Published : 28/06/2022 18:06 IST

సిజేరియన్ నుంచి త్వరగా కోలుకోవాలంటే..

ఈ రోజుల్లో గర్భం ధరించిన మహిళల్లో చాలామందికి సిజేరియన్‌ డెలివరీలే అవుతున్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నార్మల్ డెలివరీలో నొప్పుల్ని భరించలేక, ఇతర అనారోగ్యాల రీత్యా.. ఇలా కారణమేదైనా సి-సెక్షన్‌ డెలివరీల వైపే మొగ్గు చూపుతున్నారు కాబోయే అమ్మలు.

అయితే సిజేరియన్ తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఆ తర్వాత కూడా దీర్ఘకాలంలో పలు అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని కొంతమంది భావిస్తుంటారు. కానీ డెలివరీ తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సిజేరియన్‌ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

విశ్రాంతిని మించింది లేదు!

సిజేరియన్‌ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కుట్లపై ఒత్తిడి పడకుండా అవి త్వరగా మానిపోవడానికి ఇది దోహదం చేస్తుందట! అయితే కొత్తగా తల్లైన వారికి రోజులో చాలా సమయం పాపాయితోనే సరిపోతుంది. వారికి పాలివ్వడం, డైపర్లు/దుస్తులు మార్చడం, వారిని నిద్రపుచ్చడం, ఇలా వారు నిద్రపోయినప్పుడు ఇంటిపని ఏదైనా ఉంటే చేసుకోవడం.. ఇలా ఈ పనులతోనే రోజంతా బిజీబిజీగా గడిచిపోతుంది. ఇక నిద్రపోవడానికి సమయమెక్కడిది? అని చాలామంది తల్లులు ఆందోళన చెందుతుంటారు. దీంతో వారిలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇటు బాలింతలకు, అటు శిశువుకు.. ఇద్దరికీ మంచిది కాదు. కాబట్టి తల్లైన తొలినాళ్లలో నిద్రలేమిని, ఒత్తిడిని జయించాలంటే ఇతర పనులు పక్కన పెట్టి పాపాయి నిద్రపోయినప్పుడే తల్లులూ నిద్రకు ఉపక్రమించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా ఈ సమయంలో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో నడుంనొప్పి సమస్య కూడా రాకుండా జాగ్రత్తపడచ్చట!

పాలిస్తే కోలుకుంటారు!

పాలిచ్చే ప్రక్రియ కొత్తగా తల్లైన మహిళల్లో ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుందంటున్నారు నిపుణులు. ప్రసవానంతరం పెరిగిన బరువు తగ్గడం దగ్గర్నుంచి కుట్లు త్వరగా మానిపోవడానికి, తిరిగి సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి, వెంటనే మళ్లీ గర్భం ధరించకుండా ఉండడానికి.. ఇలా ఎలా చూసినా బ్రెస్ట్‌ఫీడింగ్‌ బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది. అయితే పిల్లలకు పాలిచ్చే క్రమంలో తల్లులు కూర్చునే పొజిషన్‌ కూడా ఇక్కడ కీలకమే అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా ముందుకి, వెనక్కి వంగిపోకుండా నిటారుగా కూర్చొని చిన్నారికి పాలివ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సిజేరియన్‌ కారణంగా దీర్ఘకాలంలో నడుంనొప్పి రాకుండా జాగ్రత్తపడచ్చట! ఇక ఈ క్రమంలో మీకు, మీ చిన్నారికి సౌకర్యవంతంగా ఉండడం కోసం నిపుణుల సలహా మేరకు ఫీడింగ్‌ పిల్లోను కూడా వాడచ్చట!

పోషకాహారం కావాల్సిందే!

సిజేరియన్‌ తర్వాత ఇది తినకూడదు, అది తాగకూడదు.. అన్న నియమనిబంధనలు ఇప్పటికీ చాలా ఇళ్లలో ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే పాలిచ్చే తల్లులకు ఎలాంటి పథ్యాలు అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. గర్భిణిగా ఉన్న సమయంలో సంపూర్ణ పోషకాలు లభించే పదార్థాలన్నీ ఎలాగైతే తీసుకున్నారో ప్రసవానంతరం కూడా అవే ఆహార నియమాలు పాటించాలని, తద్వారా సిజేరియన్‌ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే పాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం కోసం ఆకుకూరలు, వెల్లుల్లి, కోడిగుడ్లు, పాలు, పాల పదార్థాలు, మాంసం, ఓట్‌మీల్‌, సోంపు.. వంటివన్నీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ముఖ్యం. ఇక సిజేరియన్‌ కారణంగా శరీరం కోల్పోయిన నీటి స్థాయుల్ని తిరిగి భర్తీ చేసుకోవడానికి, పాల ఉత్పత్తికి బాలింతలు రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం మంచిదట!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని