చొరబాట్లకు కంచె!

సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లు నిరోధించేందుకు భారత్‌ కంచెలు నిర్మిస్తోంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల వెంబడి కంచెల నిర్మాణంతో కొంతమేర ఫలితాలు కనిపించాయి. ఇప్పుడదే తరహాలో మయన్మార్‌ సరిహద్దులనూ కంచెతో మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల దీనిపై చేసిన ప్రకటన ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది.

Published : 01 Feb 2024 00:56 IST

సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లు నిరోధించేందుకు భారత్‌ కంచెలు నిర్మిస్తోంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల వెంబడి కంచెల నిర్మాణంతో కొంతమేర ఫలితాలు కనిపించాయి. ఇప్పుడదే తరహాలో మయన్మార్‌ సరిహద్దులనూ కంచెతో మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల దీనిపై చేసిన ప్రకటన ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి రేపుతోంది.

మయన్మార్‌తో భారత్‌కున్న సరిహద్దును ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ పంచుకుంటున్నాయి. ఇందులో నాగాలాండ్‌, మిజోరం, మణిపుర్‌ రాష్ట్రాల్లో నివసిస్తున్న నాగా, కుకీ, మిజో తెగల ప్రజలు మయన్మార్‌లోనూ ఉన్నారు. అనాదిగా వీరి మధ్య సాంస్కృతిక సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. స్థానికుల అభిప్రాయాలను, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా బ్రిటిషర్లు గతంలో భారత్‌, మయన్మార్‌ల మధ్య సరిహద్దు రేఖను ఏకపక్షంగా నిర్ణయించారు. ఒకే తెగకు చెందిన గ్రామాలను రెండు దేశాలకు పంచారు. కొన్నిచోట్ల గ్రామాల్ని సైతం రెండుగా చీల్చారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు భారత్‌లో ఉంటే, పొలాలు మయన్మార్‌లో ఉంటాయి. ఇలాంటి తప్పుల్ని సరిదిద్దే క్రమంలో 2017లో మోదీ ప్రభుత్వం మయన్మార్‌తో స్వేచ్ఛా సంచార పాలన వ్యవస్థ (ఎఫ్‌ఎంఆర్‌) ఒప్పందం కుదుర్చుకుంది. సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్లదాకా ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు కల్పించింది. దీనిపై స్థానిక తెగలూ అప్పట్లో హర్షం వెలిబుచ్చాయి. అయితే, ఆ ఒప్పందాన్నీ రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హోంమంత్రి పేర్కొనడం అక్కడి గిరిజన తెగల్లో గుబులు పుట్టిస్తోంది.

ఒప్పందం రద్దు దిశగా కేంద్రం యోచించడం వెనక ముఖ్య కారణాల్లో మణిపుర్‌ సంక్షోభం ఒకటి. ఆ రాష్ట్రంలో మెయితీ, కుకీ తెగల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు ఇప్పటికీ ఆగలేదు. తాజాగా మయన్మార్‌ సరిహద్దుకు సమీపంలోని మోరే నగరంలో జరిగిన హింసలో ఇద్దరు మణిపుర్‌ పోలీసు కమాండోలు మృతి చెందారు. అయిదుగురు సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. తీవ్ర అలజడి రేపిన ఈ హింస వెనక మయన్మార్‌ నుంచి మణిపుర్‌లోనికి ప్రవేశించిన కుకీ మిలిటెంట్లు కారణమంటూ ఆ రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్‌ సింగ్‌ అనుమానం వ్యక్తం చేశారు. మణిపుర్‌ ప్రభుత్వం కూడా కొన్ని నెలలుగా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది. అక్రమ చొరబాటుదారుల కారణంగానే రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లుతోందని, వారికి అడ్డుకట్ట వేయడానికి సరిహద్దులు మూసివేయాలని, ఎఫ్‌ఎంఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. దీనికి తోడు మయన్మార్‌లో సైన్యానికి, తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కూడా సరిహద్దుల మూసివేత దిశగా కేంద్రం యోచించడానికి కారణంగా కనిపిస్తోంది. అంతర్యుద్ధంలో భాగంగా మయన్మార్‌లోని కుకీలు, ఇతర స్థానిక తెగలు కూడా అక్కడి సైన్యానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగాయి. అలా పోరాటంలోకి దిగిన కొంతమంది మణిపుర్‌లోకి సైతం చొరబడి, ఇక్కడి కుకీలకు మద్దతుగా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సరిహద్దులను మూసివేసి, ఎఫ్‌ఎంఆర్‌ను రద్దు చేయకపోతే భవిష్యత్తులో దాడుల తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నాయి.

అయితే, సరిహద్దు మూసివేత ప్రతిపాదనను మిజోరం, నాగాలాండ్‌ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ప్రజల్లో అలజడి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. సరిహద్దుకు రెండు వైపులా మిజో ప్రజలు ఉన్నారని, తరతరాలుగా వారి మధ్య కొనసాగుతున్న సంబంధాలను నిరోధించడం సరికాదని మిజోరం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా చెబుతున్నారు. నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నిఫ్యూ రియో కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మయన్మార్‌లోని నాగాలతో తమ రాష్ట్ర నాగాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇందుకు తానే పెద్ద ఉదాహరణ అని ఆయన చెప్పారు. బ్రిటిషర్లు ఏకపక్షంగా గీసిన సరిహద్దు రేఖ తరతరాలుగా కలిసి ఉన్న తమ తెగలను విడదీసిందన్న భావన ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రకటనల్లోనూ వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సున్నితమైన ఈ అంశంపై కేంద్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. సరిహద్దుల మూసివేత, ఎఫ్‌ఎంఆర్‌ రద్దు అంశాలను కేవలం మణిపుర్‌ శాంతి భద్రతల కోణంలోనే చూడకూడదు. మయన్మార్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. నాగాలు, మిజోలు, కుకీలు ఇతర స్థానిక తెగలతో చర్చించాలి. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, స్థానికుల సమస్యలను అర్థం చేసుకొంటూ, ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.

మొకర శ్రీనివాస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.