నిబంధనతో రైతుబీమాకు దూరం

వయసు నిబంధన రైతు కుటుంబాల జీవిత బీమా రక్షణకు ప్రధాన అడ్డంకిగా మారింది. రైతుబీమా పథకం కింద 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న రైతులే అర్హులని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించడం వల్ల 33 లక్షల మంది అనర్హులయ్యారు.

Published : 30 Jan 2023 04:14 IST

అర్హత వయసు పెంచితే మరో 33 లక్షల మందికి రక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: వయసు నిబంధన రైతు కుటుంబాల జీవిత బీమా రక్షణకు ప్రధాన అడ్డంకిగా మారింది. రైతుబీమా పథకం కింద 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న రైతులే అర్హులని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించడం వల్ల 33 లక్షల మంది అనర్హులయ్యారు. భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)కి ఏటా ప్రభుత్వం రైతుల తరఫున ప్రీమియం చెల్లిస్తోంది. ఒకవేళ రైతు ఏదైనా కారణంతో మరణిస్తే నామినీకి రూ.5 లక్షల పరిహారాన్ని ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. 2018-22 మధ్య నాలుగేళ్లలో 92,203 మంది రైతులు మృతి చెందగా.. పరిహారం కింద రూ.4,610 కోట్లు చెల్లించింది. ప్రస్తుత యాసంగి(2022-23) సీజన్‌లో మొత్తం 70 లక్షల మందికి ‘రైతుబంధు’ పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ గత నెలలో వెల్లడించింది. కానీ, రైతుబీమా పథకం కింద ఈ ఏడాది ప్రభుత్వం 37.76 లక్షల మందికి సంబంధించిన ప్రీమియం మాత్రమే చెల్లించింది. రాష్ట్ర అర్థగణాంక శాఖ తాజా గణాంకాల నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలోని రైతుల్లో దాదాపు సగం మందికే బీమా సదుపాయం అందుతోంది.

అర్హత పొందనివారిలో నిరుపేద రైతులు!

వయసు నిబంధన కారణంగా బీమా భరోసా అందని వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన తక్కువ భూమి కలిగిన నిరుపేద రైతులే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్రంలో హెక్టారు(2.47 ఎకరా)లోపు భూమి కలిగిన ఎస్సీ రైతులు 7.34 లక్షల మంది ఉండగా.. వారిలో గతేడాది రైతుబీమా అర్హత పొందినవారు 3.87 లక్షల మంది(52.72%) ఉన్నారు. 34.80 లక్షల మంది బీసీ రైతుల్లో అర్హత కలిగినవారు 19.16 లక్షల మందే ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని