అక్రమ ఆయుధాల పెనుముప్పు

గుర్తు తెలియని దుండగులు ఇటీవల ముంబయిలోని బాంద్రాలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరపడం కలకలం రేపింది. బిహార్‌లోని సారణ్‌ జిల్లాలో తాజా ఎన్నికల తరవాత చెలరేగిన హింసలో కాల్పులు చోటుచేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇండియాలో పెళ్ళిళ్లు, ఇతర వేడుకల సమయంలోనూ తరచూ కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Published : 25 May 2024 00:25 IST

గుర్తు తెలియని దుండగులు ఇటీవల ముంబయిలోని బాంద్రాలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరపడం కలకలం రేపింది. బిహార్‌లోని సారణ్‌ జిల్లాలో తాజా ఎన్నికల తరవాత చెలరేగిన హింసలో కాల్పులు చోటుచేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇండియాలో పెళ్ళిళ్లు, ఇతర వేడుకల సమయంలోనూ తరచూ కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

త్మరక్షణ కోసం లైసెన్సుల ద్వారా తీసుకున్న తుపాకులతో కొందరు వేడుకల సమయంలో గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు. దీనివల్ల సామాన్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి కాల్పుల వల్ల ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఇండియాలో అక్రమ తుపాకులు యథేచ్ఛగా అసాంఘిక శక్తుల చేతుల్లోకి చేరి తరచూ రక్తపాతం సృష్టిస్తున్నాయి. వివాహ వేడుకల్లో ఉల్లాసం నింపడానికి, తమ దర్పాన్ని చాటుకోవడానికి కొందరు తుపాకులతో గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు. ఈ విష సంస్కృతి ఇటీవల పుట్టిన రోజు వేడుకలకూ పాకింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలో చట్ట ప్రకారం పండుగలు, వేడుకల సందర్భాల్లో కాల్పులు జరపడం నిషేధం. ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలుశిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా విధించవచ్చు. 

బిహార్‌లో కనీసం 25 జిల్లాల్లో పెళ్ళిళ్లు, ఇతర వేడుకల సందర్భంగా తుపాకీ కాల్పుల వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, మరెందరో గాయాలపాలవుతున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరుడు పట్నా హైకోర్టుకు వెల్లడించింది. అలాంటి 66 కేసుల జాబితాను ఉన్నత న్యాయస్థానానికి అందించింది. బాగా చదువుకున్నవారు సైతం కనీస విచక్షణ మరచి కాల్పులు జరుపుతుండటం తీవ్ర విచారకరం. క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ప్రతిపక్షాల ఆరోపణల వల్ల పంజాబ్‌ ప్రభుత్వం ఇటీవల 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది. వేడుకల్లో తుపాకీ మోతలు ఒకవైపు బెంబేలెత్తిస్తుంటే, మరోవైపు గుర్తుతెలియని వ్యక్తులు అక్రమ తుపాకులతో జరిపే కాల్పులు ఎందరినో బలితీసుకుంటున్నాయి. ఇటీవల దిల్లీలో పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచిలో పని చేస్తున్న ఏఎస్సై దినేష్‌శర్మపై ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుడు నాటు తుపాకీ ఉపయోగించాడు. అది ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి దిగుమతి అయినట్లు తేలింది. అక్రమ తుపాకులు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ధార్, ఖర్గోన్, సెంధ్వా, బుర్హాన్‌పుర్‌; బిహార్‌ రాష్ట్రంలోని అరరియా, ముంగేర్‌; ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్, రాంపుర్, అలీగఢ్, మైన్‌పురీ నుంచి వెల్లువెత్తుతున్నాయి. వీటిని తక్కువ ధరకే మార్కెట్లో విక్రయిస్తున్నారు. అసాంఘిక శక్తులు వీటిని కొనుగోలు చేసి నేరాలకు పాల్పడుతున్నాయి. ఇండియాలో 2016-2023 మధ్యకాలంలో అత్యధిక తుపాకీ లైసెన్సులు జమ్మూకశ్మీర్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, మహారాష్ట్ర, మణిపుర్, నాగాలాండ్‌లలో జారీ అయ్యాయి. 2023 గణాంకాల ప్రకారం అత్యధికంగా 13 లక్షలకు పైగా లైసెన్సుడు తుపాకులు ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో అవి 2.82 లక్షలు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణభారతంలో భిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తుపాకీ లైసెన్సులు చాలా తక్కువగా మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలు అన్నీ కలిపి 1.73 లక్షల లైసెన్సుడు తుపాకులు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా లైసెన్సు పొందిన తుపాకులు 37 లక్షలకు పైగా లెక్కతేలుతున్నాయి. అయితే, ఎటువంటి అనుమతులూ లేని తుపాకులు ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయన్నది కాదనలేని సత్యం. వాటివల్లే ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. రాజస్థాన్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) దాడిలో ఏడేళ్ల క్రితం అంతర్రాష్ట్రీయ అక్రమ ఆయుధ లైసెన్సుల సిండికేట్‌ బాగోతం వెలుగు చూసింది. ఇష్టారీతిగా తయారుచేసి పప్పుబెల్లాల్లా విక్రయిస్తున్న తుపాకుల వల్ల ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోంది. వాటితో నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. అందువల్ల దేశీయంగా అక్రమ ఆయుధాల తయారీపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి. వాటిని వినియోగిస్తున్న వారికి కఠిన శిక్షలు విధించాలి. మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు, ఇతర కార్యక్రమాలకు ఆయుధాలను తీసుకెళ్ళడం, ప్రదర్శించడం నేరమని అందరిలో అవగాహన పెంచాలి. వేడుకల్లో తుపాకీ కాల్పుల కేసులపై త్వరితగతిన విచారణ జరిపి దోషులకు సరైన శిక్షలు విధించాలి.

ఎస్‌.ప్రభుప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.