Telangana News: రైతులకు సాయంపై భాజపా, కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు: నిరంజన్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు సాయం చేయాలనుకోవడంపై కాంగ్రెస్, భాజపా చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.

Published : 21 May 2022 15:26 IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులకు సాయం చేయాలనుకోవడంపై కాంగ్రెస్, భాజపా చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. దిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో మరణించిన వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న సాయంపై విపక్షాల విమర్శలను నిరంజన్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

‘‘తెలంగాణలో నేటి వరకు 80,755 రైతు కుటుంబాలకు రైతు బీమా అందించాం. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి బీమా పథకం లేదు. రైతు బీమాతో వ్యవసాయ కుటుంబాలకు ధీమా లభిస్తోంది. దిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు చేస్తున్న రూ.3 లక్షల సాయంపై కాంగ్రెస్, భాజపా చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. అసలు కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకం అమలు చేసే దమ్ముందా? కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.50 వేలు సాయం అందాలంటే ఎన్నో ప్రయాసలు ఎదుర్కోవాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ రైతు పక్షపాత నిర్ణయాల కారణంగా ఎలాంటి పైరవీలు, కమిటీలు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందుతుంది. ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లించి అమలు చేస్తున్న గొప్ప పథకం ఇది.

రైతు డిక్లరేషన్లు కాదు.. ముందు మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో అవి ఈ ఏడాది నుంచి అమలు చేసి చూపించాలి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం అంటే గొర్రె కసాయివాడిని నమ్మినట్లే అవుతుంది. దశాబ్దాల కాంగ్రెస్ పాలన చూసి విసుగుచెంది ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టారు. అధికారంపై ఆశతో కాంగ్రెస్, భాజపా పగటి కలలు కంటున్నాయి. దిల్లీలో పోరాడి అసువులు బాసిన రైతులకు ఈ దేశమంతా సంఘీభావంగా నిలిచి వారి కుటుంబాలకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. వారి పోరాట ఫలితంగానే నరేంద్రమోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న నల్ల చట్టాలను భాజపా ప్రభుత్వం అమలు చేసింది. చలి, వాన, ఎండలను సైతం లెక్కచేయకుండా పోరాడి మరణించిన కుటుంబాలకు సాయం చేస్తున్న కేసీఆర్‌ను అభినందించాల్సిందిపోయి విమర్శించడం సిగ్గుచేటు. ఆ రైతులు ఎవరో పరాయిదేశం వారైనన్లు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా విషం చిమ్మడం దురదృష్టకరం’’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని