పరిమితికి మించి రాష్ట్ర అప్పులు

చెల్లించాల్సిన రుణం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన లక్ష్యాలకు తగ్గట్లుగానే ఉన్నా, బడ్జెటేతర రుణాలను పరిగణనలోకి తీసుకుంటే లక్ష్యానికి మించి అప్పులు ఉన్నాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)

Published : 16 Mar 2022 04:01 IST

ఆస్తుల కల్పన మీద ప్రభావం

వనరుల్ని పెంచుకోవాల్సి ఉంది

నివేదికలో వెల్లడించిన కాగ్‌

ఈనాడు - హైదరాబాద్‌

చెల్లించాల్సిన రుణం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన లక్ష్యాలకు తగ్గట్లుగానే ఉన్నా, బడ్జెటేతర రుణాలను పరిగణనలోకి తీసుకుంటే లక్ష్యానికి మించి అప్పులు ఉన్నాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొంది. 2019-20లో తీసుకున్న రుణాల్లో 75 శాతానికి పైగా, 2020-21లో తీసుకున్న రుణాల్లో 76.53 శాతం వరకు గతంలో తీసుకున్న అప్పులు చెల్లించడానికే వినియోగించాల్సి రావడంతో ఆస్తుల కల్పన మీద దాని ప్రభావం పడిందని తెలిపింది. 2021 మార్చి 31 వరకు చెల్లించాల్సిన మొత్తం అప్పుల్లో రూ. 1,06,468 కోట్లు (45.86 శాతం) రానున్న ఏడేళ్లలో తీర్చాలని, దీన్ని తట్టుకోడానికి రాష్ట్రం వనరులను పెంచుకోవాలని వివరించింది. ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్‌ రుణాల ద్వారానే సమకూరిందని తెలిపింది. 2020, 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆడిట్‌ నివేదికను మంగళవారం తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. అందులోని ముఖ్యాంశాలివి..

* 2019-20 నాటికి చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ. 2,32,181 కోట్లు కాగా, వివిధ ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు రూ. 85,380.96 కోట్ల రుణాలు తీసుకున్నాయి. 2020-21 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 2,71,018 కోట్లకు చేరగా, బడ్జెటేతర రుణాలు రూ. 97,940.45 కోట్లుగా ఉంది. వీటికి సంబంధించిన వడ్డీ, అసలు మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్‌ నుంచి చెల్లించాల్సి ఉంటుందని ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు, మూడు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు తెలిపాయి. రుణం ఇచ్చిన సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తుల విలువ రూ. 70,687.89 కోట్లు. అసలు, వడ్డీ తీర్చడానికి 2019-20 సంవత్సరంలో బడ్జెట్‌ నుంచి రూ. 6,557.26 కోట్లను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ పద్దులలో దీనిని ఆస్తులుగా పేర్కొంది.

* బడ్జెట్‌కు బయట తీసుకున్న రుణాలను పూర్తిగా సంపద సృష్టించడం కోసమే వినియోగిస్తున్నామని, ఆ ఖర్చును క్యాపిటల్‌ వ్యయంగానే పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ లాంటి పథకాలకు బడ్జెటేతర రుణాలు తీసుకున్నట్లు వివరించింది. అయితే వాటి వినియోగానికి సంబంధించిన విధానాన్ని ప్రభుత్వం తెలపలేదని, దీనిపై విధానపరమైన మార్గదర్శకాలు స్పష్టంగా లేకుంటే భవిష్యత్తులో వాటిని వేరేలా ఖర్చు చేసే ప్రమాదం ఉందని కాగ్‌ పేర్కొంది. ఈ రుణాలకు సంబంధించిన వనరులను, ప్రయోజనాలను, పరిధిని సరైన రీతిలో ప్రకటించడం లేదని, ఫలితంగా కీలకమైన ప్రభుత్వ సామాజిక, ఆర్థిక పథకాలు/ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధాన వనరులు శాసనసభల నియంత్రణ, పర్యవేక్షణకు వెలుపల ఉండిపోయే అవకాశం ఉందని కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

* చెల్లించాల్సిన రుణం, జీఎస్‌డీపీల మధ్య నిష్పత్తి 2016-17 సంవత్సరంలో 18.42 శాతం ఉండగా, 2020-21 నాటికి 23.68 శాతానికి పెరిగింది. బడ్జెటేతర రుణాలను కూడా పరిగణలోకి తీసుకొంటే అప్పులు - రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 38.10 శాతం అవుతుందని కాగ్‌ పేర్కొంది. అయితే దీంతో ప్రభుత్వం ఏకీభవించలేదని, బడ్జెటేతర రుణాలను ఆయా సంస్థలు తమ పద్దుల నుంచే తిరిగి చెల్లిస్తాయని, వీటిని రాష్ట్రం అప్పుల్లో కలపడానికి లేదని పేర్కొన్నట్లు వెల్లడించింది.

* వడ్డీ చెల్లింపులు రెవెన్యూ రాబడిని హరించివేస్తున్నాయని, 2015-16 సంవత్సరంలో రెవెన్యూ రాబడితో పోల్చితే 9.93 శాతం ఉన్న వడ్డీ చెల్లింపులు 2019-20 నాటికి 14.03 శాతానికి పెరిగాయని వివరించింది. 14వ ఆర్థిక సంఘం అంచనా వేసిన (8.39 శాతం) కంటే ఇది ఎక్కువ అని తెలిపింది. తీసుకున్న రుణాలను అభివృద్ధి పనులకు, ఆస్తులను సృష్టించడానికి వినియోగిస్తే మంచిదే కానీ రోజువారీ అవసరాల కోసమో, చెల్లించాల్సిన రుణాల మీద వడ్డీ కట్టడానికో తీసుకోవడం మాత్రం మంచిది కాదని పేర్కొంది. 

* 2020 మార్చి నాటికి ఇచ్చిన పూచీకత్తులు రూ. 89,601 కోట్లు. 2018-19లో రెవెన్యూ రాబడి రూ. 1,01,420 కోట్లతో పోల్చితే ఇది 88 శాతం. అయితే ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం ఇది 200 శాతం వరకు ఉండొచ్చు. ఇచ్చిన పూచీకత్తులలో 66 శాతం కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథకేనని కాగ్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని