటారు. ఇది వారికే కాకుండా ఇతరులకూ ప్రాణాంతకం కావచ్చు.

లేన్‌ మార్పులు... పొగమంచు

  • ఓఆర్‌ఆర్, జాతీయ రహదారుల్లో ఒక్కోవైపు నాలుగైదు లేన్లు ఉంటాయి. ఒక లేన్‌ నుంచి మరోదాంట్లోకి మారేటప్పుడు వెనుక నుంచి వచ్చే వాహనాల వేగాన్ని గమనిస్తూ సిగ్నల్‌ ఇచ్చి మారాలి. 
  • చలికాలం మొదలైంది. ఉదయం వేళల్లో పొగమంచు ఉంటుంది. కొన్నిచోట్ల సిగ్నళ్లు ఉన్నా సరిగా పనిచేయవు. ఇవన్నీ డ్రైవింగ్‌ చేసేవారిని గందరగోళానికి గురిచేస్తుంటాయి. వీటిని గమనంలోకి తీసుకోవాలి.

ఎప్పుడు ఆగాలి.. వెళ్లాలి..?

  • రెడ్‌ సిగ్నల్‌ పడగానే ఆగాలి. ముందు ఆగిన వాహనానికి కొంచెం దూరాన్ని పాటించాలి. 
  • రెడ్‌ నుంచి ఎల్లో, ఆ తర్వాత గ్రీన్‌ రంగులోకి మారినప్పుడు వాహనాన్ని మెల్లగా ముందుకు నడపాలి. 
  • కొందరు సమయం కలిసివస్తుందనో, దూరం తగ్గుతుందనో ఆపోజిట్‌ డైరెక్షన్‌లోవెళుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. 

సిగ్నళ్ల దగ్గర నిబంధనలు పాటించకపోవడం, సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకూ ముప్పు ఉంటుంది. ఓ నిమిషం సమయాన్ని ఆదా చేసుకునే క్రమంలో చేసే తప్పులు జీవితకాల నష్టాన్ని మిగులుస్తాయి.


ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని