నేరాల బందిఖానాలో బాల్యం

పునాదులు పెళుసైతే భవనం కుప్పకూలిపోతుంది. విత్తనాల్లో సత్తువ లేకపోతే పంట దిగుబడి తెగ్గోసుకుపోతుంది. పిల్లల విషయంలోనూ అదే వర్తిస్తుంది. బాల్యం కట్టుతప్పితే భావి జీవితమంతా చీకటిమయమవుతుంది. ఎవరి పనుల్లో వారు తలమునకలవుతున్న తల్లిదండ్రులు, చదువు చెప్పడమంటే- బెత్తం పట్టుకుని పుస్తకాలను బట్టీ పట్టించడమేనని భావించే ఉపాధ్యాయులు, సమాజ సంక్షేమాన్ని పట్టించుకోని నాయకులు... ఇలా అందరూ కలిసి నేడు బాలభారతాన్ని నేరాల నిప్పులగుండంలోకి నెట్టేస్తున్నారు.

Published : 26 May 2024 00:35 IST

పునాదులు పెళుసైతే భవనం కుప్పకూలిపోతుంది. విత్తనాల్లో సత్తువ లేకపోతే పంట దిగుబడి తెగ్గోసుకుపోతుంది. పిల్లల విషయంలోనూ అదే వర్తిస్తుంది. బాల్యం కట్టుతప్పితే భావి జీవితమంతా చీకటిమయమవుతుంది. ఎవరి పనుల్లో వారు తలమునకలవుతున్న తల్లిదండ్రులు, చదువు చెప్పడమంటే- బెత్తం పట్టుకుని పుస్తకాలను బట్టీ పట్టించడమేనని భావించే ఉపాధ్యాయులు, సమాజ సంక్షేమాన్ని పట్టించుకోని నాయకులు... ఇలా అందరూ కలిసి నేడు బాలభారతాన్ని నేరాల నిప్పులగుండంలోకి నెట్టేస్తున్నారు. ఏ పనికి ఎటువంటి పర్యవసానాలు ఉంటాయో అర్థం చేసుకోలేని పిల్లలను జాగ్రత్తగా సంరక్షించాల్సింది పెద్దలే. కానీ, వారిలో చాలామంది చేస్తున్నదేమిటి? ముక్కుపచ్చలారని బాలబాలికలు వ్యసనాల పాలవుతోంటే వేడుక చూస్తున్నారంతే! అర్ధరాత్రి పూట పీకల్దాకా మందుకొట్టి కారు నడిపి పుణెలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను బలితీసుకున్న మైనర్‌ దారుణోదంతం కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. పిల్లల పెంపకంలో అమ్మానాన్నల అశ్రద్ధకు, వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడంలో విద్యాలయాల వైఫల్యానికి, చట్టాల అమలులో సర్కారీ అలక్ష్యానికి పుణె దుర్ఘటన ఒక నిదర్శనం!

పుణెకు చెందిన ఒక పెద్ద బిల్డర్‌ కొడుకు అతను. పన్నెండో తరగతి పాసైనందుకు స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకోవాలనుకున్నాడు. రెండు కోట్ల రూపాయల విలువైన కారేసుకుని రోడ్డు మీద పడ్డాడు. మిత్రులతో కలిసి ఓ పబ్‌కు వెళ్ళి మద్యం తాగాడు. తొంభై నిమిషాల్లో రూ.48 వేలు ఖర్చయిపోయేంతగా గొంతు వరకు మందు పట్టించి, తండ్రి క్రెడిట్‌ కార్డుతో బిల్లు కట్టాడు. తరవాత తన మందను వెంటేసుకుని ఇంకో పబ్‌కు వెళ్ళి రూ.20వేలు పెట్టి అక్కడ మళ్ళీ తాగి తందనాలాడాడు. మత్తు పూర్తిగా తలకెక్కిన స్థితిలో కారును ఎడాపెడా దౌడుతీయించి, దార్లో ఒక బైకును ఢీకొట్టి ఇద్దరి ప్రాణాలు తీశాడు. పదిహేడేళ్ల కుర్రాడు మద్యానికి బానిసైతే- ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదా? ఆ పిల్లాడికి కారిచ్చి, క్రెడిట్‌ కార్డు చేతిలో పెట్టి సాగనంపారంటే- ముందు శిక్షించాల్సింది ఎవరిని? మైనర్లకు మద్యం అమ్మకూడదన్న నిబంధనను నట్టేట్లో కలిపిన పబ్‌ల నిర్వాహకులను ఏమి చేయాలి? మద్యాదాయంతో ఖజానాలు నింపుకొంటూ, ఎవరెలా పోతే మాకేమిటి అన్నట్లుగా వ్యవహరిస్తున్న పాలకులకు ఎంతటి కఠిన దండన విధించాలి?

ఇంట్లో దీపమే కదా అని ముద్దుపెట్టుకుంటే ముఖం కాలిపోతుంది. దారితప్పిన పిల్లలకు బుద్ధిచెప్పకుండా వారిని ఇంకా వెనకేసుకొస్తే- ఆ దుష్ఫలితాలను కుటుంబం యావత్తూ ఎదుర్కోవాల్సి వస్తుంది. తాగిన మైకంలో కారు తోలి నడిరోడ్డుపై నెత్తుటేళ్లు పారించిన పుణె కుర్రాణ్ని కాపాడటానికి అతని తండ్రి, తాత తెగ ప్రయత్నించారు. ఆ సమయంలో కారు నడిపింది తానేనంటూ నేరం తన నెత్తిన వేసుకునేలా తమ డ్రైవరును బెదిరించారు. బండి తీయడానికి తగిన వయసు లేని పిల్లాడికి కారు తాళాలు ఇవ్వడమే పెద్ద తప్పు అయితే- జరిగిన ఘోరాన్ని కప్పిపుచ్చాలనుకోవడం మరో మహాపరాధం. అందుకే వారిద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఆర్నెల్ల కిందట పదిహేనేళ్ల బాలుడు కారును యమస్పీడుగా పరుగులు తీయించి ఇద్దరు మనుషుల్ని పొట్టనపెట్టుకున్నాడు. అదే పిల్లాడు నాలుగు రోజుల క్రితం మళ్ళీ దురుసుగా డ్రైవింగ్‌ చేసి నలుగురు వ్యక్తులను ఢీకొట్టాడు. పైపెచ్చు అతని తండ్రి... కాన్పుర్‌లో మంచి పేరున్న డాక్టర్‌. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదన్న సంగతి ఆయనకు తెలియదనుకోలేం. ఆ నేరానికి ఆ వ్యక్తి శిక్ష అనుభవించాల్సిందే. కానీ, ఇద్దరి మృతికి కారణమైన బాలుడికి కనీసం చట్టపరంగా సరైన పాఠం నేర్పించి ఉంటే- అతగాడు తిరిగి స్టీరింగ్‌ ముట్టుకునేవాడేనా? మొన్నామధ్య కరీంనగర్‌లో ఓ బాలుడి దుందుడుకు డ్రైవింగ్‌- నలుగురి దేహాలను ఛిద్రం చేసేసింది. నిర్మల్‌ జిల్లా కడెంలో 15-16 ఏళ్ల బాలురు ఆటో నడిపి, పంటకాల్వలోకి దాన్ని బోల్తాకొట్టించారు. ఆ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు బలైపోయారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఓ మైనర్‌ అతివేగంగా బైక్‌ నడుపుతూ ముందు వెళ్తున్న మరో బండిని ఢీకొట్టాడు. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు మనుషులు అక్కడికక్కడే చనిపోయారు. హైదరాబాద్‌ నగరంలో బండ్లు వేసుకుని రయ్‌...రయ్య్‌మని దూసుకుపోయే బడి పిల్లలు, మైనర్లు ఎందరో కనపడుతుంటారు. అలా పిల్లలకు వాహనాలిచ్చినందుకు గడచిన అయిదు నెలల్లోనే 1850 మందికి పైగా పెద్దలకు నగర పోలీసులు జరిమానాలు విధించారు. వాహనాన్ని సరిగ్గా అదుపు చేయలేని బాలబాలికలకు బైకు, కారులిచ్చి పంపడం అతిప్రమాదకరం. చాలామంది తలిదండ్రుల్లో ఆ స్పృహ కొరవడటమే జాతి ప్రారబ్ధం!

