పోలీస్‌శాఖలో ‘స్పౌస్‌ కేటగిరీ’పై సందిగ్ధత

పోలీస్‌శాఖలో కొత్త జోనల్‌ పోస్టింగ్‌ల విషయమై కొన్ని అంశాల్లో నెలకొన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. స్పౌస్‌ కేటగిరీ విషయంలో ఎలా వ్యవహరిస్తారో స్పష్టత లేకపోవడంతో పలువురు ఆందోళనతో ఉన్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా

Published : 15 Jan 2022 06:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: పోలీస్‌శాఖలో కొత్త జోనల్‌ పోస్టింగ్‌ల విషయమై కొన్ని అంశాల్లో నెలకొన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. స్పౌస్‌ కేటగిరీ విషయంలో ఎలా వ్యవహరిస్తారో స్పష్టత లేకపోవడంతో పలువురు ఆందోళనతో ఉన్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా పోలీస్‌ యూనిట్లలో పదుల సంఖ్యలోనే ఈ కేటగిరీ ఉద్యోగులున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుల్‌ ర్యాంకులో ఎక్కువ మంది ఉన్నారు. వీరిని ఇప్పటికే కొత్త పోస్టింగ్‌ల్లో నియమించారు. జూనియర్లకు సుదూర ప్రాంతాలకు బదిలీ కావడంతో నిత్యం అక్కడికి వెళ్లి రావాల్సి వస్తోంది. వీలైనంత తొందరగా స్పౌస్‌ కేటగిరీపై నెలకొన్న ఉత్కంఠకు తెర దించాలని వారు కోరుతున్నారు.

డీఎస్పీ పోస్టింగ్‌ల విషయంలోనూ ఉత్కంఠ
కొత్త జోనల్‌ పోస్టింగ్‌లకు సంబంధించి విధివిధానాలపై జారీ చేసిన 317 జీవో ప్రకారం డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లను మల్టీజోనల్‌ కేడర్‌గా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని మల్టీజోన్‌-1, మల్టీజోన్‌-2గా విభజించి ఈ కేటాయింపులు చేపట్టారు. ఇది స్వల్ప మార్పులు మినహా పాత జోనల్‌ విధానంలో మాదిరే ఉంది. పాత జోనల్‌ విధానం ప్రకారం ఉత్తర తెలంగాణ జిల్లాలు జోన్‌-5 (ప్రస్తుతం మల్టీజోన్‌-1)లో, దక్షిణ తెలంగాణ జిల్లాలు జోన్‌-6(ప్రస్తుతం మల్టీజోన్‌-2)లో ఉండేవి. తాజా జీవో ప్రకారం ఇన్‌స్పెక్టర్ల, డీఎస్పీల కేటాయింపు ఏ మల్టీజోన్‌లో జరిగితే అక్కడే పోస్టింగ్‌ ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. ఇన్‌స్పెక్టర్ల వరకు గతంలో మాదిరిగానే జోనల్‌ పోస్టింగ్‌లే కావడంతో చిక్కు లేదు. కానీ డీఎస్పీలు మాత్రం గతంలో రాష్ట్రస్థాయి పోస్టుగా ఉండేది. ప్రస్తుతం దీన్ని మల్టీజోనల్‌ పోస్టుగా నిర్ణయించడమే ఉత్కంఠకు గురిచేసే అంశం. నియామకాల వరకు మాత్రమే డీఎస్పీ పోస్టును మల్టీజోనల్‌గా పరిగణించి.. పోస్టింగ్‌ సమయంలో రాష్ట్రస్థాయి పోస్టుగా లెక్కలోనికి తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ సాంకేతికంగా అలా కుదురుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరోపక్క ప్రస్తుతానికి సర్దుబాటు చేసిన అనంతరం పోస్టింగ్‌ల్లో డీఎస్పీని రాష్ట్రస్థాయి పోస్టుగా కొత్త జీవో తీసుకొస్తారనే ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని