Telangana State Budget: 7న రాష్ట్ర బడ్జెట్‌

తెలంగాణ  బడ్జెట్‌ సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభంకానున్నాయి. ఈసారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తొలిరోజే సభలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి లేదా మరొకరు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు

Updated : 01 Mar 2022 06:32 IST

గవర్నర్‌ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్‌కు, ప్రభుత్వానికి దూరం పెరిగిందా!
వరస పరిణామాలతో అనేక సందేహాలు
తొలిరోజే పద్దు ప్రవేశపెట్టనున్న మంత్రులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ  బడ్జెట్‌ సమావేశాలు వచ్చే వారంలో ప్రారంభంకానున్నాయి. ఈసారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తొలిరోజే సభలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి లేదా మరొకరు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోగా ఆమోదించాల్సి ఉంటుంది. మార్చి 28న యాదాద్రి ఆలయ పునఃప్రారంభం సందర్భంగా మహా సంప్రోక్షణ జరగనుంది. ఈలోపే శాసనసభ సమావేశాలు ముగిసే వీలుంది. వాటిపై సోమవారం జరిగిన సమావేశంలో ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రులు హరీశ్‌, ప్రశాంత్‌రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇలా జరగడం అరుదే
గవర్నర్‌ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు మొదలుకావడం అరుదే. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున ఉభయసభలను సమావేశపరచి గవర్నర్‌ ప్రసంగించడం ఆనవాయితీ. నిబంధనల మేరకు కొత్త శాసనసభ మొదటి సమావేశం, ఆపై ఏటా జరిగే తొలి సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగించాలి. దానికిముందు శాసనసభ ప్రొరోగ్‌ (నిరవధిక వాయిదా) జరగాలి. తెలంగాణలో గత అక్టోబరు 8న అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. శాసనసభ వాయిదా పడింది కానీ ప్రొరోగ్‌ పడలేదు. దీనివల్ల సాంకేతిక అంశాలు గవర్నర్‌ ప్రసంగానికి అడ్డొస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఈసారి నేరుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ సమాచారాన్ని గవర్నర్‌కు ముందే తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఏపీ, బెంగాల్‌, పుదుచ్చేరిలలో..
ఉమ్మడి రాష్ట్రంలో 1970లో ఒకసారి, 2014లో (తెలంగాణ ఏర్పడకముందు) ఒకసారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయి. 2020 జనవరిలో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే జరిగాయి. 2020-21లో బెంగాల్‌ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2020లో కిరణ్‌ బేడీ గవర్నర్‌గా ఉన్నప్పుడు పుదుచ్చేరి బడ్జెట్‌ సమావేశాలు కూడా ఇలాగే జరిగాయి. కిరణ్‌ బేడీయే ప్రసంగాన్ని బహిష్కరించారు.

దూరం పెరగడమే కారణమా!
గవర్నర్‌ తమిళిసై లేకుండానే తెలంగాణ ప్రభుత్వం శాసనసభను నిర్వహించనుండడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆమెకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనే సందేహాలు తలెత్తుతున్నాయి. గణతంత్ర దినోత్సవాలకు తెలంగాణ సీఎం, మంత్రిమండలి సభ్యులు హాజరుకాకపోవడం, భాజపా ఎంపీ అర్వింద్‌పై దాడి గురించి గవర్నర్‌ ఆరా తీయడం, మేడారం జాతర సందర్భంగా గవర్నర్‌కు హెలికాప్టర్‌ను కేటాయించకపోవడం, రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్‌, సీఎంలు విమానాశ్రయంలో మాట్లాడుకోకపోవడం, శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా ఆమోదంలో గవర్నర్‌ జాప్యం చేయడం వంటి పరిణామాలు ఈ వాదనకు బలం చేకూర్చుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ లేకుండానే నడపాలని ప్రభుత్వం నిర్ణయించడం తాజా పరిణామం. శాసనసభ ప్రొరోగ్‌ కాకపోవడం గవర్నర్‌ రాకకు ప్రతిబంధకంగా మారిందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే
ఈ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకమనే చెప్పాలి. ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్‌ పూర్తిస్థాయిలో అమలవుతుంది. వచ్చే సంవత్సరం.. అంటే 2023 డిసెంబరులో శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఆ ఏడాది మార్చిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టినా అది తొమ్మిది నెలల పాటే అమలవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌కు, సమావేశాలకు విశేష ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. కేటాయింపులు సైతం రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.50 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ నియామకాలు, ఇతర కీలక నిర్ణయాలు తీసుకునే వీలుంది. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు భారీగా కేటాయింపులు ఉండవచ్చని భావిస్తున్నారు.


మహిళా గవర్నర్‌ కాబట్టే అవమానమా? 

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

రాజ్యాంగంపై నమ్మకం లేని వ్యక్తి రాజ్యాంగ ప్రతినిధిని గౌరవిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్ని గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. ‘మహిళా గవర్నర్‌ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నారా? రాష్ట్ర ప్రథమ పౌరురాలిని గౌరవించే తీరు ఇదేనా?’ అంటూ నిప్పులుచెరిగారు. చట్టాల్ని గౌరవించలేని.. సంప్రదాయాల్ని పాటించలేని వ్యక్తికి నైతికంగా ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని అన్నారు. తెరాస ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమీ లేనందువల్లే గవర్నర్‌ ప్రసంగాన్ని లేకుండా బడ్జెట్‌ సమావేశాలు పెట్టాలని సీఎం నిర్ణయించినట్లున్నారని వ్యాఖ్యానించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని