Ukraine Crisis: నాటోపైనా రష్యా దాడి చేస్తుందేమో

రష్యా దళాల నిలువరింతకు వీలుగా తమ గగనతలంపై నిషేధం విధించడంలో ఇంకా జాప్యం చేస్తే నాటో దేశాలు దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావచ్చని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. ఆయన ఈ మేరకు వీడియో

Updated : 15 Mar 2022 04:40 IST

మా గగనతలంపై ఇప్పటికైనా నిషేధం విధించండి: జెలెన్‌స్కీ  
ఉక్రెయిన్‌ నివాసాలపైకి క్షిపణుల్ని సంధించిన రష్యా
మేరియుపొల్‌లో శవాల గుట్టలు

లివీవ్‌: రష్యా దళాల నిలువరింతకు వీలుగా తమ గగనతలంపై నిషేధం విధించడంలో ఇంకా జాప్యం చేస్తే నాటో దేశాలు దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావచ్చని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. ఆయన ఈ మేరకు వీడియో సందేశం వెలువరించారు. గగనతలంపై నిషేధం విధించకపోతే రష్యా రాకెట్లు ఇకపై నాటో భూభాగంపైనా పడవచ్చన్నారు. పశ్చిమ దేశాలతో యుద్ధానికి రష్యా దిగుతుందని చెప్పారు. ఐరోపా సమాఖ్యలో ఉక్రెయిన్‌కు సభ్యత్వంపై చర్చల ప్రక్రియకు ప్రాధాన్యమిస్తామని ఈయూ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ చెప్పినట్లు జెలెన్‌స్కీ తెలిపారు.

సైరన్ల మోత.. ముప్పేట దాడి..

రష్యా సైనిక బలగాలు కీవ్‌ శివార్లతో పాటు అనేక నగరాలపై ముప్పేట దాడి చేశాయి. ఆదివారం రాత్రంతా నగరాల్లో సైరన్లు మోగాయి. మైకొలైవ్‌, ఖర్కివ్‌, ఖేర్సన్‌, ఇర్పిన్‌, బుచ, హోస్తోమెల్‌ వంటి నగరాల్లో అనేక నివాస భవంతులపై గగనతల దాడులు చోటు చేసుకున్నాయి. మూడు శక్తిమంతమైన దాడులతో చెర్నిహైవ్‌ నగరం అల్లాడిపోయింది. కీవ్‌లో అతిపెద్ద సరకు రవాణా విమానాలు తయారు చేసే పరిశ్రమపై గగనతలం నుంచి జరిగిన దాడిలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇద్దరు మృతి చెందారు. ఒక్క మేరియుపొల్‌ నగరంలోనే ఇంతవరకు దాదాపు 2,500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. వీధుల్లో ఎక్కడికక్కడ మృతదేహాలే కనిపిస్తున్నాయి. డొనెట్స్క్‌లో 20 మంది పౌరులు చనిపోయినట్లు రష్యా సైన్యం ప్రకటించింది.

అనుకున్నంతగా వెళ్లలేకపోతున్నాం

యుద్ధంలో అనుకున్నంత వేగంగా వెళ్లలేకపోతున్నామని రష్యా నేషనల్‌ గార్డ్‌ అధిపతి విక్టర్‌ జొలొతొవ్‌ చెప్పారు. అనుకున్న ప్రకారమే అంతా సాగుతోందని పుతిన్‌కు.. రక్షణ మంత్రి సెర్గే షోగు గతవారం చెప్పిన విషయం గమనార్హం. ఉక్రెయిన్‌ నగరాలను స్వాధీనం చేసుకునే అవకాశాలు లేకపోలేదని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్‌కోవ్‌ తెలిపారు. సాధారణ పౌరుల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.  

అపార్ట్‌మెంటుపైకి క్షిపణి

పశ్చిమ కీవ్‌లోని ఒబొలొన్‌స్కీలో 9 అంతస్తుల అపార్ట్‌మెంటుపై రష్యా.. క్షిపణి దాడి చేసినట్లు తెలుస్తోంది. తాము గట్టిగా ప్రతిఘటించడం వల్ల రష్యా దళాలు గత 24 గంటల్లో ఎక్కువ దూరం ముందుకు కదల్లేకపోయాయని ఉక్రెయిన్‌ సైన్యాధికారులు చెప్పారు.  

నేడు మరో విడత చర్చలు

రష్యాతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన శాంతి చర్చలు ముగిశాయనీ, మంగళవారం మరో విడత చర్చలు జరగనున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుని సలహాదారుడు మైఖైలో పొడొల్యాక్‌ చెప్పారు. తమ ప్రతిపాదనల్ని రష్యా జాగ్రత్తగా విన్నట్లు చెప్పారు.

అమెరికా పౌరులు వెంటనే ఉక్రెయిన్‌ను వీడాలని కీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మరోసారి ప్రకటించింది. ఊహించని రీతిలో రష్యా భీకరంగా దాడులు చేస్తోందని తెలిపింది. పౌరులు జాగ్రత్తగా సరిహద్దులు దాటాలని, సురక్షిత మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని