TSLPRB: ఎస్సై పరీక్షలో 8 ప్రశ్నల తొలగింపు

ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో ఏకంగా 8 తప్పులు దొర్లాయి. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో 554 పోస్టులకు

Updated : 13 Aug 2022 08:51 IST

ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని నిర్ణయం.. కీ విడుదల
52 మార్కులు వస్తే గట్టెక్కినట్లే

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో ఏకంగా 8 తప్పులు దొర్లాయి. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో 554 పోస్టులకు ఈ నెల 7న నిర్వహించిన పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా తప్పుల విషయం వెల్లడైంది. ఇంగ్లీష్‌-తెలుగు వెర్షన్‌లోని ‘ఎ’ బుక్‌లెట్‌లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొత్తం 200 ప్రశ్నలకు 60 మార్కులను (30%) అర్హతగా నిర్ణయించిన సంగతి విదితమే. తాజా నిర్ణయం నేపథ్యంలో 52 మార్కులొచ్చిన అభ్యర్థి సైతం పరీక్షలో గట్టెక్కినట్లే. ఆయా అభ్యర్థులు తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించినట్లవుతుంది. మరో ఆరు ప్రశ్నలకు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ‘ఎ’ బుక్‌లెట్‌లో 54వ ప్రశ్నకు 3 సరైన సమాధానాలుండగా.. 114, 183, 186, 192, 197 ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలున్నాయి. వీటిలో దేనికి బబ్లింగ్‌ చేసినా మార్కులిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకటికంటే ఎక్కువ సమాధానాలున్న ప్రశ్నలకు సైతం మార్కులు కలపాలనే వాదన వినిపిస్తోంది. ‘తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులున్నందున పలువురు అభ్యర్థులు వాటిని వదిలేసే అవకాశముంది. దీంతో బహుళ సమాధానాలున్న ప్రశ్నలకూ మార్కులు కలపాలి’ అని అక్షర సర్కిల్‌ నిర్వాహకుడు విష్ణువర్ధన్‌ డిమాండ్‌ చేశారు.

అభ్యంతరాలపై 15 వరకు చెప్పొచ్చు..

పరీక్ష ‘కీ’ని www.tslprb.in  వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. కీపై అభ్యంతరాలుంటే వాటిని.. వెబ్‌సైట్లో పొందుపరచిన ప్రత్యేక నమూనాపత్రం ద్వారా ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ తెలపవచ్చని వెల్లడించారు. ప్రతి ప్రశ్నను వేరువేరుగా సమర్పించాలని, సంబంధిత ధ్రువపత్రాలను జతచేయాలని ఛైర్మన్‌ స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని, వ్యక్తిగతంగా ఇచ్చే అభ్యర్థనలను స్వీకరించబోమని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని