డొక్కు బస్సుల తుక్కు సర్కారు

పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగకొరికి పెట్టిందట! అలాగే, జగన్‌మోహన్‌రెడ్డికి అధికారమిస్తే ఏపీనంతా పాడుపెట్టేసి జనాన్ని కసిదీరా కాటేశారు. ‘చేయగలిగిందే చెప్పా.. చెప్పిందంతా చేసి చూపించి ప్రజల దగ్గరకు ఒక హీరోలాగా వెళ్తున్నా’ అంటూ జగన్‌ తాజాగా తనకు అలవాటైన ఆత్మస్తుతి రాగాన్ని ఆరున్నొక్క శ్రుతిలో వినిపించారు. ఆయన ఏమి చెప్పారో, ఏమి చేశారో తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్లక్కర్లేదు.

Published : 28 Apr 2024 01:42 IST

పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగకొరికి పెట్టిందట! అలాగే, జగన్‌మోహన్‌రెడ్డికి అధికారమిస్తే ఏపీనంతా పాడుపెట్టేసి జనాన్ని కసిదీరా కాటేశారు. ‘చేయగలిగిందే చెప్పా.. చెప్పిందంతా చేసి చూపించి ప్రజల దగ్గరకు ఒక హీరోలాగా వెళ్తున్నా’ అంటూ జగన్‌ తాజాగా తనకు అలవాటైన ఆత్మస్తుతి రాగాన్ని ఆరున్నొక్క శ్రుతిలో వినిపించారు. ఆయన ఏమి చెప్పారో, ఏమి చేశారో తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్లక్కర్లేదు. అలా రోడ్డు మీదకొచ్చి ఆర్టీసీ డొక్కు బస్సులను చూస్తే చాలు- వైకాపా అధినేత పనితనమెంత ప్రాణాంతకమో అర్థమవుతుంది. కథానాయకుడు కాదు- ప్రజాజీవితంలో ప్రతినాయకుడి పాత్రలో అనితరసాధ్యంగా జీవించిన జగన్మోహన ప్రభువుల భయానక విశ్వరూపం దర్శనమిస్తుంది!  

పన్నెండు నుంచి పదిహేను లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగి, ఆకారానికి మిగిలిన బస్సులను బుద్ధున్న ఏ ప్రభుత్వమైనా రోడ్డెక్కిస్తుందా? స్వలాభాలూ స్వార్థప్రయోజనాల యావే తప్ప జనం మీద దయలేని జగన్‌ సర్కారు ఆ పనే చేసింది. తుక్కు సామాన్ల కింద కాటాకు వేయాల్సిన బస్సులకు పైపై మరమ్మతులు చేయించి రోడ్ల మీదకు తోలింది. ప్రయాణికుల బతుకులతో మృత్యుక్రీడలాడింది. మొన్న శుక్రవారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం డిపోకు చెందిన బస్సు బళ్లారి నుంచి వస్తూ తీవ్ర ప్రమాదానికి లోనైంది. దారిమధ్యలో అడ్డొచ్చిన గేదెను తప్పించడానికి డ్రైవర్‌ ప్రయత్నించారు. అది కాలంచెల్లిన బస్సు కావడంతో పాపం ఆయన నియంత్రణలోకి రాలేదు. కల్వర్టును గుద్ది, పక్కనే ఉన్న గుంతలోకి బొల్తాకొట్టేసింది. ఈ దుర్ఘటనలో ఇరవై మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అదే రోజు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ బస్డాండ్‌లో బ్రేకులు ఫెయిలైన బస్సు ప్లాట్‌ఫాం మీదకు ఎక్కేసింది. అదృష్టవశాత్తు అక్కడెవరూ లేరు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. అదీ ఎక్స్‌పైరీ డేట్‌ దాటిపోయిన బస్సే. జనానికి తాను చేసినంత మంచిని మరెవరూ చేయలేదంటూ జగన్‌ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటారు. ఆ సొంతడబ్బా సంగతి అలా ఉంచితే- జనం నెత్తురు కళ్లజూసిన జగన్‌ పాలనకు సాక్ష్యాలు ఆయన సొంత జిల్లాలోనే కనపడతాయి. మొన్నామధ్య ప్రొద్దుటూరు డిపో బస్సు ఒకటి కడప నగరంలోని సంధ్యా కూడలి దగ్గరకు రాగానే బ్రేకులు మొరాయించాయి. డ్రైవర్‌ జాగ్రత్తగా ఎలాగో బస్టాండ్‌ వరకు తీసుకెళ్ళారు. అక్కడ దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తే బ్రేకులు పడక ఎదురుగా ఉన్న మనుషుల్ని ఢీకొట్టేసింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డిపోకు చెందిన ఓ బస్సు బ్రేకులు బాగాలేవని డ్రైవర్లు అధికారులకు ముందే మొరపెట్టుకున్నారు. కానీ, కీలక విడిభాగాలను మార్చకుండానే ఆ బస్సును జనారణ్యంలోకి పంపేశారు. దాంతో ఇటీవల అది వీరవాసరం దగ్గర అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. తన దారిన తాను పోతున్న ఓ ద్విచక్రవాహనదారుణ్ని ఆ బస్సు బలితీసుకుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో దుర్ఘటనలు... కొత్త బస్సుల కొనుగోలును గాలికొదిలేసిన జగన్‌ సర్కారు పాతకాలే అవన్నీ!

‘ఆర్టీసీలో 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి... అలాగైతేనే ప్రయాణికుల భద్రతలో ప్రమాణాలు పాటించినట్లు’- సీఎం కుర్చీ ఎక్కిన కొత్తలో జగన్‌ చెప్పిన మాట ఇది! అటువంటి నీతిశతకాలు వల్లించిన మనిషి- బస్సుల కొనుగోళ్లకు డబ్బులు ఇవ్వాలి కదా? ‘అప్పులో రామచంద్రా’ అంటూ జోలెపట్టి రాష్ట్ర రుణభారాన్ని రూ.11 లక్షల కోట్లు దాటించిన జగన్‌- రోజుకు దాదాపు 38 లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులను వాటి ఖర్మకు వాటిని వదిలేశారు. దాంతో నిరుడు డిసెంబరు చివరినాటికి ఆర్టీసీలో కాలంచెల్లిన బస్సులు... అంటే, 12 లక్షల కి.మీ.లకు మించి తిరిగేసిన వాటి సంఖ్య 4,445కు ఎగబాకింది. ఆ డొక్కు ‘ప్రగతిరథాల్లో’ 1626 అయితే 15 లక్షల కి.మీ.లకన్నా ఎక్కువే తిరిగాయి. వాటిని అలాగే నడిపించిన జగన్‌ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు హోరుగాలిలో చమురు దీపాలయ్యాయి. మొన్న బుధవారం శ్రీసత్యసాయి జిల్లా మామిళ్లపల్లిలో స్టీరింగ్‌ పట్టేయడంతో డివైడర్లను ఢీకొట్టి రోడ్డుపక్కన ఆరడుగుల లోతులోకి తిరగబడిందో బస్సు. 14 లక్షల కి.మీ. తిరిగిన ఆ బస్సులో జనాన్ని ఎక్కించడమంటే- మందిని మృత్యువాహనంలోకి తోసేయడమే కదా! అలాగే, వారం కిందట సింహాచలం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు చక్రం హఠాత్తుగా ఊడిపోయింది. మొన్న గురువారం బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న సూపర్‌లగ్జరీ బస్సు చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారి మీద ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆ సమయంలో వెనకాల ఏవైనా వాహనాలు వచ్చి ఉంటే- ఎంత ఘోరం సంభవించేదో ఊహకైనా అందదు! గడచిన అయిదేళ్లలో ఇలా ఎన్నెన్నో బస్సులు- ప్రయాణికులకు ప్రత్యక్ష నరకాన్ని చవిచూపించాయి. అయినాసరే, జగన్‌ ప్రభుత్వం బెల్లంకొట్టిన రాయిలానే కూర్చుంది.  వైకాపా సర్కారు 2020లో ముచ్చటగా మూడొందల బస్సులు మాత్రమే కొన్నది. నిరుడు ఇంకో 1500 బస్సులను కొనుగోలు చేసినట్లు నానా హడావుడి చేసింది. కానీ, ఇంతవరకు వాటిలో అయిదో వంతు బస్సులే అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీసీకి నెలకు రూ.600 కోట్లు ఆదాయం వస్తే- అందులో రూ.150 కోట్లను తన గల్లాపెట్టెలో వేసుకుంటున్న జగన్‌ సర్కారుకు సొమ్ములకేమి కొదవ? అయినా, కొత్త బస్సుల కొనుగోళ్లు అనేది జగన్‌కు ప్రాధాన్యాంశం కాలేదంటే కారణం- జనం బాగోగుల పట్ల ఆయన లెక్కలేనితనమే! సామాన్యులకు డొక్కు బస్సులు మిగిల్చిన జగన్‌- తనకోసం మాత్రం రూ.23 కోట్ల ఆర్టీసీ డబ్బులతోనే ప్రత్యేక లగ్జరీ బస్సులను కొనిపించారు. జగన్‌ మార్కు ప్రజాసేవ అంటే ఇదే- జనం సొమ్ముతో రాచభోగాలు అనుభవించడమే!

‘ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రతి ఒక్కరి మంచికోసం ఉపయోగించా’నంటూ జగన్‌మోహన్‌ రెడ్డి తన మెడలో తానే వీరతాడు వేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలను మూడుసార్లు బాది, సామాన్యుల నెత్తిన రూ.5,243 కోట్ల అదనపు భారాన్ని మోపిన జగన్‌ ప్రభుత్వం జనానికి మేలుచేసిందా? మెదడు చితికిన మనుషులు తప్ప మరెవరూ అలా అనలేరు. 2019లో బనగానపల్లె నుంచి హైదరాబాద్‌కు ఛార్జీ రూ.375 ఉండేది. దాన్ని రూ.520కి పెంచిపారేసిన ‘పరమాద్భుత ప్రజాపక్షపాతి’ జగన్‌! ఒంగోలు నుంచి పొదిలికి బస్సులో వెళ్ళేందుకు ఒకప్పుడు రూ.35 అయ్యేది. ఆ ఛార్జీని ఏకంగా రెండింతలు చేసి, జనం జేబులకు కత్తెరేసింది జగన్‌ సర్కారు. ఇలా ఛార్జీల బాదుడుతో సామాన్యులను వాయగొట్టిన వైకాపా ప్రభుత్వం- ఆర్టీసీ ఉద్యోగులకూ అన్నిరకాలుగా మొండిచెయ్యి చూపించింది. ప్రభుత్వంలో విలీనం చేసినట్టే చేసి, వారికి దక్కాల్సిన ప్రయోజనాలకు భారీగా గండికొట్టింది. ఆర్టీసీ బస్సులను జగన్‌ సభలకు విచ్చలవిడిగా పట్టుకుపోయి సాధారణ ప్రజలను పెనుఅవస్థల పాల్జేసింది. ఇటువంటి ప్రజావ్యతిరేక సర్కారును శంకరగిరి మాన్యాలు పట్టించడం ఇక ఓటర్ల వంతు!

శైలేష్‌ నిమ్మగడ్డ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు