నా భర్త ఫ్రెండ్ రోజూ ఫోన్ చేస్తున్నాడు..!
నాకు పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది. ఇద్దరు పిల్లలు. ఈ మధ్య ఒక ఫంక్షన్‌లో మా వారు ఆయన ఫ్రెండ్ని పరిచయం చేశారు. అతను చాలా సరదాగా, నవ్వుతూ మాట్లాడతాడు. నా ఫోన్ నంబర్ అడిగితే ఇచ్చాను. ఇప్పుడు ప్రతిరోజూ ఫోన్ చేస్తున్నాడు. ఈ విషయం నా భర్తకు తెలియదు. ఫోన్ చేయద్దని అతనికి నేరుగా....
నాకు పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది. ఇద్దరు పిల్లలు. ఈ మధ్య ఒక ఫంక్షన్‌లో మా వారు ఆయన ఫ్రెండ్ని పరిచయం చేశారు. అతను చాలా సరదాగా, నవ్వుతూ మాట్లాడతాడు. నా ఫోన్ నంబర్ అడిగితే ఇచ్చాను. ఇప్పుడు ప్రతిరోజూ ఫోన్ చేస్తున్నాడు. ఈ విషయం నా భర్తకు తెలియదు. ఫోన్ చేయద్దని అతనికి నేరుగా చెప్పలేకపోతున్నాను. రోజూ ఫోన్ చేయడం మినహాయిస్తే అతని మాటల్లో ఎలాంటి తేడా లేదు. అయితే నా భర్తకు ఈ విషయం తెలిస్తే ఆయన ఎలా అర్థం చేసుకుంటారో అని భయంగా ఉంది. ఈ క్రమంలో రోజూ ఫోన్ చేయద్దని అతనితో డైరెక్ట్‌గా చెప్పేయడం మంచిదా? లేక నా భర్తతోనే ఇదంతా చెప్పేయడం మంచిదా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.
జ. ఆలుమగల అనుబంధం ఎంతో సున్నితమైనది. ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ బంధం అంత దృఢంగా మారుతుంటుంది. అతను మీవారి ఫ్రెండే అయినా, ఆయనకు తెలియకుండా అతనితో మాట్లాడడం మీ రిలేషన్‌షిప్‌కి ఏమాత్రం మంచిది కాదు. తన మాటల్లో, ప్రవర్తనలో ఎలాంటి తేడా లేదని చెబుతున్నారు. అయినా ఇలాంటి స్నేహాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు. కొంతకాలానికి అవతలి వ్యక్తికి మీపై వేరే రకమైన అభిప్రాయం కలిగే అవకాశం లేకపోలేదు.
దీనివల్ల మీ భర్తతో ఉన్న బంధం ఎప్పటికైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీకు మీరే అతని నుండి దూరం జరగడం మంచిది. అయితే ఇది ఒకేసారి కాకుండా క్రమంగా అలవాటు చేయండి. ఫోన్ చేసినప్పుడు ‘బిజీగా ఉన్నాను.. ఇప్పుడు మాట్లాడలేను’ అని చెప్పండి. ఇలా క్రమంగా మీకు మీరుగా అతనికి దూరం జరగడం ఒక పద్ధతి.
ఒకవేళ అతను ఇంకా ఫోన్ చేస్తుంటే అప్పుడు మీ భర్తకు చెప్పండి. ఈ క్రమంలో ‘అతనితో ఎప్పుడూ వేరే అభిప్రాయంతో మాట్లాడలేదు. ఫోన్ చేసినప్పుడు పలకరించి పెట్టేశాను’ అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయండి. ఇలాంటి రహస్య స్నేహాలు కుటుంబ వ్యవస్థలో ఎవరికీ నచ్చవు. ఒకవేళ మీ భర్త అర్థం చేసుకున్నా.. కుటుంబంలో పిల్లలు, అత్తమామలు, ఇతర సభ్యులు ఉంటారు. వాళ్లు అపార్థం చేసుకునే అవకాశం లేకపోలేదు. అందుకే సాధ్యమైనంత వరకు అతనికి దూరంగా జరగడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.