పోలీసు కస్టడీలోకి ఆశిష్‌ మిశ్ర

ఉద్యమిస్తున్న రైతులపైకి వాహనాన్ని నడిపి, వారు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్‌ మిశ్ర (కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర తనయుడు)ను మూడు రోజులపాటు విచారించే నిమిత్తం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Updated : 12 Oct 2021 10:44 IST

మూడు రోజుల పాటు విచారణ

లఖింపుర్‌ ఖేరి (యూపీ), ఈనాడు-లఖ్‌నవూ: ఉద్యమిస్తున్న రైతులపైకి వాహనాన్ని నడిపి, వారు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్‌ మిశ్ర (కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర తనయుడు)ను మూడు రోజులపాటు విచారించే నిమిత్తం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ స్థానిక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మిశ్రను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు చేసిన అభ్యర్థనపై చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. రెండు వారాలు కాకుండా మూడు రోజులపాటు మాత్రమే రిమాండ్‌లో తీసుకునేందుకు అనుమతించింది. నిందితుణ్ని వేధించకూడదని, అతని తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని న్యాయస్థానం షరతులు విధించింది.


లఖ్‌నవూలో ప్రియాంక దీక్ష

అజయ్‌ మిశ్రను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లఖ్‌నవూలోని సచివాలయం సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద పెద్దఎత్తున నిరసనకు దిగారు. 3 గంటల పాటు మౌన వ్రతం పాటించారు. అనంతరం గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు వినతిపత్రం సమర్పించారు. గోవాలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో కాంగ్రెస్‌ మౌన ప్రదర్శన నిర్వహించింది.

రైతులకు మద్దతుగా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం మద్దతుతో సోమవారం నిర్వహించిన బంద్‌ కారణంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. 


నేడు ‘షహీద్‌ కిసాన్‌ దివస్‌’ 

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు నిరసనగా ఈనెల 12న దేశ వ్యాప్తంగా ‘షహీద్‌ కిసాన్‌ దివస్‌’గా పాటించనున్నట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా సోమవారం వెల్లడించింది. ఘటనలో మృతిచెందిన అన్నదాతలకు ఆ సందర్భంగా నివాళులు అర్పిస్తామని తెలిపింది. ఘటన జరిగిన తికోనియాలో మోర్చా ఆధ్వర్యాన భారీ సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఘటనలో మృతిచెందిన నలుగురు రైతులు, ఓ విలేకరి స్మృత్యర్థం మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రతి ఇంటి ముంగిట 5 కొవ్వొత్తులు వెలిగించాలని ప్రజలను కిసాన్‌ మోర్చా అభ్యర్థించింది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని