EPFO - Higher EPS: అధిక పింఛను దరఖాస్తులకు రేపే తుది గడువు

ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులకు అధిక పింఛను దరఖాస్తు గడువు ఈ నెల 11 (మంగళవారం)తో ముగియనుంది.

Updated : 10 Jul 2023 07:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులకు అధిక పింఛను దరఖాస్తు గడువు ఈ నెల 11 (మంగళవారం)తో ముగియనుంది. 2014 సెప్టెంబరు 1కి ముందు సర్వీసులో చేరి.. ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితికి మించి వేతనం పొందుతూ ఆ మేరకు ఈపీఎఫ్‌ చందా చెల్లిస్తున్న ఉద్యోగుల నుంచి ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు నాలుగు నెలల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ గడువు ముగియనుండటంతో మరోసారి పొడిగించే అవకాశాల్లేవని ఈపీఎఫ్‌వో వర్గాలు పేర్కొంటున్నాయి.

చందాదారులకు ఫోన్లు

అధిక పింఛనుకు అర్హత కలిగిన చందాదారులకు, దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన వారికి ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇందుకోసం ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశారు. సెలవు రోజుల్లోనూ చందాదారులకు సిబ్బంది ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరికైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు. దరఖాస్తులకు మంగళవారం చివరి రోజు కావడంతో.. సోమవారం కార్యాలయాల్లో అధికారులు అధిక పింఛను దరఖాస్తు సేవలందించడంతో పాటు చందాదారులకు  సందేహాలు నివృత్తి చేయాలని నిర్ణయించారు.

వారి దరఖాస్తుల తిరస్కరణ

2014 సెప్టెంబరు 1కి ముందు పదవీ విరమణ చేసిన పింఛనుదారులకు సంబంధించిన  దరఖాస్తుల్ని ఈపీఎఫ్‌వో తిరస్కరిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పులోని పేరా 44(5) ప్రకారం.. 2014 సెప్టెంబరు 1కి కన్నా ముందు పేరా 11(3) కింద అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వని చందాదారులకు అర్హత లేదని పేర్కొంటూ నోటీసులు జారీ చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని