20 వరకు కవిత జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది.

Updated : 08 May 2024 05:47 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. కస్టడీ గడువు ముగిసిన నేపథ్యంలో జైలు సిబ్బంది ఆమెను మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. ఈడీ, సీబీఐ న్యాయవాదులు దర్యాప్తు పురోగతిని న్యాయమూర్తికి వివరించి కవిత జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించాలని కోరారు. వారం రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు ఈడీ న్యాయవాది తెలిపారు. కవితకు ఇంటి నుంచి వస్తున్న భోజనాన్ని 10-15 మంది పోలీసులు తనిఖీచేసి చివరకు పాడుచేసిన ఆహారాన్ని అందిస్తున్నారని ఆమె న్యాయవాది నితేష్‌ రాణా తెలిపారు. అలా కాకుండా జైలు డాక్టర్‌ తనిఖీచేసి అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై జైలు సూపరింటెండెంట్‌ వివరణ కోరతామని న్యాయమూర్తి స్పష్టంచేశారు. కవిత కోర్టు హాల్‌ నుంచి బయటికి వెళ్తూ.. ‘ప్రజ్వల్‌ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించి నాలాంటి వారిని అరెస్ట్‌ చేయడం అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నా’ అని అన్నారు.

బెయిల్‌ కోసం దిల్లీ హైకోర్టుకు

బెయిల్‌ పిటిషన్లను కొట్టేస్తూ సోమవారం రౌజ్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. బుధవారం పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు      తెలిసింది.

మద్యం కేసులో మరొకరి అరెస్ట్‌

దిల్లీ మద్యం కేసులో ఈడీ మరొకరిని అరెస్ట్‌ చేసింది. గోవాకు చెందిన వినోద్‌  చౌహాన్‌ను అదుపులోకి తీసుకొని మంగళవారం రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆయన గత గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్‌ నేతలకు హవాలా రూపంలో రూ.25 కోట్లు అందించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని