తెలంగాణకు పీఎం స్వనిధి పురస్కారాలు

వీధి వ్యాపారులకు రుణాలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పీఎం-స్వనిధి, పట్టణ ప్రగతి పథకాల అమలులో తెలంగాణ కనబరిచిన ఉత్తమ పనితీరును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

Published : 02 Jun 2023 04:12 IST

కేంద్ర మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖకు అందజేత
వీధి వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలిచినందుకు గుర్తింపు

ఈనాడు, దిల్లీ: వీధి వ్యాపారులకు రుణాలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పీఎం-స్వనిధి, పట్టణ ప్రగతి పథకాల అమలులో తెలంగాణ కనబరిచిన ఉత్తమ పనితీరును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. గురువారం దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ తెలంగాణ అధికారులకు అవార్డులు అందజేసి అభినందించారు. రాష్ట్రంలోని మూడు నగరాలు మూడు కేటగిరీల్లో దేశంలోనే టాప్‌లో నిలవగా.. వివిధ కేటగిరీల్లో పలు పట్టణాలు మొదటి 10 స్థానాలను ఆక్రమించాయి. ఈ పథకాల కింద 3 దశల్లో రాష్ట్రంలోని 5,13,428 మంది వీధి వ్యాపారులకు రూ.695.41 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

* లక్షలోపు జనాభా ఉన్న 3,555 పట్టణాల్లో ఒక్కో వీధివ్యాపారికి రూ.10 వేల వరకు రుణాల పంపిణీలో.. తెలంగాణలోని సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్‌, కామారెడ్డి, బోధన్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి, మంచిర్యాల, పాల్వంచ, ఆర్మూర్‌ పట్టణాలు తొలి 10 స్థానాల్లో నిలిచాయి.

* లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1వ, నిజామాబాద్‌ కార్పొరేషన్‌ 10వ స్థానం సాధించాయి.

* 40 లక్షలకు పైబడిన జనాభా ఉన్న మెగాసిటీల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ 3వ స్థానంలో నిలిచింది.

* ఒక్కొక్కరికి రూ.20 వేల వరకు రుణాలు పంపిణీ చేసిన పట్టణాల్లో సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్‌, బోధన్‌, సిద్దిపేట, మంచిర్యాల, కోరుట్ల, ఆర్మూర్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌లు తొలి 10 స్థానాలు పొందాయి. ఇదే కేటగిరీలో లక్ష నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో నిజామాబాద్‌ 2వ, కరీంనగర్‌ 3, రామగుండం 10వ స్థానంలో, మెగాసిటీల్లో జీహెచ్‌ఎంసీ 2వ స్థానంలో నిలిచింది.

* రూ.50 వేల వరకు రుణాల పంపిణీ విభాగంలో లక్షలోపు జనాభా పట్టణాల్లో నిర్మల్‌, గద్వాల, సంగారెడ్డి, సిరిసిల్ల, పాల్వంచ, సిద్దిపేట, కొత్తగూడెం, బోధన్‌, వనపర్తి తొలి తొమ్మిది స్థానాలు సాధించాయి. ఇదే రుణ విభాగంలో లక్ష నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1వ స్థానంలో, రామగుండం 3, కరీంనగర్‌ 4, నిజామాబాద్‌ కార్పొరేషన్లు 10వ స్థానంలో నిలిచాయి. మెగాసిటీ కేటగిరీలో జీహెచ్‌ఎంసీ తొలి స్థానాన్ని ఆక్రమించింది.

* ‘పట్టణ ప్రగతి’ కింద అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో వ్యాపార ప్రాంతాలు ఏర్పాటుచేసి 2,676 వెండింగ్‌ షెడ్లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 1,294 షెడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని