ఊతమిస్తేనే కోళ్ల పరిశ్రమ కళకళ

వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్‌లో దానికి అనుబంధంగా కోళ్ల పెంపకమూ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. పోనుపోను కోడిగుడ్లు, మాంసం వినియోగం పెరిగింది. దేశీయంగా హేచరీలు, కోళ్లఫారాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి.

Published : 02 Dec 2022 00:47 IST

వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్‌లో దానికి అనుబంధంగా కోళ్ల పెంపకమూ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. పోనుపోను కోడిగుడ్లు, మాంసం వినియోగం పెరిగింది. దేశీయంగా హేచరీలు, కోళ్లఫారాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశీయంగా పౌల్ట్రీ రంగం పలు ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది.
అతి తక్కువ నీరు, నేల, పెట్టుబడితో వ్యవసాయాధారిత కార్యకలాపాలన్నింటిలో కోళ్ల పెంపకం మంచి ఆదరణ దక్కించుకొంది. బ్యాంకుల జాతీయీకరణ తరవాత కోళ్ల పెంపకానికి ఇచ్చే రుణాలను వ్యవసాయ విభాగంలోకి తెచ్చారు. దానివల్ల రుణ వితరణ పెరిగింది. పెద్దగా శిక్షణ అవసరం లేకున్నా కొద్దిపాటి జాగ్రత్తలతో సులభంగా కొనసాగించే అవకాశం ఉండటంతో తెలుగు రైతులు కోళ్ల పెంపకాన్ని బాగా ఆదరించారు. వారు ఇతర రాష్ట్రాలకూ వెళ్ళి కోళ్ల ఫారాలు ప్రారంభించారు. విదేశీ కోళ్లను దిగుమతి చేసుకుని పెంచడం మొదలు పెట్టడంతో హేచరీల (కోళ్ల ఉత్పత్తి కేంద్రాల) వ్యాపారం బాగా ఊపందుకొంది.

హేచరీలు నిపుణులను నియమించుకొని వారిని అమెరికా వంటి దేశాలకు పంపించి శిక్షణ ఇప్పించి సాంకేతికతను రైతులకు చేరువ చేశాయి. విదేశాల నుంచి కోళ్లను పదేపదే దిగుమతి చేసుకొనే అవసరం లేకుండా మేలిమి జాతి కోళ్లను సంకర విధానాలతో భారత్‌లోనే అభివృద్ధి చేసే స్థాయికి ఎదిగాయి. 1970 నుంచి రెండు దశాబ్దాల్లో కోళ్లకు కావాల్సిన టీకాలు, మందులు, మేత మిశ్రమాలు సర్వం అందుబాటులోకి తెచ్చుకొని స్వయం సమృద్ధిని సాధించాయి.

భారత్‌ ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో ద్వితీయ స్థానం, కోడి మాంసం ఉత్పత్తిలో తృతీయ స్థానంలో నిలుస్తోంది.  దేశీయంగా కోడిగుడ్లకు, కోళ్లకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం ఆవేదన కలిగించే అంశం. ఉత్పత్తిని వేగంగా పెంచుకుంటూ పోవడం దీనికి ఒక కారణం కావచ్చు. పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం దేశీయంగా ఏటా కోడిమాంసం ఉత్పత్తి పదిశాతం అధికమవుతోంది. మరోవైపు కోళ్ల పెంపకానికి అత్యంత ఆవశ్యకమైన మొక్కజొన్న, సోయా పంటల సాగులో పెరుగుదల మూడు శాతమే ఉంటోంది. ఫలితంగా కోళ్ల మేత ధరలు కొండెక్కుతున్నాయి. 2017-18లో రూ.14 మాత్రమే ఉన్న కేజీ మొక్కజొన్న ధర ప్రస్తుతం రూ.25 అయ్యింది. కేజీ సోయా ధర రూ.27 నుంచి రూ.55-60కి చేరింది. అప్పట్లో రూ.3.50 ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం అయిదు రూపాయల లోపే ఉంది. కోళ్ల ఫారాల్లో కేజీ లైవ్‌ బ్రాయిలరు కోడి ధరలు సైతం అయిదేళ్ల క్రితం రూ.68-70 మధ్య ఉండేవి. ఇప్పుడవి వంద రూపాయలకు మించడం లేదు. ప్రస్తుతం దేశీయంగా కోళ్ల దాణా సాగు విస్తీర్ణం పెరిగి, వాటి ధరలు దిగిరావడమన్నది అంత తేలికైన విషయం కాదు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా దాణా దిగుమతులకు అవరోధం తలెత్తింది. ఈ తరుణంలో జన్యుసవరణ విత్తనాలకు అనుమతి ఇస్తే దిగుబడులను పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది.

గుడ్ల విక్రయాలకు తగిన సదుపాయాలు భారత్‌లో రైతులకు లేవు. తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో గుడ్లను ఎగుమతి చేస్తున్న ఇరాన్‌, ఇరాక్‌ వంటివి అనేక రాయితీలను కల్పిస్తున్నాయి. ఫలితంగా ఇతర దేశాలతో పోటీ పెరిగి నానాటికీ మన గుడ్ల ఎగుమతులకు అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. మధ్యాహ్న భోజన పథకం, ఆసుపత్రులు, హాస్టళ్లు, అంగన్‌వాడీల్లో పంపిణీ ద్వారా కొంతవరకు తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం బాగుంది. కానీ, ప్రభుత్వ పరంగా సరైన సహకారం అందడం లేదు. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ్‌ బెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కోళ్ల అభివృద్ధి సంస్థలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వాటిని రద్దు చేశారు. కోళ్ల అభివృద్ధి సంస్థలను అనుసంధానిస్తూ కేంద్రం ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటుచేసి కోళ్ల రైతులకు తగిన సహాయాన్ని అందించాలి. వాణిజ్య పరంగా కోళ్లను పెంచే రైతులకు దేశీయంగా పథకాలు ఏవీ అందుబాటులో లేవు. హేచరీలు, ఆహార శుద్ధి కేంద్రాల స్థాపనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పాలకులు చెబుతున్నారు. దాన్ని ఆచరణలోకి తేవాలి. పౌల్ట్రీ రంగం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు సరైన ఊతం అందించడం తప్పనిసరి!

- ఎమ్‌.ఎన్‌.రావు

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి