Self care: అందమొక్కటే కాదు.. అంతరంగం కూడా!

Eenadu icon
By Telangana News Desk Updated : 02 Nov 2025 18:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

నిజమైన సెల్ఫ్‌కేర్‌ అదే...

అందాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు...
ఆత్మీయ బంధాలను రెట్టింపు చేసుకోవడం...
ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించడమే కాదు...
మానసిక వికాసానికి పెద్దపీట వేయడం...
ఖరీదైన వస్తువులను వాడడమే కాదు...
ఆనందకరమైన అనుభూతులను సొంతం చేసుకోవడం...

సాధారణంగా స్వీయ సంరక్షణ (సెల్ఫ్‌ కేర్‌) అనే పదాన్ని వెల్‌నెస్‌ బ్లాగుల్లో ఎక్కువగా వింటుంటాం. లగ్జరీ స్పాలు, బబుల్‌ బాత్‌లు వంటివి మాత్రమే సెల్ఫ్‌ కేర్‌గా పచారం చేస్తున్నారు. అయితే శారీరక, మానసిక వికాసాన్ని ప్రోది చేసుకోవడమే నిజమైన స్వీయ సంరక్షణ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికోసం కొన్నిటిని కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. చిన్న చిన్న చర్యలను మన రోజువారీ షెడ్యూల్‌లో చేర్చుకోవడం ద్వారా ఎనలేని మేలు జరుగుతుందంటున్నారు.

2024లో ‘మైండ్‌ ఇండియా’ సంస్థ యువత (18-35 సంవత్సరాలు)లో ‘అసెస్‌మెంట్‌ ఆఫ్‌ సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీసెస్‌ అమాంగ్‌ యంగ్‌ అడల్ట్స్‌’ పేరిట అధ్యయనం నిర్వహించింది. ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ సైకాలజీ’లో నివేదిక ప్రచురితమైంది. దీని ప్రకారం మన యువతలో స్వీయ సంరక్షణ మధ్యస్థ స్థాయిలో ఉంది.  వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ లేమి, సోషల్‌ మీడియా ఒత్తిడి అధికంగా ఉంది.

  • భారతదేశంలో ప్రత్యేకించి మహిళలు, ఉద్యోగులు తమ కోసం తాము సమయం కేటాయించడాన్ని ‘స్వార్థం’గా చూస్తారేమోనన్న ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఈ  సర్వే పేర్కొంది. 
  • భావోద్వేగ సమతౌల్యం, మానసిక ప్రశాంతత దిశగా చూడడంలో మనం ఇంకా వెనుకబడి ఉన్నామని ఈ సర్వే చెబుతోంది. స్వీయ సంరక్షణను ఒకే రకంగా చూడకూడదు. ఇది బహుముఖమైనది. మన జీవితంలోని వివిధ అంశాలను కవర్‌ చేస్తుంది. 

మానసిక, శారీరక ఆరోగ్యానికి మధ్య సమతౌల్యాన్ని నిలబెట్టు కోవడమే నిజమైన స్వీయ సంరక్షణ. ఇదొక పూల బొకే లాంటిది. ఇందులో ప్రతి పుష్పం ప్రత్యేకమైనదే. మన శరీరం, మనసు, భావోద్వేగాలు, సామాజిక సంబంధాల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి.

52 శాతం పురుషులు ‘వెల్‌నెస్‌’ అంటే.. కేవలం జిమ్‌ లేదా ఫిట్‌నెస్‌గా మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. 


శరీరం: శారీరక సౌందర్యం కోసమే కాదు.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై కూడా దృష్టిపెట్టాలి.  సమతులాహారం, వ్యాయామం, తగినంత నిద్ర వంటివి ఇందులో ముఖ్యం. ప్రాసెస్డ్‌ ఫుడ్, తీపి, ఫ్రైడ్‌ ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. 7-8 గంటల నిద్ర మానసిక స్థిరత్వానికి కీలకం. రోజూ నడక లేదా యోగా చేయడం మన శరీరాన్ని బలోపేతం చేస్తాయి. ఒక గ్లాస్‌ స్మూతీ(పండ్లు, కూరగాయలతో) తాగాలి. లేదా ఆరోగ్యకరమైన స్నాక్స్‌(గింజలు, బీన్స్‌) తినాలి. ఇవి శక్తిని పెంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.


భావోద్వేగాలు: మనలోని భావాలను అర్థం చేసుకోవడం, వాటిని వ్యక్తపరచడం చాలా ముఖ్యం. దీనికోసం రోజూ ఓ 5 నిమిషాలు డైరీ రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. స్నేహితులతో గడపాలి. ఇవి మన మానసిక ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. భావోద్వేగపరంగా సమస్థితిని ఇస్తాయి. 


మనసు: మన మనసును హాయిగా ఉంచుకోవాలి. దీనికోసం పుస్తకాలు చదవడం, పజిల్స్‌ సాల్వ్‌ చేయడం లేదా మెడిటేషన్‌ చేయడం వంటివి చేయాలి. కొత్త నైపుణ్యం నేర్చుకోవడం చాలా ఉపకరిస్తుంది. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటే కౌన్సెలింగ్‌ లేదా థెరపీని పొందొచ్చు. 


సమాజం: తోటి వాళ్లతో సత్సంబంధాలను కొనసాగించాలి. అదే సమయంలో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పాటు చేసుకోవడం మంచిది. నెగెటివ్‌ ప్రభావాల నుంచి దూరంగా ఉండటం కీలకం. టెక్నాలజీ విరామం తీసుకోండి. రోజులో కనీసం ఒక గంట ఫోన్‌కు దూరంగా ఉంచండి. వారంలో ఒక రోజు కుటుంబంతో లేదా స్నేహితులతో కాఫీ షాప్‌లో గడపండి. 


ఆధ్యాత్మికత: మన అంతరంగాన్ని అన్వేషించడం చాలా మేలు చేస్తుంది. ప్రార్థన, మెడిటేషన్‌ లేదా ప్రకృతితో సమయం గడపడం మంచిది. రోజూ కాస్తంత సమయం తీసుకుని మనతో మనం గడపాలి. సూర్యోదయం చూడడం, ఇష్టమైన, నచ్చిన వ్యక్తులు, సంఘటనల గురించి రాసుకోవడం... ఇవన్నీ మనల్ని కొత్తగా ఉంచుతాయి.


‘సెల్ఫ్‌ కేర్‌ అంటే కేవలం లగ్జరీ జీవితం గడపడం, అందానికి ప్రాధాన్యమివ్వడం మాత్రమే కాదు. ఇది మనదైన జీవనశైలితో ముడిపడి ఉంది. ఆరోగ్యకరమైన జీవితానికి ఇది అవసరం. ఉదయం ఒక గ్లాస్‌ నీళ్లు తాగడం, మధ్యాహ్నం 5 నిమిషాలు డీప్‌ బ్రీతింగ్, సాయంత్రం నీకు ఇష్టమైన హాబీలో 10 నిమిషాలు గడపడం... ఇలాంటి చిన్న విషయాలే మనల్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. స్వీయ సంరక్షణ అనేది మన జీవితంలో ఒక ఆహ్లాదకరమైన రాగం.. దాన్ని ఆలపిస్తూ దాన్ని ఆస్వాదించాలి’

డాక్టర్‌ ప్రసాదరావు సీనియర్‌ మానసిక వైద్య నిపుణులు

ఈనాడు,హైదరాబాద్‌

Tags :
Published : 02 Nov 2025 18:28 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని