Updated : 12/10/2021 10:40 IST

కొవిడ్‌ ముప్పు తొలగిపోలేదు

లక్షణాలుంటే వైరల్‌ జ్వరమని నిర్లక్ష్యం చేయొద్దు
ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకూ ఇన్‌ఫెక్షన్‌కు గురికానివారు, టీకా తీసుకోని వారు వైరస్‌ బారినపడుతున్నారని తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలున్నా.. వైరల్‌ జ్వరం కావచ్చనే భావనతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా పరీక్షలు చేయించుకోవడం లేదని, ఈ కారణంగా వ్యాధి ముదిరిపోయి కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. కొత్తగా కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో యుక్త వయస్కులు ఎక్కువగా ఉంటున్నారన్నారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా లక్షణాలున్నవారు ముందుగా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌ జ్వరాలు 90-95 శాతం, 5-10 శాతం డెంగీ, మలేరియా జ్వరాలు నమోదవుతున్నట్టు చెప్పారు. కోఠిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితి, టీకాల పంపిణీపై ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మాస్కు మరచిపోతే ముప్పు తెచ్చుకున్నట్టే
‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడోదశ ఉద్ధృతి వచ్చే అవకాశాల్లేవు. డెల్టా వంటి రకాలు(వేరియంట్లు) రాకపోతే ఇది సాధారణ వైరస్‌లా మారి, కొన్ని ప్రాంతాలకు, కొన్ని సీజన్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. అలాగని నిర్లక్ష్యంగా ఉండటం సరికాదు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గినా.. కేరళ, మహారాష్ట్ర తదితర ఇతర రాష్ట్రాల్లో ఇంకా కొవిడ్‌ కేసులు గుర్తింపు స్థాయిలో నమోదవుతున్నాయి. అందుకే తప్పనిసరి అయితే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా అక్టోబరు-డిసెంబరు మధ్య మూడు నెలలపాటు అప్రమత్తత అవసరం. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. గత జూన్‌, జులైలో 80-90 శాతం వరకూ మాస్కు ధరించారు. ఇప్పుడు కేవలం 15-20 శాతం మంది మాత్రమే ధరిస్తున్నారు. ఎవరూ వ్యక్తిగత దూరం పాటించడం లేదు. ఇలాగైతే ముప్పు తెచ్చుకున్నట్టే.

రెండో డోసు స్వీకరిస్తేనే రక్షణ
తెలంగాణలో 18 ఏళ్లు పైబడినవారు 2.76 కోట్ల మంది ఉండగా, ఇప్పటికే 2.01(72శాతం) కోట్ల మందికి ఒక డోసు టీకా ఇచ్చాం. రెండు డోసులు పొందినవారు 38 శాతం మంది ఉన్నారు. నిత్యం 3-3.5 లక్షల మందికి టీకాలు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఇంకా 25 లక్షల మంది గడువు ముగిసినా రెండోడోసు తీసుకోలేదు. తప్పనిసరిగా రెండోడోసు స్వీకరిస్తేనే 100 శాతం రక్షణ లభిస్తుందనే విషయాన్ని వారంతా గుర్తించాలి.

78 రోజుల్లోనే కోటి టీకాలు
తొలి కోటి డోసుల టీకా ఇవ్వడానికి 160 రోజులు పట్టగా, రెండో కోటికి 78 రోజులే పట్టింది. మరో నాలుగైదు రోజుల్లో మూడో కోటి డోసుల పంపిణీ పూర్తవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 30 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి’’ అని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. కొవిడ్‌తో మరణించిన వారికి రూ.50 వేల నష్టపరిహారంపై ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదన్నారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని