పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?

ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు.

Updated : 10 May 2024 07:34 IST

15 ఏళ్లలో 5 రెట్లు.. 5 ఏళ్లలో రెట్టింపునకు మించి పెరిగిన ధర
అప్పట్లో కొంటే సంపద విలువ ఆ మేర పెరిగినట్లే
నేడు అక్షయ తృతీయ
ఈనాడు వాణిజ్య విభాగం

ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. దేశీయంగా పసిడి, వెండి ధరలు ఇటీవలి గరిష్ఠస్థాయుల నుంచి కొంత తగ్గినా, ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. సమీపకాలంలో ధరల్లో దిద్దుబాటు వచ్చినా, అంతర్జాతీయ కారణాల వల్ల దీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయనే అభిప్రాయాన్ని విక్రేతలు వ్యక్తం చేస్తున్నారు. గత 15 ఏళ్ల ధరలను పరిశీలిస్తే, బంగారం ధర 5 రెట్లకు పైగా పెరిగింది. గత అయిదేళ్లలోనే రెట్టింపునకు మించి ప్రతిఫలం అందించింది. బంగారాన్ని అట్టేపెట్టుకుంటే, కష్టాల్లో ఆదుకుంటుందనే భావన ప్రజల్లో ఉంది. మధ్యమధ్యలో ధర తగ్గినా, దీర్ఘకాలంలో చూస్తే, అధిక ప్రతిఫలాన్ని ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనల వల్ల, తగిన ధ్రువీకరణలు లేకుండా రూ.50,000కు మించి నగదు తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో, ఆభరణాల విక్రయాలపై ప్రభావం పడుతోందని చిన్న వ్యాపారులు పేర్కొంటున్నారు. సంఘటిత సంస్థలు మాత్రం ఆన్‌లైన్‌, కార్డులతో అధీకృత చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తున్నందున పెద్ద తేడా ఉండదంటున్నాయి. పాత ఆభరణాలను మార్చుకుని, కొత్తవి తీసుకున్నా.. తమకు తయారీ/తరుగు రూపేణ కలిసొస్తుందనే భావన వ్యాపారుల్లో ఉంది. అందుకే ఆభరణాలపై తయారీ ఛార్జీల్లో రాయితీలు, పాత ఆభరణాల మార్పిడికి ప్రోత్సాహకాలను ఇస్తున్నారు.
అక్షయం.. అంటే నాశనము లేనిది అని అర్థం. అక్షయతృతీయ నాడు పసిడి, వెండి ఆభరణాలు, ఇల్లు/ఫ్లాట్‌ కొనుగోలు చేసుకున్నా, వాటి విలువ మరింత పెరుగుతుందన్నది ఉత్తర భారతీయుల నమ్మకం. క్రమంగా ఈ అలవాటు తెలుగు రాష్ట్రాలకూ వ్యాపించింది. అయితే మరో 3 నెలల పాటు వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడం, బంగారం ధర మరీ ఎక్కువగా ఉన్నందున.. అమ్మకాలపై ప్రభావం ఉంటుందని భావిస్తున్న వ్యాపారులు, వివిధ రకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. 2019 అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత) ధర రూ.32,450 కాగా, ఇప్పుడు రూ.73,900కు చేరింది. ధర ఇంతగా పెరిగిందంటే, అప్పుడు కొనుగోలు చేసిన వారి సంపద అధికమైందని, దీన్ని సానుకూల సెంటిమెంటుగా పరిగణించాలని వ్యాపారులు సూచిస్తున్నారు.

అంతర్జాతీయం కన్నా దేశీయ ధరలు అధికం

అయిదేళ్ల క్రితం అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 1270 డాలర్లు అయితే, ఇప్పుడు 2315 డాలర్ల వద్ద ఉంది. అప్పుడు డాలర్‌ విలువ రూ.69 కాగా, ఇప్పుడు రూ.83.50 సమీపంలో ఉంది. అప్పుడు దిగుమతి సుంకం, ఇతర పన్నులు కలిపి 13% అయితే, ఇప్పుడు 15.50% అయ్యింది. దాదాపు వ్యాపారులంతా, ఆన్‌లైన్‌ ధరల ప్రకారమే బంగారం ధర నిర్ణయిస్తున్నారు. అయితే ఆభరణాల తరుగు-మజూరు ఛార్జీలు/‘జతచేరుస్తున్న విలువ-వీఏ’, పేరుతో బంగారం ధరపై దాదాపు 10-20% అదనంగా వసూలు చేస్తున్నారు. ఇందువల్ల అంతర్జాతీయ విపణుల కంటే దేశీయంగా ధర మరింత ఎక్కువగా ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని