7 గంటలు... ప్రశ్నల వర్షం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీలో సాంకేతిక ఆధారాల సేకరణపై సిట్‌ పోలీసులు దృష్టిసారించారు.

Updated : 20 Mar 2023 06:58 IST

సాంకేతిక ఆధారాల సేకరణపై సిట్‌ దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీలో సాంకేతిక ఆధారాల సేకరణపై సిట్‌ పోలీసులు దృష్టిసారించారు. హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయంలో ఆదివారం 9 మంది నిందితులను వేర్వేరుగా విచారించారు. సిట్‌ అధిపతి ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో సైబర్‌క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ బృందం నిందితులను వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో 9 మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరినుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు శనివారం నుంచి 6 రోజుల కస్టడీకి తీసుకున్నారు. రెండోరోజు వీరిని వేర్వేరుగా కూర్చోబెట్టిన సిట్‌ బృందం ప్రశ్నలవర్షం కురిపించింది. వీరి నుంచి రాబట్టిన సమాధానాలను క్రోడీకరించి నిందితులు చెబుతున్న విషయాలు ఎంతవరకూ వాస్తవమనేది బేరీజు వేయనున్నారు. తొలిరోజు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి పొంతనలేని జవాబులు చెప్పినా రెండోరోజు దారిలోకి వచ్చినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా ఉంచిన సమాచారం, ప్రశ్నపత్రాలు, దరఖాస్తుదారుల వివరాలు బహిర్గతం చేసేందుకు నిందితులు ఉపయోగించిన మార్గాలపై ఆరా తీశారు. కమిషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారుల యూజర్‌ఐడీలు మార్చడం, పాస్‌వర్డ్‌లు చోరీ చేయడంలో సహకరించిన వారి గురించి ఆరా తీశారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిల్లో ముందుగా ప్రశ్నపత్రాలు లీకు చేయాలనే ఆలోచన ఎవరు చేశారనేది కూపీలాగే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో నిందితులిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం

కమిషన్‌లో కంప్యూటర్ల వినియోగం, మరమ్మతు, కొత్త సాఫ్ట్‌వేర్‌ తదితర అంశాలపై రాజశేఖర్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. ప్రవీణ్‌ కూడా బీటెక్‌ కంప్యూటర్స్‌ చదవటంతో ఇద్దరికీ సాంకేతిక అంశాలపై పట్టుంది. కంప్యూటర్ల మరమ్మతు ముసుగులో వీరిద్దరూ యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ సేకరించడం, వాటిని ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు అనువుగా వాడుకోవటం తేలికైందని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితుల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, వాట్సప్‌ ఛాటింగ్స్‌, సామాజిక మాధ్యమాలు వంటి వాటిలో ఆధారాల కోసం సైబర్‌ నిపుణులు నిమగ్నమయ్యారు. ప్రశ్నపత్రాలు ఎవరి కంప్యూటర్‌, యూజర్‌ ఐడీ ద్వారా బహిర్గతం అయ్యాయనే దానిపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని