బియ్యం బరువయ్యాయి!

రాష్ట్రంలో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ కొనసాగింపుపై కేంద్రం నుంచి మంగళవారం కూడా అనుమతి రాలేదు. ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో బియ్యం సేకరణను కేంద్రం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఉచిత బియ్యం

Updated : 29 Jun 2022 05:54 IST

సేకరణకు ఇంకా అనుమతివ్వని కేంద్రం

న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు రాష్ట్రం యోచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ కొనసాగింపుపై కేంద్రం నుంచి మంగళవారం కూడా అనుమతి రాలేదు. ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో బియ్యం సేకరణను కేంద్రం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయలేదన్నది ఇందుకు ఒక కారణంగా పేర్కొంది. అయితే రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ సాగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపి నాలుగైదు రోజులవుతున్నా కేంద్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. మంగళవారం నాటికి ఉచిత బియ్యం పంపిణీ 90 శాతం పూర్తయినట్లు సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్ల వద్ద 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. గత ఏడాది యాసంగి సీజనుకు సంబంధించి 3.71 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు గురువారంతో గడువు పూర్తవుతుంది. మరో రెండు సీజన్లకు సంబంధించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాల్సి ఉంది. నిల్వలు భారీగా ఉండటంతో ఆరుబయట నిల్వ చేశారు. ఇవి వర్షాలకు తడిచి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యంలో కొంత మొత్తాన్ని వేలం ద్వారా విక్రయించాలన్న మిల్లర్ల వినతిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఒప్పందాన్ని ఉల్లంఘించడమే!: బియ్యం సేకరణకు కేంద్రం అనుమతిపై మంగళవారం వరకు వేచి చూడాలని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ఆ గడువు కూడా పూర్తయింది. కేంద్ర కోటా కింద నిర్దిష్ట మొత్తంలో బియ్యం తీసుకుంటామని రాష్ట్రంతో ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి కస్టం మిల్లింగ్‌ పథకం కింద మిల్లర్లకు ఇస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇస్తారు. బియ్యం సేకరణను నిలిపివేయటం ద్వారా ఒప్పందాన్ని కేంద్రం ఉల్లంఘించినట్లు అవుతుందని అధికారుల అభిప్రాయంగా ఉంది. ఈ క్రమంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఎఫ్‌సీఐ గోదాములకు పంపిన 150 లారీల బియ్యాన్ని తక్షణం అన్‌లోడ్‌ చేసుకోవాలని ఈ నెల 22న హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఎఫ్‌సీఐ అధికారులు ఆ బియ్యాన్ని అన్‌లోడ్‌ చేసుకున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఆ ఉత్తర్వులు కూడా ఉపకరిస్తాయని న్యాయనిపుణుల అభిప్రాయపడినట్లు తెలిసింది.

మిల్లర్ల ఆందోళన..: కేంద్రం అర్ధాంతరంగా బియ్యం సేకరణను నిలిపివేయటంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని