దళితబంధుకు నిధుల కొరత లేదు

తొలిదశలో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ మార్చి చివరికల్లా దళితబంధు పథకాన్ని పూర్తిస్థాయిలో అందించేలా కసరత్తు ముమ్మరంగా సాగుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య

Published : 03 Mar 2022 04:37 IST

త్వరగా యూనిట్లు పెట్టించండి
అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, సంగారెడ్డి: తొలిదశలో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ మార్చి చివరికల్లా దళితబంధు పథకాన్ని పూర్తిస్థాయిలో అందించేలా కసరత్తు ముమ్మరంగా సాగుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉంటుందన్నారు. ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులుంటాయని ఆయన స్పష్టం చేశారు. దళితబంధు, మనఊరు - మనబడి పథకాలపై ఉమ్మడి మెదక్‌ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సంగారెడ్డిలోని జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని దళితబంధు పథకానికి నిధుల కొరత లేకుండా చూస్తున్నారన్నారు. తక్షణం యూనిట్లు ప్రారంభించేలా చొరవ చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మెడికల్‌ షాపులు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు, ఎరువుల దుకాణాలు తదితర వ్యాపారాలు ప్రారంభించే వారి నుంచి సంబంధిత విభాగాల అధికారులు రుసుములు వసూలు చేయవద్దన్నారు. మనఊరు - మన బడి కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.7,289 కోట్లు ఖర్చు పెట్టబోతోందన్నారు. మొదటి దశలో 35 శాతం బడులను ఎంపిక చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నామని మంత్రి వివరించారు. పాఠశాల యాజమాన్య కమిటీల ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరిగేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా సర్కారు బడులను మార్చడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమంలో బోధన మొదలవుతుందన్నారు. బడిని బాగుచేసుకునే క్రమంలో పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, గ్రామస్థుల భాగస్వామ్యం ఉండేలా చొరవ చూపాలని హరీశ్‌రావు కోరారు. మనఊరు-మనబడి కోసం తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తామని ఈ సందర్భంగా వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు తెలిపారు. తన నెల రోజుల వేతనం రూ.2 లక్షలను ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని