పాత సమస్యలకు కోడ్‌ అడ్డు కాదుగా..!

భూ సమస్యల దరఖాస్తులు మళ్లీ పెరుగుతున్నాయి. వానాకాలం లోపు పాసుపుస్తకాలు పొందితేగానీ ప్రభుత్వం అందించే సాయం, ప్రైవేటు రుణాలు పొందడానికి వీలుపడదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Published : 06 Apr 2024 06:29 IST

ధరణి దరఖాస్తుల పరిష్కారమెప్పుడు?
వానాకాలం లోపు పాసుపుస్తకాలు కోరుతున్న రైతులు

ఈనాడు, హైదరాబాద్‌: భూ సమస్యల దరఖాస్తులు మళ్లీ పెరుగుతున్నాయి. వానాకాలం లోపు పాసుపుస్తకాలు పొందితేగానీ ప్రభుత్వం అందించే సాయం, ప్రైవేటు రుణాలు పొందడానికి వీలుపడదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ధరణి పెండింగ్‌ దరఖాస్తులు 2.46 లక్షలకు తోడు మరో 2.5 లక్షల ఇతర సమస్యలు ఉన్నాయి. ధరణి పునర్నిర్మాణ కమిటీ సిఫార్సుల మేరకు కొత్త ప్రభుత్వం.. పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించింది. కానీ ఈలోగా లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ ప్రక్రియను రెవెన్యూశాఖ నిలిపివేసింది. కానీ కోడ్‌తో సంబంధం లేని పాత సమస్యలను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చాలా కాలం నుంచి భూమి హక్కులు అందని వారు ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు.

లాగిన్లు రాకుండా పరిష్కారమెలా?

ప్రతి సమస్యకూ పరిష్కారం చూపే అధికారాలు 2020 అక్టోబరు నుంచి జిల్లా కలెక్టర్‌కు మాత్రమే దఖలు పడ్డాయి. ఈ అధికారాల విభజన చేస్తే తప్ప సమస్యల పరిష్కారం వేగం పుంజుకోదని గుర్తించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరున కొత్త సర్క్యులర్‌తో తహసీల్దారు, ఆర్డీవోలకు అధికారాల విభజన చేసింది. దీంతోపాటు పెండింగ్‌ దరఖాస్తులను కూడా పరిష్కరించేందుకు కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్లకు పలు నిబంధనలు విధించింది. మరో సర్క్యులర్‌తో ప్రత్యేక డ్రైవ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ధరణి పోర్టల్లో ఆర్డీవో, తహసీల్దార్లకు లాగిన్లు ఏర్పాటు కాలేదు. ఒక్కో అధికారికి దాదాపు ఎనిమిది రకాల అధికారాలను ప్రత్యేకంగా కట్టబెట్టగా.. కేవలం రెండు రకాల లాగిన్లు మాత్రమే భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం నుంచి వచ్చాయి. ఎన్నికల కోడ్‌కు సంబంధం లేకపోయినా.. ఆర్డీవో, తహసీల్దార్లకు లాగిన్ల ఏర్పాటు, జిల్లాల స్థాయిలో పాత సమస్యల పరిష్కార ప్రక్రియలను కూడా నిలిపివేశారు. వానాకాలం ప్రారంభానికి మరో రెండు నెలలే మిగిలి ఉంది. ఈలోగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందితేగానీ ప్రభుత్వ సాయం అందదు. ఇది జరగాలంటే ఏప్రిల్‌ నెలాఖరులోగా ధరణి పోర్టల్లో భూ సమాచారం అప్‌డేట్‌ కావాల్సి ఉంది. ఈ దిశగా ప్రభుత్వం, ధరణి కమిటీ చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.

పరిష్కరించాల్సిన సమస్యలివే..

  • రైతుల మధ్య సరిహద్దు వివాదాలు
  • విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులు
  • మూల సర్వే నంబరుకు సరిపోని విస్తీర్ణాలు (ఆర్‌ఎస్‌ఆర్‌)
  • అటవీ, రెవెన్యూ సరిహద్దు సమస్యలు
  • దస్త్రాల్లో అచ్చుతప్పులు

స్పెషల్‌ డ్రైవ్‌ మాత్రమే నిలిచిపోతుంది

- సునీల్‌కుమార్‌, భూ చట్టాల నిపుణుడు, ధరణి కమిటీ సభ్యుడు

ప్రత్యేక డ్రైవ్‌ ప్రకారం చేపట్టిన పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారాలు మాత్రమే ఎన్నికల కోడ్‌ ప్రకారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి విచారణలు పూర్తయిన దస్త్రాలకు ఎలాంటి అడ్డంకి ఉండదు. కలెక్టర్లకు ఉన్న అధికారాలను విభజించి ఆర్డీవో, తహసీల్దార్లకు కేటాయించిన అంశాల అమలుకు కూడా ఎలాంటి ఆటంకం లేదు. పాత భూ సమస్యలు ఎప్పటిలాగానే పరిష్కరించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని