200 డిజైన్లు.. 10 రంగులు

తెలంగాణలో 2022లో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికను ఖరారు చేసింది. ఈ ఏడాది బతుకమ్మ చీరలను 200 డిజైన్లలో, 10 రంగుల్లో తయారు చేయాలని నిర్ణయించింది.

Published : 10 Feb 2022 04:23 IST

ఈ ఏడాది కోటి బతుకమ్మ చీరలు
ఉత్పత్తి ప్రణాళిక ఖరారు
మరమగ్గాల యూనిట్ల యజమానులకు ఆర్డర్లు

ఈనాడు, హైదరాబాద్‌-ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: తెలంగాణలో 2022లో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికను ఖరారు చేసింది. ఈ ఏడాది బతుకమ్మ చీరలను 200 డిజైన్లలో, 10 రంగుల్లో తయారు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు చీరలు ఉత్పత్తి చేయాలంటూ మరమగ్గాల యజమానులకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. వచ్చే ఆగస్టు నాటికి ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్దేశించింది. గతంలో ఉన్న జరీ (బంగారు వర్ణం నూలు) స్థానంలో ఈ సారి రంగుల నూలుతో డిజైన్లను రూపొందించారు. సిరిసిల్ల పరిశ్రమలోని 271 మ్యాక్స్‌, ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల యజమానులు బుధవారం నుంచి వస్త్రోత్పత్తి ఆర్డర్లు తీసుకుంటున్నారు. అధికారులు ఈ ఏడాది సిరిసిల్లకు 4.48 కోట్ల మీటర్లు, కరీంనగర్‌లోని గర్షకుర్తికి 14 లక్షలు, హనుమకొండకు 6.31 లక్షలు, వరంగల్‌కు 93 వేలు, మండేపల్లి టెక్స్‌టైల్‌ పార్కుకు 24 లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తికి ఆర్డర్లు కేటాయించారు. రాష్ట్రంలో ఈ ఏడాది బతుకమ్మ చీరల కోసం 5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేశారు. మరో వారం, పది రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. బతుకమ్మ చీరల ఉత్పత్తితో ఈ ఆరు నెలల కాలంలో ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.900 వరకు వేతనం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల కంటే ముందే చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని