ద్రవ్యలోటును కట్టడి చేసేదెలా?

ఒక దేశం లేదా రాష్ట్ర వార్షిక ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే ద్రవ్యలోటు ఏర్పడుతుంది. దీన్ని మూడుశాతానికి పరిమితం చేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అలాగే రుణాలను మూలధన వ్యయానికి కేటాయిస్తేనే అభివృద్ధి జోరందుకుంటుంది.

Published : 25 May 2024 00:26 IST

ఒక దేశం లేదా రాష్ట్ర వార్షిక ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే ద్రవ్యలోటు ఏర్పడుతుంది. దీన్ని మూడుశాతానికి పరిమితం చేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అలాగే రుణాలను మూలధన వ్యయానికి కేటాయిస్తేనే అభివృద్ధి జోరందుకుంటుంది.

దాయ వ్యయాలు సమానంగా ఉంటే దాన్ని సంతులిత బడ్జెట్‌ అంటారు. ఒక వేళ వ్యయం కన్నా ఆదాయం అధికంగా ఉంటే దాన్ని మిగులు బడ్జెట్‌ అంటారు. రెవిన్యూ, మూలధన ఖాతా లోట్లు రెండింటినీ కలిపితే ద్రవ్యలోటు లేదా బడ్జెట్‌లోటు ఏర్పడుతుంది. దేశ ఆర్థిక ఆరోగ్యానికి కొలమానంగా దీన్ని ఉపయోగిస్తారు. 20వ శతాబ్దం వరకు చాలా మంది ఆర్థికవేత్తలు సమతుల్య లేదా మిగులు బడ్జెట్‌ విధానాన్ని పాటించేవారు. క్రమంగా ఈ పరిస్థితి మారి లోటు బడ్జెట్‌ విధానాన్ని అమలుచేయడం మొదలైంది. ఈ ద్రవ్యలోటును సాధారణంగా రుణాల నుంచి లేదా నగదు నిల్వలు, ప్రవాస భారతీయులు పంపిన డిపాజిట్ల నుంచి పూరిస్తారు.

మరింత కసరత్తు అవసరం

ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం ప్రకారం ద్రవ్య లోటు జీడీపీలో మూడు శాతానికి మించకూడదు. వ్యయం పెరిగితే దేశీయ కరెన్సీ భారీగా చలామణీలోకి వస్తుంది. దానివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దేశ ఆర్థిక ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. 2023-24 బడ్జెట్‌ సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు రూ.17.35 లక్షల కోట్లు. ఇది జీడీపీలో 5.8శాతం. 2024-25 బడ్జెట్‌ నాటికి దీన్ని 4.5శాతానికి పరిమితం చేయాలన్నది లక్ష్యం. కరోనా కాలంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వం అధికంగా వెచ్చించవలసి వచ్చింది. అందువల్ల 2020-21లో ద్రవ్యలోటు 9.2శాతంగా నమోదయింది. అప్పటి నుంచి దాన్ని కేంద్రం తగ్గించుకుంటూ వచ్చింది. అయితే, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన మూడుశాతానికి చేరుకోవాలంటే వ్యయ నియంత్రణ కోసం మరింత కసరత్తు చేయాల్సి ఉంది.

రుణం జీడీపీలో ఎంతశాతం ఉందనే దాన్నిబట్టి ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను అంచనా వేయవచ్చు. రుణాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ద్రవ్యలోటు మాదిరిగా దేశ జీడీపీలో రుణం ఎంతశాతం ఉండాలన్నదానిపై ఎలాంటి పరిమితీ లేదు. 2016లో నియమితమైన ఎన్‌కే సింగ్‌ కమిటీ మాత్రం 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం, రాష్ట్రాల మొత్తం రుణం జీడీపీలో 60శాతంగా ఉండాలని సూచించింది. దానికి భిన్నంగా అది 81శాతానికి చేరుకొంది. భారత్‌ రుణ-జీడీపీ నిష్పత్తి అధికస్థాయిలో ఉన్నా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని సంతృప్తి పడి నిర్లిప్తంగా ఉండటానికీ వీల్లేదు. రుణభారం విషయంలో అమెరికా, చైనా, జపాన్‌లు వరసగా తొలి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. భారత్‌ ప్రస్తుతం ఏటా అసలు, వడ్డీతో కలిపి భారీగా చెల్లిస్తోంది. ఇది ప్రతి సంవత్సరం విద్య, ప్రజారోగ్యంపై వెచ్చిస్తున్నదానితో సమానం. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే, ఖర్చులు పెరగడమే కాకుండా ఆదాయాలు తగ్గడమూ ద్రవ్యలోటుకు ఒక కారణం. జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నా అది స్వల్పమే. కేంద్రం, రాష్ట్రాలు పన్నేతర రాబడినీ పెంచుకోవాల్సిన అవసరముంది. ఇందుకోసం పన్నుల వ్యవస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టాలి. కృత్రిమమేధ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతలను దీనికి వినియోగించుకోవాలి. ఎక్కువ మంది అర్హులను పన్ను పరిధిలోకి తీసుకొచ్చి, వయోధికులను ఆదాయపన్ను నుంచి మినహాయించాలి. అలాగే పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను హేతుబద్ధీకరించాలి.

సంపద సృష్టితో సంక్షేమం...

ఆదాయానికి తగినట్లుగా మూలధన వ్యయానికి తక్కువ స్థాయిలో కేటాయింపులు జరిపితే అభివృద్ధి కుంటువడుతుంది. ఈ క్రమంలో బ్రిటిష్‌ ఆర్థికవేత్త కీన్స్‌- లోటు బడ్జెట్‌ విధానాన్ని సూచించారు. ఒకవేళ ఆదాయం చాలకపోతే రుణాలు తెచ్చి సంపదను సృష్టించాలి. ఆ సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజాసంక్షేమానికి వినియోగించవచ్చు. అంతేగానీ భారీగా అప్పులు చేసి వాటిని సంక్షేమానికి వినియోగించడం సరికాదు. వినియోగ వ్యయం కన్నా మూలధన వ్యయం అభివృద్ధికి ఎక్కువగా దోహదపడుతుంది. మూలధన వ్యయంతో మౌలికవసతులు కల్పించాలి. తద్వారా ఉపాధి, జీవన ప్రమాణాలు త్వరితగతిన పెరుగుతాయి. అప్పులపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణం పెరిగినకొద్దీ వడ్డీ సైతం అధికమవుతుంది. రుణ వాయిదాల కోసం మళ్ళీ భారీగా అప్పుచేయాల్సి వస్తుంది. చివరకు ఇది ఒక విషవలయంగా మారి రాష్ట్రం లేదా దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి తలెత్తుతుంది. అప్పు తెచ్చిన ముఖ్యమంత్రి రాబోయే కాలంలో ఉండరు. ఆయన స్థానంలో వచ్చిన కొత్త ముఖ్యమంత్రి ఈ రుణభారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి అప్పుచేసేది ఒకరు, దాన్ని తీర్చేది మరొకరు అన్నట్లుగా తయారవుతుంది. ఈ దుస్థితిని నివారించడానికి రుణ నియంత్రణ కోసం కేంద్రం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉంది.

ఆచార్య బీఆర్‌కే రావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.