TS POLYCET: పాలిసెట్‌లో తొలిసారి స్లైడింగ్‌ విధానం

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్‌ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు.  కన్వీనర్‌ ఆధ్వర్యంలోనే ఈ నూతన ప్రక్రియను నిర్వహిస్తారు.

Updated : 06 Jul 2023 08:50 IST

బ్రాంచి మారినా బోధనా రుసుములు పొందే అర్హత
కన్వీనర్‌ ఆధ్వర్యంలోనే నూతన ప్రక్రియ నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక బ్రాంచిలో చేరిన విద్యార్థులు మరో బ్రాంచికి మారే స్లైడింగ్‌ ప్రక్రియను ప్రవేశపెట్టనున్నారు.  కన్వీనర్‌ ఆధ్వర్యంలోనే ఈ నూతన ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటివరకు పాలిసెట్‌లో రెండు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఆ తర్వాత మిగిలిపోయిన సీట్లకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ జరుపుతున్నారు. ఈసారి రెండు విడతల కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత అప్పటికే కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరిన వారికి  స్లైడింగ్‌ నిర్వహిస్తారు. ఈ విధానం ద్వారా ఓ కళాశాలలో ఖాళీగా ఉన్న బ్రాంచీల్లో ఆ కళాశాలకే చెందిన మరో బ్రాంచి విద్యార్థులు చేరవచ్చు. ఈ ప్రక్రియను కన్వీనర్‌ ఆధ్వర్యంలో జరపడం వల్ల విద్యార్థులు మరో బ్రాంచికి మారినా బోధనా రుసుములు(ఫీజు రీయింబర్స్‌మెంట్‌) పొందేందుకు అర్హులవుతారు. ఇప్పటివరకు స్లైడింగ్‌ లేకపోవడం, రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత స్పాట్‌ ప్రవేశాలు జరుపుతుండటం వల్ల పాలిసెట్‌లో కనీస అర్హత పొందని వారు కూడా డిమాండ్‌ ఉన్న సీట్లలో చేరుతున్నారు. మెరిట్‌తో ఇతర బ్రాంచీల్లో చేరిన వారికి అవి దక్కడం లేదు. ఈ విషయాన్ని పాలిసెట్‌ ప్రవేశాల అధికారులు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఇన్‌ఛార్జి కమిషనర్‌, పాలిసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో స్లైడింగ్‌కు ఆమె అంగీకారం తెలిపినట్లు తెలిసింది. స్లైడింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

యాజమాన్యాలకే స్పాట్‌ ప్రవేశాల బాధ్యత

ఇప్పటివరకు పాలిసెట్‌లో స్పాట్‌ ప్రవేశాలను కన్వీనర్‌ ఆధ్వర్యంలో జరుపుతుండగా, ఇక నుంచి వాటిని కళాశాలల యాజమాన్యాలకే అప్పగించనున్నారు. స్పాట్‌ను వారికి ఇచ్చినా పాలిటెక్నిక్‌ కోర్సులకు డొనేషన్లు ఇచ్చే పరిస్థితి లేనందున అక్రమాలకు ఆస్కారం ఉండదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో 56 ప్రభుత్వ, 60 ప్రైవేట్‌ కళాశాలలున్నాయి. మొత్తం 29,396 సీట్లున్నాయి. పాలిసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ముగియగా, చివరి విడత సీట్లను గురు లేదా శుక్రవారాల్లో కేటాయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని