క్రమం తప్పిన స్థలాల క్రమబద్ధీకరణ..!

ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. జీవో 58 కింద దరఖాస్తుల సర్వేకే అధికారులు ప్రాధాన్యమిచ్చారని, తమవి పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.

Published : 16 Aug 2023 04:05 IST

జీవో58 దరఖాస్తుల సర్వేకే ప్రాధాన్యం
తమవి చేయట్లేదని జీవో 59 దరఖాస్తుదారుల ఆవేదన
ప్రభుత్వం అవకాశమిస్తే.. అధికారులు అడ్డుపడుతున్నారని అసంతృప్తి

ఈనాడు, హైదరాబాద్‌: ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. జీవో 58 కింద దరఖాస్తుల సర్వేకే అధికారులు ప్రాధాన్యమిచ్చారని, తమవి పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. రెండో విడత సర్వేలోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. తమ స్థలాలు క్రమబద్ధీకరణ అవుతాయా.. లేదా అనే సందేహాలు వారిని వేధిస్తున్నాయి. కనీసం ఏ కారణంగా సర్వే చేపట్టడం లేదో చెప్పాలని కోరుతున్నారు. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా.. స్థానిక అధికారులు అడ్డుపడుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రెండు విడతల్లోనూ..

  • క్రమబద్ధీకరణలో భాగంగా జీవో 58 కింద 125 చదరపు గజాల్లోపు స్థలాన్ని ఉచితంగా, జీవో 59 కింద 125 చదరపు గజాలపైన అధీనంలో ఉన్న వారికి మార్కెట్‌ ధరకు రిజిస్ట్రేషన్‌ చేసి పట్టా అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
  • 2014 జూన్‌ 2 వరకు ‘ఆక్రమిత గడువుగా’ పేర్కొంటూ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఒకసారి దరఖాస్తులు స్వీకరించింది.
  • ఆక్రమిత గడువును 2020 జూన్‌ 2 వరకు పొడిగించి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో రెండోసారి దరఖాస్తులు స్వీకరించగా 2 లక్షలకుపైగా వచ్చాయి.
  • మొదటి విడత(జీవో 58) దరఖాస్తులపై గతేడాది చివర్లో సర్వే ప్రక్రియ నిర్వహించారు. ఆక్రమిత స్థలంలో నివాసం, ఖాళీ ప్రదేశాన్ని కొలతలు వేసి డిమాండ్‌ నోటీసులు అందజేశారు.
  • ఈ క్రమంలోనే జీవో 59 పరిధిలోని దరఖాస్తులను పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
  • ఇదిలా ఉండగానే ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండో విడత దరఖాస్తులు స్వీకరించిన రెవెన్యూ అధికారులు మరోసారి సర్వే ప్రారంభించారు.
  • ఇప్పుడు కూడా తమను పట్టించుకోవడం లేదని జీవో 59 దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్లను సంప్రదించొచ్చు

- నవీన్‌ మిత్తల్‌, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌

గతేడాది దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైనవారి స్థలాలను సర్వే చేశాం. జీవో 59 కింద కూడా దాదాపు అన్ని జిల్లాల్లో జరిగింది. సర్వే జరగని వారుంటే కలెక్టర్లకు విన్నవించవచ్చు. ఆక్రమిత గడువు పొడిగించాక వచ్చిన దరఖాస్తుల పరిశీలన తుది దశకు వచ్చింది. మరో నెల రోజుల్లో క్రమబద్ధీకరణ, పట్టాల పంపిణీ పూర్తి చేస్తాం.


భూముల ధరలే కారణమా..?

భూముల ధరలు అధికంగా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ శివారు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. స్థలాల ధర చదరపు గజం రూ.5 వేలకు మించి ఉన్నచోట ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు స్థలం విస్తీర్ణం 200 చదరపు గజాల్లోపు ఉన్న వాటికే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలాల అభివృద్ధి, విక్రయ విధానంలో భాగంగా పక్కన పెట్టి ఉండవచ్చనే భావిస్తున్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం నుంచి వచ్చిన డేటా మేరకే సర్వే చేపడతామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. చలానా కట్టి దరఖాస్తు చేసిన తమకు ఏ విషయం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందంటూ దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని