Updated : 31/01/2023 17:54 IST

పిగ్మెంటేషన్ తగ్గి, ముఖం తెల్లబడాలంటే ఏం చేయాలి?

నా వయసు 22 సంవత్సరాలు. నా ముఖం పైన పిగ్మెంటేషన్‌ ఎక్కువగా ఉంది. దీనివల్ల ముఖంపై గుంతలు ఏర్పడుతున్నాయి. ఎన్ని మందులు వాడినా నల్లగా కనబడుతున్నాను. నా ముఖం తెల్లగా మారడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. మీరు పిగ్మెంటేషన్‌, ఓపెన్‌ పోర్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా ట్యానింగ్‌, మొటిమలు, మంగు మచ్చల వల్ల పిగ్మెంటేషన్‌ వస్తుంటుంది. అయితే మీకు పిగ్మెంటేషన్‌ ఏ కారణంగా వచ్చిందనేది చెప్పలేదు.

మన దేశంలో ట్యానింగ్‌ సమస్య చాలామందిలో ఉంటుంది. ఒక ఐదు నిమిషాలు చర్మానికి ఎండ తగిలితే చాలు పిగ్మెంటేషన్ వచ్చేస్తుంటుంది. ఇది ఒకరకంగా మనకు వరం కూడా. ఎందుకంటే ఇది స్కిన్‌ క్యాన్సర్‌ రాకుండా చేస్తుంది. మొటిమలు, మంగు మచ్చలకు చికిత్స ఉంది. కానీ, ట్యానింగ్‌కు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఒకపక్క ట్రీట్‌మెంట్ ఇస్తూ మరో పక్క చర్మానికి ఎండ తగిలితే ట్యానింగ్‌ని ఆపడం కష్టమవుతుంది.

పిగ్మెంటేషన్‌ను తొలగించుకోవడానికి హైడ్రోక్వినోన్, కొజిక్‌ యాసిడ్‌ వంటి క్రీమ్స్‌ ఉంటాయి. వాటిని రాత్రి పడుకునే ముందే రాసుకోవాలి. అలాగే ఓపెన్‌ పోర్స్‌కు సంబంధించి ట్రెటినాయిన్‌ అనే క్రీం ఉంటుంది. ఇవి వాడితే మీకు ఆశించిన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీటిని కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా వాడితేనే ఫలితం కనిపిస్తుంది.

సాధారణంగా వీటివల్ల తీవ్రమైన దుష్ప్రభావాలేమీ ఉండవు. అయినప్పటికీ కొంతమందిలో కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం లేకపోలేదు. అందుకే వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. అలాగే వాడకం మొదలుపెట్టిన తర్వాత ఏవైనా మార్పులు గమనించినట్లయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి.

ఇదేవిధంగా పిగ్మెంటేషన్ రాకుండా చూసుకోవడానికి సన్‌స్క్రీన్‌ రెగ్యులర్‌గా ఉపయోగించడం, ముఖానికి ఎండ తగలకుండా దళసరిగా ఉండే క్లాత్‌ కట్టుకోవడం చేస్తుండాలి. అయితే ముందుగా డెర్మటాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లి మీ పిగ్మెంటేషన్‌కు కారణం తెలుసుకోండి. ఆ తర్వాత పైన పేర్కొన్న క్రీమ్స్‌ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని