సమగ్ర వికాసమే అభివృద్ధి

అభివృద్ధి అంటే కేవలం ప్రజల ఆదాయాల్లో పెరుగుదల మాత్రమేనా? ఒక సమాజం, ఒక వర్గం, ఒక దేశం, అందులోని ప్రజల సమగ్ర వికాసమే అభివృద్ధి. ప్రజల జీవన స్థితిగతుల్లో దీర్ఘకాలిక మార్పులు చోటుచేసుకోవడమే సరైన పురోగతి. ఆ దిశగా వేగంగా అడుగులు పడాలి.

Published : 02 May 2024 01:02 IST

అభివృద్ధి అంటే కేవలం ప్రజల ఆదాయాల్లో పెరుగుదల మాత్రమేనా? ఒక సమాజం, ఒక వర్గం, ఒక దేశం, అందులోని ప్రజల సమగ్ర వికాసమే అభివృద్ధి. ప్రజల జీవన స్థితిగతుల్లో దీర్ఘకాలిక మార్పులు చోటుచేసుకోవడమే సరైన పురోగతి. ఆ దిశగా వేగంగా అడుగులు పడాలి.

భారత్‌ 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, జీడీపీ అయిదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని కేంద్రప్రభుత్వం చెబుతోంది. అయితే, ఒక ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి జీడీపీ మాత్రమే సరైన కొలమానం కాదనేది ఆర్థికవేత్తలు, అభివృద్ధి శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో చేస్తున్న వాదన. ఒక దేశ ఉత్పత్తి పరిమాణం పరిగణనలోకి తీసుకోదగిన విషయమే అయినా-  ప్రజల సంక్షేమం, జీవన స్థితిగతులను అది పూర్తిగా ప్రతిబింబించలేదు. అందుకని, జీడీపీతోపాటు ఆరోగ్యం, విద్యలను పరిగణనలోకి తీసుకొనే- మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ) మరింత సమగ్రమైన ప్రమాణంగా చెబుతున్నారు. 2023లో హెచ్‌డీఐలో 191 దేశాలకు గాను భారత్‌ 132వ ర్యాంకుతో ఎక్కడో దిగువన నిలిచింది. శ్రీలంక (73), బంగ్లాదేశ్‌ (129)లకన్నా మనదేశం వెనకబడి ఉంది. 

వికసిత భారత్‌ వైపు...

వికసిత భారత్‌ దార్శనికతను సాధించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా మరెన్నో చర్యలు తీసుకోవాలి. అధిక ద్రవ్యోల్బణం ఉందంటే ఆర్థిక వ్యవస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నట్లే. ఆహార విధానాలకు సంబంధించిన నిర్ణయాలు ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ద్రవ్యోల్బణ ఒత్తిడిని నియంత్రించి, సామాన్యుల కొనుగోలు శక్తిని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు పది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గత ఏడాది జులైలో ప్రభుత్వమే లోక్‌సభకు వెల్లడించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోనూ పెద్దసంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఖాళీల భర్తీకి కట్టుబడాల్సిందే. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1990-91లో 35శాతం ఉండగా, 2023-24 నాటికి 15 శాతానికి పడిపోయింది. వ్యవసాయ రంగం వృద్ధి నిరంతరంగా మందగమనంలో కొనసాగుతోంది. రైతుల కుంగుబాటు, వ్యవసాయ ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. ఫలితంగా ఆహార ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయ ఉత్పాదకత పెరిగేందుకు, వనరులను సమర్థంగా వినియోగించుకొనేందుకు, సుస్థిర సాగు పద్ధతుల్ని ప్రోత్సహించేందుకు, మౌలిక సదుపాయాల బలోపేతానికి, స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు మద్దతు ధరలు దక్కేలా చేయడానికి కొత్త ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. భారత్‌లో గత రెండు దశాబ్దాలలో తయారీ రంగంలో వృద్ధి లేకున్నా, సేవల రంగం వేగంగా వర్ధిల్లింది. ఇతర దేశాల్లో సేవల రంగంతోపాటు ఉత్పత్తి రంగమూ వికసిస్తుంది. 2022లో జీడీపీలో సేవల రంగం వాటా 55 శాతందాకా ఉండగా, ఉత్పత్తి రంగం 17 శాతంవద్దే ఉండిపోయింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా విరాజిల్లాలని భావిస్తున్న భారత్‌కు తయారీ రంగంలో వృద్ధి అనేది తప్పనిసరి. దీన్ని సుసాధ్యం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. మనదేశంలో 91 శాతం శ్రామిక శక్తి అసంఘటిత రంగంలో ఉంది. ఇప్పటి వరకూ ఎలాంటి సామాజిక భద్రత ప్రయోజనమూ కల్పించకుండా ప్రభుత్వ విధానాలు వారిని వంచిస్తున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర, తయారీ, సేవల రంగమనే తేడాలు లేకుండా సార్వత్రిక సామాజిక బీమాను కల్పించే దార్శనికత అవసరం. ఈ సవాలును పరిష్కరించడానికి సమగ్ర చట్టాన్ని రూపొందించేందుకు సరైన తరుణమిదే. రాబోయే పదిహేనేళ్లలో 18 కోట్లకుపైగా యువత భారత శ్రామిక శక్తికి జతపడనున్నారు. దేశంలో పనిచేసే వయస్సులో ఉన్న జనాభాలో 80 శాతానికి ఉన్నత మాధ్యమిక విద్యార్హతలు కూడా లేవు. ఇలాంటి నైపుణ్య లేమిని సరిదిద్దడం ఒక అవకాశమే కాదు, పెద్ద సవాలు కూడా. ప్రభుత్వం పెద్దయెత్తున నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఈ సమస్యను అధిగమించాల్సి ఉంది.

జనాభా ప్రయోజనాలు...

మనదేశంలో పేదలు కానివారిలో 40 కోట్లమందికి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఆర్థిక రక్షణా లేదు. ఆరోగ్య సేవలు పొందడానికి భారతీయులు తమ జేబుల్లో నుంచి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సార్వత్రిక ఆరోగ్య రక్షణ, చౌకధరలకే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యాల సాధన దిశగా మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. దేశ విద్యారంగాన్ని దశాబ్దాలుగా నిధుల లేమి వేధిస్తోంది. పరిశోధన, అభివృద్ధికి భారత్‌ చేస్తున్న ఖర్చు ప్రపంచంలోనే అతి తక్కువ. విద్యారంగం, నైపుణ్య కల్పన వంటివి ఓట్లు తెచ్చిపెట్టే అంశాలు కాకపోవడంతో దేశంలోని రాజకీయ పార్టీలు ఈ అంశాల్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ సాగుతున్నాయి. యువజనానికి సంబంధించి జనాభాపరమైన సానుకూల ప్రయోజనాల్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అప్పుడే మనదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే దిశగా వడివడిగా అడుగులు వేయగలదు.


ఎవరేమన్నారు?

భారత్‌ మూడోపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా పేద దేశంగానే మిగిలిపోతుందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ డి.సుబ్బారావు ఇటీవల అభిప్రాయపడటం గమనార్హం.  140కోట్లకుపైగా జనాభా ఉండటం వల్లే మనది భారీ ఆర్థిక వ్యవస్థ అని ఆయన స్పష్టంచేశారు. భారత్‌- బ్రిక్స్‌, జీ20 దేశాలన్నింటిలోకీ  పేద దేశమని తేల్చిచెప్పారు. భారత్‌లో అధికార డేటాకు సంబంధించి పారదర్శకత కొరవడిందని, దీనివల్ల పేదరికం, అసమానతలకు సంబంధించిన వాస్తవిక పరిస్థితిపై ఎవరికీ ఏమీ తెలియని దుస్థితికి దారితీస్తోందని ప్రధానమంత్రి మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ భారీ పరిమాణంపై కృత్రిమ పెరుగుదలను సృష్టించడం వల్ల నిర్మాణాత్మక బలహీనతలు, సవాళ్లు బయటికి కనిపించకుండా పోతున్నాయని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ వంటి ఆర్థికవేత్త హెచ్చరికలు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.