ఎన్‌హెచ్‌ఎం నిధులకు గండి

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) నిధులకు గండి పడింది.

Published : 08 Apr 2024 03:00 IST

348 కోట్ల రూపాయల కోత
పలుమార్లు లేఖలు రాసినా స్పందించని కేంద్ర ఆరోగ్యశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) నిధులకు గండి పడింది. మూడు, నాలుగు త్రైమాసికాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన కేంద్రం వాటా నిధులను విడుదల చేయలేదు. మార్చి 31 వరకు ఎదురుచూసిన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు మురిగిపోయినట్లు నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రప్రభుత్వం కొన్ని నెలలుగా నిధుల కోసం కేంద్రానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎన్‌హెచ్‌ఎం నిబంధనలు పాటించినా నిధులు విడుదల కాలేదని వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

ఆరోగ్య కార్యక్రమాలపై ప్రభావం

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యసేవల్లో ఎన్‌హెచ్‌ఎం కీలకం. మాతా, శిశుసంరక్షణ, అంటువ్యాధుల నివారణతో పాటు పిల్లలు, యువత, మహిళలు, వృద్ధుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. మానసిక, శారీరక వికలాంగులతో పాటు అందరికీ అందుబాటులో కీలకమైన వైద్య ఆరోగ్యసేవలు లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర వైద్యసేవలకు, వ్యాక్సినేషన్‌లకు జాతీయ ఆరోగ్యమిషన్‌ ద్వారా తోడ్పాటు అందుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జమచేసి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రానికి ఎన్‌హెచ్‌ఎం నిధులు విడుదలవ్వకపోవడంతో ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ప్రభావం పడుతోందని వైద్య, ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది.

వేతనాల చెల్లింపులో ఇబ్బందులు

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మంది జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా వివిధ రకాల ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారా మెడికల్‌ సిబ్బందితో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య సిబ్బంది వీరిలో ఉన్నారు. అప్పట్లో వీరికి 4 నెలల వేతనాలు చెల్లించలేదు. ఉద్యోగులు సమ్మె బాట పట్టే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్లో రూ.100 కోట్ల మేర విడుదల చేసి జీతాలు చెల్లించింది. కేంద్రం నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు వారు నిర్దేశించిన పేర్లను పెట్టడంతో పాటు ఇతర ఆదేశాలు పాటిస్తున్నా నిధులు విడుదల కాలేదని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మార్చి మొదటివారంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం నిధుల కోసం ప్రత్యేకంగా లేఖ రాసింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా కేంద్రం, రాష్ట్రం రూ.1480 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ఇందులో కేంద్రం వాటా రూ.888 కోట్లు, రాష్ట్ర వాటా రూ.592 కోట్లు. చివరి రెండు త్రైమాసికాల్లో విడుదల కావాల్సిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.888 కోట్లకు గాను రూ.540 కోట్లు విడుదలైంది. మిగిలిన రూ.348 కోట్లు విడుదల కాలేదు. ఈ కార్యక్రమాల అమలుపై ప్రభావం పడటంతో పాటు ఎన్‌హెచ్‌ఎంలోని ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు చెల్లింపులపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని