చిత్తశుద్ధి చూపించారిలా..

మురుగు శుద్ధిపై చిత్తశుద్ధి లోపిస్తోంది. వ్యర్థ జలాల నిర్వహణకు సరైన వ్యవస్థలులేక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా అటు పర్యావరణానికి.. ఇటు పౌరుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రస్తుతమున్న కేంద్రీకృత విధానాల

Published : 28 Nov 2021 05:04 IST

మురుగు జలాల శుద్ధి.. పునర్వినియోగానికి కొత్త దారులు
ఎక్కడికక్కడ కట్టడి చేసి.. శుభ్రపరిస్తే ఫలితం
వికేంద్రీకరణలో ‘నీరి’ శాస్త్రవేత్తల ప్రయోగం విజయవంతం

నాగ్‌పుర్‌లో సీవరేజ్‌ ప్లాంటు

ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మురుగు శుద్ధిపై చిత్తశుద్ధి లోపిస్తోంది. వ్యర్థ జలాల నిర్వహణకు సరైన వ్యవస్థలులేక ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఫలితంగా అటు పర్యావరణానికి.. ఇటు పౌరుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రస్తుతమున్న కేంద్రీకృత విధానాల నుంచి వికేంద్రీకరణ వైపు మళ్లితేనే ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ తక్షణం ఈ విధానాన్ని అమలుచేయాలని గట్టిగా  చెబుతున్నారు.

ఏమిటీ వికేంద్రీకరణ..

దేశంలోని అన్ని నగరాల్లో ప్రస్తుతం కేంద్రీకృత వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థలే అందుబాటులో ఉన్నాయి. ఓ నగరంలో ఉన్న మొత్తం నిర్మాణాల నుంచి వెలువడే వ్యర్థ జలాలు నాలాలు, డ్రెయిన్ల ద్వారా సుదూరంలో ఉన్న ఒకే మురుగు శుద్ధి కేంద్రాని(ఎస్టీపీ)కి తరలుతున్నాయి. దీనికి పరిష్కారంగా చవగ్గా.. కాలుష్యం తగ్గించేలా, వ్యర్థ జలాల పునర్వినియోగంతో భవిష్యత్తులో నీటి కొరత తీర్చేందుకు నిపుణులు చెబుతున్న మార్గమే వికేంద్రీకృత వ్యర్థజల నిర్వహణ వ్యవస్థ(డీడబ్ల్యూడబ్ల్యూఎంఎస్‌). ఈ విధానంలో భాగంగా మురుగును స్థానికంగా ఎక్కడికక్కడ శుద్ధి చేసి పునర్వినియోగానికి సరఫరా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో నగరాల్లో వరద సమస్యకూ పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.

‘అర్వి’ సమీపంలో వికేంద్రీకృత వ్యర్థ జల నిర్వహణ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఎస్టీపీ


‘అర్వి’లో ‘నీరి’ ఏమి చేసిందంటే..

నాగ్‌పుర్‌ పరిధిలో ‘అర్వి’ ఓ చిన్న పురపాలిక. సుమారు 9,600 ఇళ్లు ఉన్న ఈ పట్టణంలో గతంలో మురుగు వ్యవస్థ మొత్తం రెండు ప్రధాన నాలాలపైనే ఆధారపడింది. మురుగు శుద్ధిపై పరిశోధనలు చేస్తున్న జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్‌ పరిశోధన సంస్థ(సీఎస్‌ఐఆర్‌-నీరి) నాగ్‌పుర్‌ శాస్త్రవేత్తలు ఈ పట్టణాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని ‘వికేంద్రీకృత మురుగు శుద్ధి వ్యవస్థ’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మురుగంతా ప్రధాన నాలాల్లో కలవకుండా మూడు, నాలుగు వార్డులకు ఓ శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. తర్వాత శుద్ధి చేసిన నీటిని ప్రధాన డ్రెయిన్‌లోకి వదిలారు. ఇదే విధంగా నాగ్‌పుర్‌ పురపాలికలోనూ పీపీపీ పద్ధతిలో రూ.130 కోట్లతో అనేక మురుగుశుద్ధి ప్లాంట్లు నిర్మించి రోజుకు 48 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసి పారిశ్రామిక వినియోగానికి తరలిస్తున్నారు. వ్యర్థాల నుంచి సీఎన్‌జీని ఉత్పత్తి చేస్తున్నారు.


హైదరాబాద్‌లో అస్తవ్యస్తం

హైదరాబాద్‌ రోజూ 2000 మిలియన్‌ లీటర్ల(ఎంఎల్‌డీ) మురుగు ఉత్పత్తి అవుతోంది. 20 ఎస్టీపీలను ఏర్పాటు చేసి 740 ఎంఎల్‌డీ మురుగును శుద్ధి చేస్తున్నట్లు జలమండలి అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో జరగడంలేదు. రాజధానిలో దాదాపు 10 వేల కి.మీ. పొడవున డ్రెయినేజీలు ఉంటే 500 కి.మీ. మేర మురుగు ప్రవహిస్తూ అక్కడున్న శుద్ధి కేంద్రాలకు వెళుతోంది. ఈ మధ్యలో మురుగు నీరు పక్కనే ఉన్న చెరువులు ఇతర నీటి వనరుల్లో కలుస్తోంది. అర్వి పట్టణంలో ఉన్నట్లే ప్రతి కాలనీ/ పెద్దపెద్ద అపార్టుమెంట్ల దగ్గర ఒక మినీ మురుగుశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తేనే ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.  


విశాఖ, విజయవాడలలో ఇలా..

ఏపీలోని విశాఖ, విజయవాడ, కాకినాడల్లో తప్ప మిగతా పట్టణాల్లో శుద్ధి కేంద్రాలు పూర్తిస్థాయిలో లేవు. విజయవాడలో 1,357 కి.మీ. పొడవున డ్రెయినేజీ వ్యవస్థ ఉండగా రోజూ 148.9 ఎంఎల్‌డీ మురుగు ఉత్పత్తి అవుతోంది. ఏడు ఎస్టీపీల ద్వారా 130 ఎంఎల్‌డీల నీరు శుభ్రం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నంలో రోజూ 172 ఎంఎల్‌డీ మురుగు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ 5 ఎస్టీపీ కేంద్రాల ద్వారా 107 ఎంఎల్‌డీ మురుగు నీటిని శుద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి అంతస్థాయిలో శుద్ధికావడం లేదని ఆయా నగరాల స్థానికులు చెబుతున్నారు.


తక్షణం అమలు చేయాల్సిన విధానం ఇది..
- డాక్టర్‌ రితేష్‌ విజయ్‌, ‘నీరి’ ముఖ్య శాస్త్రవేత్త, నాగ్‌పుర్‌ కేంద్రం

హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వికేంద్రీకృత మురుగు నిర్వహణ వ్యవస్థ తక్షణ  అవసరం. కాలనీల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో ఎక్కడికక్కడ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయడం ద్వారా మూసీ, ఇతర జలవనరులకు పూర్వ వైభవం తీసుకురావచ్చు. ఇదే విధానాన్ని వరంగల్‌, కరీంనగర్‌, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి లాంటి నగరాల్లో చేపడితే మురుగు సమస్య తీరుతుంది.


* డయేరియా వంటి నీటి కాలుష్య వ్యాధులతో దేశంలో ఏటా 3,50,000 మంది చిన్నారులు మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

* దేశంలోని నగరాలు, పట్టణాల్లో రోజుకు 72 వేలకుపైగా మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతున్నా.. అందులో 30 శాతం మాత్రమే శుద్ధి జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

* రెండు తెలుగు రాష్ట్రాల్లో 124 పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. కాలువల నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని