ధరల పొంగు తగ్గిన వంటనూనెలు

వంటనూనెల ధరలు రెండేళ్ల క్రితంతో పోలిస్తే దాదాపు సగానికి సగం తగ్గాయి. లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా ధరలు దిగివచ్చేలా కేంద్రం జాగ్రత్త పడిందని విశ్లేషకులు అంటున్నారు.

Published : 27 May 2024 00:29 IST

వంటనూనెల ధరలు రెండేళ్ల క్రితంతో పోలిస్తే దాదాపు సగానికి సగం తగ్గాయి. లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా ధరలు దిగివచ్చేలా కేంద్రం జాగ్రత్త పడిందని విశ్లేషకులు అంటున్నారు.

పామాయిల్‌తో పాటు పొద్దుతిరుగుడు, సోయా వంటి నూనెలపై అంతర్జాతీయ విపణిలో సాగుతున్న వ్యాపార మాయాజాలానికి ధరల్లో నెలకొన్న హెచ్చుతగ్గులే నిదర్శనం. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తి యుద్ధం ప్రారంభించగానే ఆ రెండు దేశాల నుంచి నూనె రావడం లేదనే సాకుతో పొద్దుతిరుగుడు నూనె ధర లీటరుకు రూ.200దాకా పెరిగింది. ఇప్పటికీ ఆ యుద్ధం ముగియలేదు. పైగా మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ దాడులతో ఒత్తిడి మరింత పెరిగింది. అయినా, ఇప్పుడు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. పామాయిల్‌ లీటరు గరిష్ఠ చిల్లర ధర సైతం రూ.160 నుంచి రూ.80కి దిగివచ్చింది. పామాయిల్‌ ధరతో అనుసంధానమైన ఆయిల్‌పామ్‌ పంట ధర కూడా బాగా తగ్గడంతో తెలుగు రాష్ట్రాల రైతులు నష్టపోతున్నారు.

విదేశాలే దిక్కు...

భారతీయులకు ఏటా 2.50 కోట్ల టన్నులకు పైగా వంటనూనెలు అవసరం. 2022 నవంబరు- 2023 అక్టోబరు నూనెల ఏడాదిలో విదేశాల నుంచి 1.64కోట్ల టన్నులకు పైగా వంటనూనెలను మనదేశం దిగుమతి చేసుకుంది. ఇది దేశ చరిత్రలోనే అత్యధికం. 2017-18లో   1.45 కోట్ల టన్నుల వంటనూనెల దిగుమతికి రూ.66,942 కోట్లు వెచ్చించారు. 2022-23లో అంతకన్నా 19లక్షల టన్నుల వంటనూనెలు అదనంగా పెరిగి 1.64కోట్ల టన్నులు దిగుమతి చేసుకున్నా, వీటికి చెల్లించిన సొమ్ము సుమారు లక్షా 38వేల కోట్ల రూపాయలకు ఎగబాకడం గమనార్హం. గత ఆరేళ్లలో వంటనూనెల దిగుమతి పరిమాణం 13శాతం పెరిగింది. చెల్లించాల్సిన సొమ్ము మాత్రం 79శాతం మేర ఎగబాకింది.
భారత ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అంతర్జాతీయ విపణిని విదేశీ వ్యాపారులు శాసిస్తున్నారు. పామాయిల్‌ నూనెను ఇండొనేసియా, మలేసియాలే అత్యధికంగా ఎగుమతి చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను బట్టి ధరలు మారిపోతున్నాయి. 2022 నవంబరులో ముడి పొద్దుతిరుగుడు నూనె టన్ను ధర 1445 డాలర్లుంటే ఇప్పుడు 970 డాలర్లకు చేరింది. అప్పట్లో ఉక్రెయిన్, రష్యా యుద్ధం సాకుతో ధర పెంచేశారు. పామాయిల్‌ ధర తగ్గడంతో అది కూడా దిగివచ్చింది. అర్జెంటీనా, బ్రెజిల్‌ నుంచి సైతం పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు నూనెలను ఇండియాకు దిగుమతి చేసుకుంటున్నారు. రొమేనియా, రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి సైతం పొద్దుతిరుగుడు నూనె వస్తోంది. ఈ దేశాల విపణులకు భారత్‌ కాసులు కురిపించే కల్పవృక్షంలా మారింది. పామాయిల్, పొద్దుతిరుగుడు, సోయా వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 5.5 శాతానికి తగ్గిస్తూ గతేడాది కేంద్రం నిర్ణయించడం వెనక ఎన్నికల వేళ వంటనూనెల ధరలు తగ్గించే రాజకీయ ఎత్తుగడ ఉందనే విమర్శలున్నాయి.

ఆర్థిక భారం

వంటనూనెల కోసం ఎక్కువగా విదేశాలపై ఆధారపడాల్సి రావడం ఇండియాకు ఆర్థికంగా భారమవుతోంది. 2014-15లో మనదేశంలో 4.34లక్షల టన్నుల పొద్దుతిరుగుడు పంటను పండించారు. అది 2023-24లో లక్షా 67వేల టన్నులకు పడిపోయిందని కేంద్ర అర్థ, గణాంకశాఖ తాజా నివేదిక ఎండగట్టింది. ఇదే ఏడాది 30లక్షల టన్నుల పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకోవడానికి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. గతేడాది దేశంలో మొత్తం తొమ్మిది రకాల నూనెగింజల పంటల దిగుబడి 3.66 కోట్ల టన్నులే ఉంది. అంతకుముందు ఏడాది కంటే దిగుబడి తగ్గడంతో విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం పెరిగింది. ప్రభుత్వాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇచ్చి మద్దతు ధరకు కొంటామనే హామీని ఇస్తే నూనెగింజల పంటలను పండిస్తారు. మద్దతు ధర చట్టంపై స్పందించని ప్రభుత్వం విదేశాల నుంచి నూనెల దిగుమతికి గేట్లెత్తుతోంది. దక్షిణాదిలో అధికంగావాడే పొద్దుతిరుగుడు నూనెపై 2021లో 38.5శాతం, పామాయిల్‌పై 30.5శాతం దిగుమతి సుంకం ఉండటం వల్ల అప్పట్లో ఈ పంటలకు మంచి ధర వచ్చింది. ఆ తరవాత వీటిపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో దిగుమతులు పెరిగి, పంటల ధరలు పతనమై రైతులకు నష్టం వాటిల్లుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో అధికంగా వినియోగించే ఆవనూనెపై 38.50 శాతమున్న దిగుమతి సుంకం నాలుగేళ్లుగా మారలేదు. ఆ పంట పండించే ఉత్తరాది రాష్ట్రాల రైతులకు ధర తగ్గకుండా ఉండేందుకు ఆవనూనె దిగుమతిపై సుంకం తగ్గించకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుందనే విమర్శలున్నాయి. ఇలాంటి జాగ్రత్తల్ని దేశవ్యాప్తంగా అన్ని నూనెగింజల పంటలకూ తీసుకుంటే విదేశీ నూనెల అవసరమే ఉండదు.

మంగమూరి శ్రీనివాస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.