నెల్లూరులో ఇటీవల ఓ ఎనిమిదో తరగతి పిల్లాడు బైకు మీద ఇంకో ఇద్దరిని ఎక్కించుకొని వెళ్తుంటే- పోలీసులు పట్టుకుని వారి అమ్మానాన్నలను కౌన్సిలింగ్‌కు పిలిపించారు. ‘బైక్‌ ఇవ్వకపోతే స్కూల్‌కు వెళ్ళమంటున్నారు... చనిపోతామని బెదిరిస్తున్నారు’ అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. అంతటి మొండితనం పిల్లలకు ఎక్కడి నుంచి వస్తోంది? అమ్మానాన్నల అతిగారాబమే దానికి మొదటి కారణం. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి, తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపారాల్లో తీరిక లేకుండా ఉంటుండటంతో పిల్లలు ఒంటరి పక్షులవుతున్నారు. మొబైల్‌తో దోస్తీ చేస్తూ, సామాజిక మాధ్యమాలకు వారు బానిసలవుతున్నారు. అంతర్జాలంలో హింసాత్మక ఆటలాడుతూ ప్రతికూల భావాలను అలవరచుకుంటున్నారు. నీతిశతకాలు, పంచతంత్ర కథల వంటివాటితో జీవన విలువలను బోధించే అమ్మభాషకు పిల్లలు దూరమైపోతున్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు పాఠశాలలకూ చేరిన దౌర్భాగ్య వాతావరణంలో మైనర్లు- అత్యంత హేయనేరాలకూ పాల్పడుతున్నారు. ఏలూరు జిల్లా మండవల్లిలో పదో తరగతి మార్కులలిస్టు తీసుకువెళ్ళేందుకు వచ్చిన ఒక విద్యార్థినిపై తోటివిద్యార్థే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తరగతి గదిలోకి లాక్కెళ్ళి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఇటువంటి అకృత్యాలు ఒకటో రెండో కాదు- దేశవ్యాప్తంగా కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి. పదిహేనేళ్ల పిల్లలు సైతం అంత పైశాచికంగా ప్రవర్తించడానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో అసభ్య దృశ్యాలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాలంలో పోటెత్తుతున్న అశ్లీల వీడియోలు- సెల్‌ఫోన్ల ద్వారా నట్టింట్లోకి వచ్చిపడుతున్నాయి. వాటిని కట్టడి చేయలేని ప్రభుత్వాల అసమర్థతే- నవతరంలో నేరప్రవృత్తిని ఎగదోస్తోంది.

చిన్నారుల వ్యక్తిత్వ నిర్మాణానికి జపాన్‌ విద్యావిధానం అధిక ప్రాధాన్యమిస్తుంది. క్రమశిక్షణతో మెలగడం, పెద్దలను గౌరవించడం, ఎక్కడ ఎలా నడుచుకోవాలన్న అంశాలను అక్కడ పిల్లలకు ప్రాథమిక దశలోనే బోధిస్తారు. దక్షిణ కొరియాలోనూ బాలబాలికలను అదే విధంగా తీర్చిదిద్దుతుంటారు. మరి మనదగ్గరేమో- నైతిక విద్యాబోధన నేతిబీర చందమవుతోంది. ఉపాధ్యాయులను ఆటపట్టించడం, ఆడపిల్లలను ఏడిపించడం హీరోయిజంగా చలామణీ అవుతోంది. ఆ వెర్రిమొర్రి సంస్కృతిని వదిలించుకున్న నాడే- భావిభారతం సురక్షితమవుతుంది!

శైలేష్‌ నిమ్మగడ్డ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.