TS News: ఇంటికి ఆరు మొక్కలు

రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గురువారం నుంచి నాలుగోవిడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనుంది. జులై 10 వరకు జరిగే ఈ

Updated : 30 Jun 2021 11:38 IST

పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

దోమల నివారణ చర్యలపై దృష్టి

ఒకరోజు ‘విద్యుత్‌’ మరమ్మతులు

మెరుగైన జీవన పరిస్థితులే లక్ష్యం

పల్లె, పట్టణ ప్రగతిపై మార్గదర్శకాలు జారీ

రేపటి నుంచి 10 రోజుల పాటు కార్యక్రమం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గురువారం నుంచి నాలుగోవిడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనుంది. జులై 10 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, హరితహారం, విద్యుత్తు ప్రధాన ఎజెండా. పచ్చదనం పెంచేందుకు ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన జీవన పరిస్థితులే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేసింది. ‘‘భారీగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించండి. నాటిన వాటిలో 85 శాతం బతకాలి. చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటాలి. ఒక రోజు పూర్తిగా విద్యుత్‌ సంబంధిత సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి. ప్రకృతి బృహత్‌ వనాలకు స్థలాల్ని గుర్తించండి. అలాగే సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు కీలకం. మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలి. మంచినీటి పైపులైన్లు, నల్లాల లీకేజీలకు మరమ్మతులు ముఖ్యం. నీటి ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేయాలి. లోతట్టు ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వాన నీటి నిల్వకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోండి. డ్రెయినేజీలలో పూడిక తీసి మురుగునీరు, వాననీరు ఎలాంటి అవరోధం లేకుండా వెళ్లేలా చూడాలి’’ అని ప్రభుత్వం ఆదేశించింది. పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలు విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశాయి.

కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు

ఎంపీ నుంచి గ్రామ స్థాయిలో వార్డు సభ్యుడిదాకా ప్రజాప్రతినిధులందరూ ఈ మహా క్రతువులో భాగస్వాములు కావాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూడాలంది.  ‘‘ఈ కార్యక్రమంలో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలి. పల్లె, పట్టణ ప్రగతికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని నిర్వహించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లు ప్రగతి కార్యక్రమాలపై నివేదికలను ప్రభుత్వానికి పంపాలి.

నిరుపయోగ బోరు బావులు పూడ్చివేయాలి

నిరుపయోగంగా ఉన్న మురుగునీటి కాలువలు, బావులు, బోరుబావుల్ని పూడ్చివేయాలి. శిథిల భవనాల కూల్చివేత నిర్వహించాలి. పిచ్చి మొక్కల్ని తొలగించాలి. ప్రతి ఇంటి నుంచి ట్రాక్టర్లలో రోజూ చెత్తను సేకరించాలి. వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు పూర్తిచేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాలి. పట్టణాల్లో ప్రైవేటు వ్యక్తుల ఖాళీ స్థలాలు పరిశుభ్రంగా ఉండేలా యజమానులకు నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ప్రభుత్వం పేర్కొంది.

పవర్‌డేలో ఇలా...

ప్రగతి కార్యక్రమాల్లో ఒక రోజును పవర్‌డేగా నిర్వహించాలి. ఇందులో భాగంగా వంగిపోయిన, తుప్పుపట్టిన, విరిగిపోయిన విద్యుత్తు స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటుస్తారు. వీధి దీపాలకు మూడోవైరు ఏర్పాటు చేయని చోట వాటిని సరిచేసి, మీటర్లు బిగిస్తారు.

సర్పంచ్‌.. కౌన్సిలర్‌.. కార్పొరేటర్‌

గ్రామాల్లో సర్పంచ్‌లు, పట్టణాల్లో వార్డు కౌన్సిలర్లు, నగరాల్లో డివిజన్‌ కార్పొరేటర్లు వారి వారి ప్రాంతాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం పేర్కొంది. ‘‘గ్రామాల్లోని పల్లెప్రగతి బృందంలో సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, లైన్‌మెన్‌, మిషన్‌ భగీరథ సహాయకుడు ఉండాలి. సర్పంచి, కార్యదర్శి కలిసి గ్రామప్రగతి నివేదిక రూపొందించి ఆ ప్రతులు గ్రామసభకు అందజేయాలి. ఈ-పంచాయతీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. పంచాయతీ కార్యదర్శులు రోజూ పల్లెప్రగతి నివేదికలను వెబ్‌సైట్లో ఉంచాలి.

పట్టణాలు/నగరాల్లో వార్డు లేదా డివిజన్‌ను యూనిట్‌గా పరిగణించి బృందాలను ఏర్పాటు చేయాలి. కౌన్సిలర్‌/కార్పొరేటర్‌, పర్యవేక్షణాధికారి, పారిశుద్ధ్య ఉద్యోగి, నీటి సరఫరా ఉద్యోగి బృందంలో ఉండాలి.

ఎకరం అంతకంటే ఎక్కువ ఖాళీ స్థలాల్లో పట్టణ ప్రకృతి వనాలను పెంచాలి. ప్రతి పట్టణంలో ఐదెకరాలకంటే ఎక్కువ స్థలంలో పట్టణ ప్రకృతి బృహత్‌ వనం ఉండేలా చర్యలు చేపట్టాలి. రెండెకరాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్‌లు, వైకుంఠధామాల టెండర్లపై నిర్ణయం తీసుకుని వర్క్‌ ఆర్డర్లు ఇవ్వాలి. ప్రతి పట్టణానికి ఒక వైకుంఠ రథం తప్పనిసరిగా ఉండాలి.

దోమల నివారణకు నీటి గుంతల్లో మురుగునీటిని తొలగించి, ఆయిల్‌ బాల్స్‌ వేయాలి. దోమల నివారణ రసాయనాలు చల్లడంతో పాటు ఫాగింగ్‌ చేయాలి’’ అని ప్రభుత్వం మార్గదర్శకాల్లో వివరించింది.

1 నుంచి 10 వరకు హరితహారం ప్రత్యేకడ్రైవ్‌

ఏడో విడత తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇప్పటివరకు వర్షాలు పడిన చోట్ల అక్కడక్కడా మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా మాత్రం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం జులై 1 నుంచి 10 వరకు పది రోజుల పాటు ప్రత్యేకడ్రైవ్‌ చేపట్టనున్నారు. 2021-22కు 19.91 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని