Published : 15/12/2022 21:04 IST

ఉదయాన్నే ఇలా చేస్తే మీ బంధం పదిలం!

ఉదయం లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రపోయేవరకు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా గడిపేస్తాం. అలాంటప్పుడు ఒకరితో ఒకరు గడిపే తీరిక, సమయం ఇంకెక్కడుంటుంది. నిజానికి ఈ బిజీ షెడ్యూలే ఆలుమగల అనుబంధాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. మరీ ముఖ్యంగా కొత్త జంటలకు ఒకరిపై ఒకరు అవగాహన పెంచుకోవడానికి కలిసి గడపడమే కీలకమంటున్నారు. అందుకే రోజంతా సమయం కేటాయించలేకపోయినా.. ఉదయాన్నే కొన్ని పనులతో ఒకరికొకరు మరింత దగ్గర కావచ్చంటున్నారు.

⚛ నిద్ర లేవగానే హడావిడిగా ఎవరి పనుల్లోకి వాళ్లు దూరిపోవడం కాకుండా.. ఓ ఐదు పది నిమిషాల పాటు ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందంటున్నారు నిపుణులు.

⚛ ఉదయాన్నే ఎవరి హడావిడిలో వాళ్లు ఉండకుండా.. ఒకరి కోసం ఒకరు కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఉదాహరణకు.. కాఫీ పెట్టివ్వడం, అల్పాహారం తయారు చేసి పెట్టడం, ఉద్యోగాలకు వెళ్లే వారైతే ఒకరి లంచ్‌ బాక్సుల్ని మరొకరు సిద్ధం చేయడం.. ఇలా ఒకరి కోసం ఒకరు చేసే పనులు తెలియకుండానే ఇద్దరినీ మరింత దగ్గర చేస్తాయి.

⚛ మీ భాగస్వామి మీకోసం పెట్టిన కాఫీ బాగున్నా, అల్పాహారం రుచిగా ఉన్నా లేదంటే తను వేసుకున్న డ్రస్‌ బాగున్నా.. ఇలా ఏ విషయంలోనైనా ఓ కాంప్లిమెంట్‌ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి పొగడ్తలు ఇద్దరినీ దగ్గర చేయడమే కాదు.. సెరటోనిన్‌ అనే హ్యాపీ హార్మోన్‌ విడుదలయ్యేలా చేస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.

⚛ దాంపత్యంలో అన్యోన్యత పెరగాలంటే ఇద్దరూ కలిసి కాసేపు జోక్స్‌ వేసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ఉదయాన్నే ఇలా చేయడం వల్ల ఆ జోష్‌ రోజంతా మనతోనే ఉంటుంది.

⚛ ఆలుమగలిద్దరూ కలిసి చేసే వ్యాయామాలూ వారి మధ్య అనుబంధాన్ని రెట్టింపు చేస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. ఈక్రమంలో ఇద్దరూ కలిసి కొద్దిసేపు సరదాగా మాట్లాడుతూ వర్కవుట్‌ చేయడం వల్ల అందులో అలసట తెలియకపోగా.. ఏదో తెలియని మధురానుభూతిని సొంతం చేసుకోవచ్చు.

⚛ ఆలుమగలిద్దరూ మరింత దగ్గరవ్వాలంటే అందులో శృంగారం పాత్ర కూడా కీలకమే. అది కూడా ప్రత్యేకించి ఉదయం పూట మనసు ఉత్తేజితమవుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా ఇతర పనుల పైనా ఏకాగ్రత పెరుగుతుందంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని