నైపుణ్యమే ఆయుధం... అవకాశాలు అపారం!

ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారత్‌ 2035 నాటికి మూడో స్థానంలో నిలవబోతోంది. మరో పాతికేళ్లలో స్వతంత్ర భారతం శతవసంతాలు పూర్తిచేసుకోనున్న దృష్ట్యా- రానున్న రెండున్నర దశాబ్దాలను అమృతకాలంగా పరిగణిస్తున్నారు.  ఈ అమృతకాల లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ‘సప్తర్షి’ పేరిట ఏడు ప్రాధాన్యాలను ప్రతిపాదించింది.

Published : 08 Feb 2023 00:41 IST

ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారత్‌ 2035 నాటికి మూడో స్థానంలో నిలవబోతోంది. మరో పాతికేళ్లలో స్వతంత్ర భారతం శతవసంతాలు పూర్తిచేసుకోనున్న దృష్ట్యా- రానున్న రెండున్నర దశాబ్దాలను అమృతకాలంగా పరిగణిస్తున్నారు.  ఈ అమృతకాల లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ‘సప్తర్షి’ పేరిట ఏడు ప్రాధాన్యాలను ప్రతిపాదించింది.

వచ్చే పాతికేళ్లలో దేశాన్ని బహుముఖంగా అభివృద్ధి పథాన నడిపించాలని కేంద్రం లక్షించింది. ముఖ్యంగా యువతకు కొత్త అవకాశాలు సృష్టించడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని విస్తరించడంతో పాటు పటిష్ఠ ఆర్థిక వాతావరణాన్ని నెలకొల్పడాన్ని అమృతకాల లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. వీటిని సాధించేందుకు 2023-24 బడ్జెట్‌లో ‘సప్తర్షి’ పేరిట ఏడు ప్రాధాన్యాలను ప్రతిపాదించింది. వాటిని సమ్మిళిత అభివృద్ధి, యువజన సాధికారత, సమాజంలో చిట్టచివరి వర్గాలు, వ్యక్తులకూ అభివృద్ధి ఫలాలు, ఆర్థికరంగ ప్రగతి, హరిత అభివృద్ధి, అంతర్గత సామర్థ్యాలను వెలికితీయడం, మౌలిక వసతులు-పెట్టుబడుల వృద్ధిగా పేర్కొంది.

భారీ కేటాయింపులు

సప్తర్షి లక్ష్యాల సాధనకు యువశక్తిని నియోగించాలని ప్రభుత్వం గుర్తించింది. నేడు ప్రపంచంలో 35 ఏళ్లలోపు యువజనుల సంఖ్య 120 కోట్లు. వారిలో 80.8 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారు. 2022 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన ‘జాతీయ యువజన విధానం’ 13-35 ఏళ్ల వారిని యువజనులుగా పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో యువ జనాభా అధికంగా ఉన్నా, పోనుపోను వారి సంఖ్య తగ్గిపోతుంది. 2021లో దేశ జనాభాలో 27.2శాతం 15-29 ఏళ్లవారే. 2036 నాటికి వీరి సంఖ్య 22.7శాతానికి పడిపోనుంది. 2021-36 మధ్య వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గత డిసెంబరులో దేశంలో నిరుద్యోగిత రేటు 8.3 శాతంగా ఉంది. ఆధునిక డిజిటల్‌ ప్రపంచంలో ఉపాధి, వ్యాపార అవకాశాలను అందుకునేలా యువతను తీర్చిదిద్దాలి. తదనుగుణంగా వారికి ఆధునిక విద్య, నైపుణ్యాలను నేర్పాల్సిన ఆవశ్యకతను బడ్జెట్‌ గుర్తించింది. ఇందుకు రూ.1,12,899 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్‌ కేటాయింపులకన్నా ఇది 8శాతం ఎక్కువ. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ 4.0 పథకం కింద రాబోయే మూడేళ్లలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడతామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతల్లో రాణించేలా యువతను తీర్చిదిద్దాలని లక్షించారు. ఈ పరిజ్ఞానాలు లేకుండా వ్యాపారాభివృద్ధి సాధ్యపడదు కాబట్టి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు నిపుణులను సిబ్బందిగా నియమించుకోవడానికి ప్రాధాన్యమిస్తాయి. దేశ విదేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకొనేలా యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించింది. ఇందుకోసం రాష్ట్రాల్లో 30 కౌశల్‌ భారత్‌ అంతర్జాతీయ కేంద్రాలను స్థాపించనున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. నూతన విద్యావిధానం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చింది. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ 4.0 పథకం కింద పరిశ్రమలు, విద్యాసంస్థలు సంయుక్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవానికి మన యువతను సిద్ధం చేస్తాయి. అందుకు త్రీడీ ముద్రణ, కోడింగ్‌, మెకాట్రానిక్స్‌, డ్రోన్లు, సాఫ్ట్‌స్కిల్స్‌ వంటి కోర్సులను చేపట్టాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. తాజా పద్దులో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ.3,517 కోట్లు కేటాయించగా, అందులో రూ.2,278 కోట్ల పైచిలుకు నిధులను స్కిల్‌ ఇండియా (కౌశల్‌ వికాస్‌) కార్యక్రమానికి అందిస్తామంటున్నారు.

డిజిటల్‌ మౌలిక వసతులు

బడ్జెట్‌లో ఆశించినట్లు 2023-24లో జీడీపీ వృద్ధిరేటును 10.5 శాతానికి పెంచాలంటే యువశక్తిని సద్వినియోగం చేసుకోవడం ఎంతో కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకుని డిజిటల్‌ మౌలిక వసతుల నిర్మాణం, ఏకలవ్య పాఠశాలల విస్తరణకు బడ్జెట్‌ ప్రాధాన్యమిచ్చింది. యువతను నిపుణులుగా తీర్చిదిద్దేలా ఉపాధ్యాయ శిక్షణను నవీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాస్థాయి విద్య, శిక్షణ సంస్థలను ఇందుకు ఉపయోగించనుంది. బాలలు, కౌమార దశలోని వారి కోసం జాతీయ డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. వార్డు, పంచాయతీ స్థాయుల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా బాలలు, యువకుల్లో పఠనాసక్తిని, తద్వారా విజ్ఞాన సముపార్జనను పెంపొందించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోంది. అంతర్జాతీయ సవాళ్లను అధిగమించి కొత్త అవకాశాలను అందుకునే సత్తాను, నైపుణ్యాలను యువతలో పెంపొందించాలని భారత్‌ ఆశిస్తోంది. వారిని ఉద్యోగాన్వేషులుగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా తీర్చిదిద్దాలని లక్షిస్తోంది. డిజిటల్‌ ఆధార వ్యాపారాలు విస్తరిస్తున్న భారత్‌లో యువత అధునాతన నైపుణ్యాలను అలవరచుకుంటే- అవకాశాలకు ఆకాశమే హద్దు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు