నాగార్జునసాగర్‌ భద్రతపై సమగ్ర అధ్యయనం

నాగార్జునసాగర్‌ డ్యాం భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయించాలని.. జాతీయ డ్యాం సేఫ్టీ చట్టం-2021 ప్రకారం ఇది తప్పనిసరని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

Published : 27 Mar 2024 05:04 IST

నిపుణుల కమిటీ సిఫార్సు

ఈనాడు హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ డ్యాం భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయించాలని.. జాతీయ డ్యాం సేఫ్టీ చట్టం-2021 ప్రకారం ఇది తప్పనిసరని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. కేంద్ర జలసంఘం సిఫార్సుల మేరకు గరిష్ఠ వరద ప్రవాహాన్ని(పీఎంఎఫ్‌) తాజాగా అంచనా వేయాలని సూచించింది. కొన్ని పియర్స్‌ బీటలు వారాయని.. స్పిల్‌వే గ్లేసియస్‌(నీరు కిందకు పడే ప్రాంతం) కొన్నిచోట్ల దెబ్బతిందని, వీటిని బాగు చేయడానికి చేపట్టిన మరమ్మతులను వర్షాకాలంలోగా పూర్తి చేయాలని సూచించింది. సాగర్‌ డ్యాంను పరిశీలించి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 13, 14 తేదీల్లో పర్యటించి నివేదిక ఇచ్చింది. ఇప్పటికే చేపట్టిన మరమ్మతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ పనులను వేగంగా పూర్తి చేయడంతోపాటు మరికొన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకు సంబంధించిన నివేదిక నీటిపారుదల శాఖకు అందింది. అందులోని ముఖ్యాంశాలు..

గరిష్ఠంగా 10.05 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వెళ్లేలా సాగర్‌ డ్యాంను డిజైన్‌ చేశారు. 2009లో 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని గేట్ల ద్వారా వదిలారు. ఈ సమయంలో స్పిల్‌వే దెబ్బతింది. తర్వాత అధ్యయనం చేసిన ఐఐటీ ఖరగ్‌పుర్‌.. సాగర్‌ వద్ద గరిష్ఠ వరద ప్రవాహం(పీఎంఎఫ్‌) 27 లక్షల క్యూసెక్కులుగా తేల్చింది. ‘డ్యాం బ్రేక్‌ ఎనాలసిస్‌’ చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ.. అత్యవసర ప్రణాళికను అందజేసింది. 2021లో కుడి కాలువ హెడ్‌రెగ్యులేటర్‌ తొమ్మిదో గేటు కొట్టుకుపోయింది. తర్వాత కొత్త గేటును అమర్చారు. 2022-23లో కుడి, ఎడమవైపు హెడ్‌ రెగ్యులేటర్ల గేట్లను మార్చారు. తాజాగా స్పిల్‌వేలకు అక్కడక్కడా ఉన్న సమస్యలను నిపుణుల కమిటీ గుర్తించింది. కొన్ని పియర్స్‌కు బీటలు ఏర్పడటం గుర్తించి వీటిని తరచూ పరిశీలించడంతోపాటు తదుపరి ఇన్వెస్టిగేషన్‌ చేయించాలని సూచించింది. స్పిల్‌వే దిగువ ప్రాంతంలో బాగా నష్టం వాటిల్లిందని, కొన్నిచోట్ల కాంక్రీటు పూర్తిగా పోయి రాళ్లు కూడా బయటకు వచ్చాయని, మొత్తం పనిని వర్షాకాలంలోగా పూర్తి చేయాలని పేర్కొంది. పునాదుల నుంచి వచ్చే సీపేజీని, డ్యాం బాడీ నుంచి వచ్చే సీపేజీని వేర్వేరుగా కొలవాలని, ఈ రికార్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించింది. భద్రత దృష్ట్యా సాగర్‌ గేట్ల నిర్వహణను కృష్ణా బేసిన్‌లోని ఇతర రిజర్వాయర్లతో కలిపి సంయుక్తంగా చేపట్టాలని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని