మత్స్యకారులకు ప్రకృతి సవాళ్లు

ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో నిలుస్తోంది. దేశీయంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. చేపలకు గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రకృతి విపత్తులు వంటి సమస్యలు మత్స్యకారులను పట్టి పీడిస్తున్నాయి.

Published : 10 Dec 2022 01:05 IST

ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో నిలుస్తోంది. దేశీయంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. చేపలకు గిట్టుబాటు ధర లభించకపోవడం, ప్రకృతి విపత్తులు వంటి సమస్యలు మత్స్యకారులను పట్టి పీడిస్తున్నాయి.

దేశీయంగా ఆహార భద్రతలో మత్స్యరంగమూ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ మత్స్య ఉత్పత్తిలో భారత్‌ వాటా 7.56శాతం. విశ్వవ్యాప్తంగా ఇండియా నాలుగో అతి పెద్ద మత్స్య ఎగుమతిదారు. భారత్‌లో దాదాపు 2.80 కోట్ల మంది మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. భారత స్థూల విలువ జోడింపు(జీవీఏ)లో ఈ రంగం వాటా 1.24శాతం. దేశీయంగా 2019-2020లో మత్స్య ఉత్పత్తి గరిష్ఠంగా 1.41 కోట్ల మెట్రిక్‌ టన్నులకు చేరింది. చేపల అధిక ఉత్పత్తి కోసం నీలి విప్లవం విజయవంతంగా కొనసాగుతోంది. 2024-25 నాటికి భారత్‌లో 2.20 కోట్ల మెట్రిక్‌ టన్నుల మత్స్య ఉత్పత్తి సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయంగా ఈ రంగంలో మౌలిక వసతుల అంతరాన్ని తగ్గించేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. భారతదేశంలో సగటు వార్షిక తలసరి చేపల వినియోగం అయిదు నుంచి పది కేజీల మధ్య ఉంటుందని అంచనా. 2031 నాటికి ఇది 15శాతం మేర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

భారత్‌లో గత పదేళ్లలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అంతర్గతంగా ఉన్న జలాల నుంచి సమకూరుతున్న మత్స్య సంపద 55శాతం అధికమైంది. ఆక్వా కల్చర్‌ విస్తృతంకావడం దీనికి ప్రధాన కారణం. చేపల్లో క్యాల్షియం, మినరల్స్‌, ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఆహారంలో వాటి వినియోగం పెరిగింది. వినియోగదారుల అభిరుచి మేరకు మత్స్య సంపదకు వివిధ రూపాల్లో విలువ జోడించి విక్రయిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలు, పట్టణాల్లో ప్రత్యేకంగా చేపల అంగళ్లను ఏర్పాటు చేసుకొని యువత ఆదాయం పొందుతోంది. గ్రామీణ మహిళలు కొందరు స్థానికంగా లభ్యమయ్యే చేపలు, రొయ్యలతో పచ్చళ్లు తయారు చేస్తున్నారు. వాటిని స్థానికంగా విక్రయించడంతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. మత్స్య రంగానికి సంబంధించి నిల్వ, వాటిని సరైన ప్రమాణాలతో ప్యాకింగ్‌ చేయడం వంటి పరిశ్రమలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. తద్వారా స్థానిక యువతకు పెద్దమొత్తంలో ఉపాధి లభిస్తుంది. అసాంఘిక శక్తులు దేశంలోకి చొరబడకుండా సముద్ర తీర భద్రత కోసం తీరప్రాంత మత్స్యకారులకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తే యువశక్తిని ప్రోత్సహించినట్లవుతుంది.

దేశీయంగా మత్స్యకారుల్లో అధికశాతం పెద్దగా చదువుకోనివారే. సముద్రతీరాలు, నదీ పరీవాహక ప్రాంతాలతో వారి జీవనం ముడివడి ఉంది. ప్రకృతి ఆటుపోట్లను తట్టుకుంటూ చేపలు పడితే ఆదాయం, లేకుంటే నిరాశ నిస్పృహలకు గురవుతూ అనిశ్చితితో వారు తమ జీవితాలను వెళ్ళదీస్తున్నారు. వారు పట్టి తెచ్చిన చేపలకు తగిన ధర లభించక దళారుల దోపిడికి గురవుతున్నారు. మత్స్యకార మహిళల్లో చాలామంది వీధుల్లో తిరుగుతూ చేపలను ఇళ్ల ముంగిటకు తెచ్చి విక్రయిస్తున్నారు. వారికోసం శుభ్రమైన ప్రదేశాల్లో ఆధునిక సౌకర్యాలతో చేపల విక్రయ శాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాలు చేపల నిల్వ కోసం వారికి తగిన వసతులు కల్పించాలి. తద్వారా వారి ఆదాయాలు పెరగడానికి అవకాశం దక్కుతుంది.

దేశీయంగా చేపల ఉతత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్ర భాగాన నిలుస్తోంది. పశ్చిమ్‌ బెంగాల్‌, గుజరాత్‌, కేరళ, తమిళనాడు తరవాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. మత్స్యకారులు పక్కరాష్ట్రాలకు వలస వెళ్ళీ ఉపాధి పొందుతున్నారు. లోతుగా ఉండే నీళ్లలో చేపల వేట సాగించేందుకు ఏపీ నుంచి యువ మత్స్యకారులు గుజరాత్‌కు వలస వెళ్తున్నారు. దేశీయంగా మత్స్య సంపదను సరైన పద్ధతిలో వెలికితీసి భవిష్యత్తు తరాలకు వాటి కొరత రాకుండా సరైన చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. ఇటీవలి కాలంలో మత్స్యకారుల జీవితాలు పలు ఆటుపోట్లకు గురవుతున్నాయి. అనేక అనారోగ్య సమస్యలు వారిని పట్టిపీడిస్తున్నాయి. చేపలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, తుపానులు, తీరప్రాంతాలు కోతకు గురికావడం వంటివి వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేసి మత్స్యకారులను ఆదుకోవాలి.

ఆచార్య కొండపల్లి పరమేశ్వరరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.