అంగట్లో వ్యక్తిగత సమాచారం

వ్యక్తిగత సమాచార గోప్యతా నిబంధనలను ఉల్లంఘించినందుకు 130 కోట్ల డాలర్ల అపరాధ రుసుము చెల్లించాలని మెటా (ఫేస్‌బుక్‌)ను ఐరోపా సమాఖ్య (ఈయూ) తాజాగా ఆదేశించడం సంచలనం రేపింది. అయిదేళ్ల క్రితం తాను తెచ్చిన కఠినమైన గోప్యతా పరిరక్షణ విధానాన్ని ఉల్లంఘించిన వివిధ టెక్‌ కంపెనీలపై ఈయూ ఇప్పటికే అపరాధ రుసుములు విధించింది.

Published : 27 May 2023 02:18 IST

వ్యక్తిగత సమాచార గోప్యతా నిబంధనలను ఉల్లంఘించినందుకు 130 కోట్ల డాలర్ల అపరాధ రుసుము చెల్లించాలని మెటా (ఫేస్‌బుక్‌)ను ఐరోపా సమాఖ్య (ఈయూ) తాజాగా ఆదేశించడం సంచలనం రేపింది. అయిదేళ్ల క్రితం తాను తెచ్చిన కఠినమైన గోప్యతా పరిరక్షణ విధానాన్ని ఉల్లంఘించిన వివిధ టెక్‌ కంపెనీలపై ఈయూ ఇప్పటికే అపరాధ రుసుములు విధించింది.

ఐరోపాలోని ఫేస్‌బుక్‌ వినియోగదారుల డేటాను అమెరికాకు బదిలీచేసే ప్రక్రియను మెటా ఈ ఏడాది అక్టోబరుకల్లా నిలిపేయాలని ఐరోపా సమాఖ్య (ఈయూ) ఆదేశించింది. అంతవరకు ఐరోపాలో ఫేస్‌బుక్‌ సేవలకు అంతరాయం ఉండదు కానీ, ఆ గడువు లోపల డేటాను తొలగించడం సాధ్యపడదని మెటా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతకాలంలో ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం మెటాతోపాటు ఇతర సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ వేదికల్లోనూ అందుబాటులో ఉంటోంది. డేటాను ఒకచోట తొలగించినా, ఇతర చోట్ల లభ్యమవుతోంది! ఒకే దఫాలో అన్ని డిజిటల్‌ వేదికల నుంచి సమాచారాన్ని తొలగించడం అసాధ్యం.

ఒప్పందంపై చర్చలు

మెటాకు చెందిన 21 డేటా కేంద్రాల్లో 17 అమెరికాలోనే ఉండగా, మూడు ఐరోపా దేశాల్లో ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చే సందేశాలను గుట్టుగా విని, అవసరమైతే వాటిని అడ్డుకునే అధికారం అమెరికా గూఢచర్య సంస్థలకు ఉంది. డిజిటల్‌ సంభాషణలకూ ఈ విధానం వర్తిస్తోంది. అమెరికా, ఈయూల మధ్య డేటా మార్పిడికి 2016లో ‘ప్రైవసీ షీల్డ్‌’ అనే అనధికార ఒప్పందం కుదిరింది. అది ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రెండు ప్రాంతాల మధ్య సమాచార మార్పిడికి వీలు కల్పించింది. దీన్ని ఆస్ట్రియాకు చెందిన హక్కుల ఉద్యమకారుడు మ్యాక్స్‌ ష్రెమ్స్‌ 2020లో ఈయూ సర్వోన్నత న్యాయస్థానమైన యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌లో సవాలు చేశారు. ఐరోపా పౌరుల డేటాకు అమెరికన్‌ గూఢచర్య సంస్థల నిఘా నేత్రం నుంచి రక్షణ లేదని, అది తమ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరమని ఈయూ సర్వోన్నత న్యాయస్థానం తీర్మానించింది. ఈ తీర్పు తరవాత కూడా తమ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో మెటా విఫలమైందని ఐరోపా నియంత్రణాధికారులు విమర్శించారు. ఈయూ తాజా ఉత్తర్వుపై అప్పీలుకు వెళతామని మెటా ప్రకటించింది. ఈలోగా అమెరికా, ఈయూ అధికారులు కొత్త డేటా పరస్పర మార్పిడి ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నారు. డేటా బదిలీని నిలిపివేయడానికి ఈయూ మెటాకు అయిదు నెలల గడువు ఇచ్చినందువల్ల ఆలోపే కొత్త ఒప్పందమూ కుదరవచ్చు. మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లపై మాత్రం ఈయూ ఎటువంటి ఆంక్షలు విధించలేదని గుర్తుంచుకోవాలి. ఏదిఏమైనా తమ పౌరుల సమాచారాన్ని తమ గడ్డపైనే భద్రపరచాలని, ఆ డేటాను ప్రపంచమంతటా తిప్పరాదని ప్రధాన దేశాలు ఎందుకు పట్టుపడుతున్నాయో అర్థం చేసుకోవలసి ఉంది.  

రేపటి రోజున కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానమే కీలకంగా మారనుంది. అంటే, ఆధిపత్యం భౌతిక సీమ నుంచి డిజిటల్‌ సీమకు మళ్లుతోందన్నమాట. ఇంతవరకు ఏ ఆర్థిక వ్యవస్థకైనా చమురే చోదక శక్తి. 21వ శతాబ్దిలో రాజ్యమేలే ఏఐకి డేటాయే సరికొత్త చమురు. ఏఐ, బిగ్‌డేటా, మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలు కొత్త రకాల వ్యాపారాలు, వృత్తి ఉపాధులను, కొత్త వస్తువులను, సరికొత్త మార్కెట్లను సృష్టిస్తాయి. యుద్ధం కోసం కొంగొత్త ఆయుధాలనూ సృష్టిస్తాయి. నేడు వ్యక్తులు, సంస్థలు, దేశాలతోపాటు విశ్వానికి సంబంధించిన సమాచారమంతటినీ ఏఐ గుప్పిట పడుతోంది. వ్యక్తులు మెటాలో ఉంచే వ్యక్తిగత సమాచారం, గూగుల్‌లో శోధించే అంశాలు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచే చిత్రాలను చూసి కృత్రిమ మేధ వారి వివరాలను, ఆసక్తులు, అభిరుచులను గ్రహిస్తుంది. వారికి ఏయే వస్తుసేవలు అవసరపడతాయో విశ్లేషించి, సంబంధిత వాణిజ్య ప్రకటనలను నేరుగా వారికే చేరవేస్తుంది. ఈ రేసులో ముందుండే కంపెనీలే మార్కెట్‌లో దూసుకువెళతాయి. 2022లో ఫేస్‌బుక్‌కు సమకూరిన ఆదాయంలో 10శాతం ఐరోపాలో వాణిజ్య ప్రకటనల నుంచే లభించింది.

సముచిత చట్టాలతోనే...

పౌరుల అనారోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో సంగ్రహించి వారికి ఆరోగ్య బీమా నిరాకరించడానికి ఏఐ ఆయా బీమా సంస్థలకు తోడ్పడుతుంది. ఇది పౌరుల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తుంది. ఇటువంటి సమస్యలను పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగత గోప్యతా పరిరక్షణకు సముచిత చట్టాలు చేయాలి. సొంత ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లేలా జాగ్రత్తలు తీసుకున్న తరవాతనే పౌరుల డేటా సరిహద్దులు దాటడానికి అనుమతించాలి. ఇతర దేశాల్లోని డేటా మనకూ అందుబాటులో ఉండాలి.

కైజర్‌ అడపా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.