కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు

కేసులను వేగంగా పరిష్కరించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తెలిపారు.

Published : 06 Feb 2023 04:36 IST

స్థానిక భాషలో తీర్పులతో ప్రజలకు మరింత చేరువగా న్యాయవ్యవస్థ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

ధర్మారం, న్యూస్‌టుడే: కేసులను వేగంగా పరిష్కరించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో ఏర్పాటుచేసిన జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ఆదివారం ఆయన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో న్యాయవ్యవస్థపై మరింత విశ్వాసం కల్పించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు సమష్టిగా కృషి చేయాల్సి ఉందన్నారు. ఆంగ్లంలో మాట్లాడితేనే పరిజ్ఞానం ఉన్నట్లు కాదన్నారు. తాను గువాహటీలో జూనియర్‌ జడ్జీల సెలక్షన్‌ కమిటీ ప్రతినిధిగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన సమయంలో విషయ పరిజ్ఞానం కలిగి ఉండి, ఆంగ్లంలో మాట్లాడలేకపోయినా ఎంపిక చేశానన్నారు. న్యాయశాస్త్ర కోర్సుల్లో తెలుగులో బోధన ఆవశ్యకతను ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నరసింహ ప్రస్తావించారన్నారు. స్థానిక ప్రజలు మాట్లాడే భాషలోనే కోర్టులు తీర్పులు వెలువరిస్తే ప్రజలకు న్యాయవ్యవస్థ మరింత చేరువవుతుందని అన్నారు. ముంబయి హైకోర్టులో మరాఠీ భాషలో ఉత్తర్వులు వెలువరించడం ద్వారా ఫలితం వచ్చిందన్నారు. మన రాష్ట్రంలోనూ స్థానిక భాష అమలుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 40ఏళ్ల కిందట తాను మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ప్రసంగం విన్నానన్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నానని, కొద్దిరోజుల్లో పూర్తిస్థాయిలో మాట్లాడేలా నేర్చుకుంటానని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు మాట్లాడుతూ స్వగ్రామంలో కోర్టు ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు. జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ కోర్టుల్లో మహిళా న్యాయవాదులు పెరుగుతుండటం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌, జస్టిస్‌ కె.సురేందర్‌, జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి, జస్టిస్‌ ఈ.వి.వేణుగోపాల్‌, జస్టిస్‌ నగేష్‌ భీమపాక, జస్టిస్‌ పి.కార్తీక్‌, జస్టిస్‌ కె.శరత్‌, జస్టిస్‌ జె.శ్రీనివాసరావు, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కె.సుజన, రిజిస్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌) డి.రమాకాంత్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు, కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి, పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేష్‌బాబు పాల్గొన్నారు.


‘కాళేశ్వరం’ అద్భుతం..

కోర్టును ప్రారంభించాక హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, న్యాయమూర్తులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నంది పంపుహౌస్‌ను సందర్శించారు. పంపుల పనితీరు, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌, విద్యుత్‌ నియంత్రికలను పరిశీలించారు. మోటార్లు, పథకం పనితీరును కాళేశ్వరం ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీధర్‌ వారికి వివరించారు. ఈ సందర్భంగా పంపుహౌస్‌ నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని