‘స్టేట్‌మెంట్‌’ దాఖలు విషయంలో అనిశ్చితి!

తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్‌-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది.

Updated : 19 Mar 2024 04:47 IST

కృష్ణా జలాల పునఃపంపిణీ కేసులో 20 వరకే గడువు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్‌-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ఇప్పటికే న్యాయవాదులు, నిపుణులతో ఏర్పాట్లు చేసుకుంటోంది. డ్రాఫ్ట్‌ను ప్రభుత్వానికి పంపించి ఆమోదం తీసుకోవాల్సి ఉండగా లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎంతమేరకు దృష్టి సారిస్తుందన్నది వేచి చూడాలి. మరోవైపు ఏపీలో శాసనసభ ఎన్నికలు కూడా జరగనుండటంతో ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. దీంతో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌ విషయంలో రెండు రాష్ట్రాలూ గడువు లోపు దాఖలు చేయడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.

కేసు వాదనలపైనా ప్రభావం..

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్‌-3 కింద కేంద్రం గత ఏడాది సెప్టెంబరులో కేడబ్ల్యూడీటీ-2కు విధివిధానాలు (టీవోఆర్‌) ఖరారు చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ-1 ‘ఎన్‌’ బ్లాక్‌ ప్రకారం చేసిన కేటాయింపులు 811 టీఎంసీలను, అదనంగా ట్రైబ్యునల్‌ చేసిన కేటాయింపులను తెలంగాణ, ఏపీలకు పునఃపంపిణీ చేసే బాధ్యతలను కేడబ్ల్యూడీటీ-2కు అప్పగించింది. గోదావరి నుంచి కృష్ణాకు చేపట్టే మళ్లింపుల్లో ట్రైబ్యునల్‌ నిబంధనల ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన వాటాను పరిష్కరించాలని కూడా కేంద్రం టీవోఆర్‌లో స్పష్టం చేసింది. ఈ క్రమంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఈ మార్చిలో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌, ఏప్రిల్‌లో వాదనలు వినేందుకు గడువు విధించింది. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌ దాఖలు తర్వాత రాష్ట్రాలు కౌంటర్లు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాదనలు ఉంటాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విచారణ ప్రక్రియలో కొంత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని