Published : 02/01/2022 13:08 IST

ఈ అబద్ధాలు బంధానికి చేటు!

ఏదో సరదాకి ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్తే పర్లేదు.. అంతేకానీ.. ప్రతిరోజూ ప్రతి సందర్భంలో అసలు విషయం దాచి అబద్ధాలు చెబుతుంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర దొరికిపోవడం ఖాయం. దీనివల్ల ఎదుటివ్యక్తిపై ఉండే నమ్మకం మసక బారుతుంది. ఇదే అనుబంధాల్లో కలతలు రేగడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే భార్యాభర్తలు ఏ విషయంలోనైనా పారదర్శకంగా వ్యవహరించాలని చెబుతున్నారు. మరి, ఆలుమగలు ఏ విషయాల్లో అబద్ధాలు చెప్పుకోకూడదో? దానివల్ల ఎదురయ్యే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి..

తను జస్ట్‌ ఫ్రెండ్‌.. అంతే!

విఫలమైన ప్రేమకథలు, బ్రేకప్‌లు చాలామంది జీవితాల్లో ఉంటాయి. అయితే వాటినే తలచుకుంటూ అక్కడే ఆగిపోలేం.. అలాగని వాళ్ల జ్ఞాపకాల్ని అంత త్వరగా మర్చిపోలేం కూడా! వేరొకరితో పెళ్లైనా ఏదో ఒక సందర్భంలో ‘మాజీ’ గుర్తుకు రావడం, వాళ్ల ఆలోచనలు మనసును ఉక్కిరి బిక్కిరి చేయడంతో మూడ్‌ మారిపోతుంటుంది. అయితే ఆ అసహనాన్ని మీ భాగస్వామిపై చూపించడం, వారి గురించి పదే పదే ప్రస్తావించడం, దీనికి కారణమేంటని అడిగితే.. మనసు నిండా మీ మాజీ ఆలోచనలే పెట్టుకొని.. బయటికి మాత్రం తను జస్ట్‌ ఫ్రెండ్‌.. అంతే! అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ, అవతలి వారికి అబద్ధం చెప్పడం.. ఇవన్నీ మీ భాగస్వామికి మీపై లేనిపోని అనుమానాలు కలిగేలా చేస్తాయి. తద్వారా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. అందుకే  సాధ్యమైనంతవరకు పారదర్శకంగా ఉండడం దంపతుల మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేస్తుందంటున్నారు నిపుణులు.

ఆ అకౌంట్‌ నాది కాదు!

ఆలుమగల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసే అంశాల్లో ఆర్థిక విషయాలూ ముందు వరుసలో నిలుస్తున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. ఒకరి ఆదాయ వ్యయాల గురించి మరొకరి దగ్గర దాచడం, ఒకరికి తెలియకుండా మరొకరు వేర్వేరు అకౌంట్స్‌ నిర్వహించడం, అడిగితే అది నాది కాదన్నట్లు వ్యవహరించడం, విచ్చల విడిగా ఖర్చు చేస్తూ.. వ్యయాల విషయంలో పరిమితంగానే ఉన్నానని కవర్‌ చేసుకోవడం.. ఇలా ముందొకలా, వెనక మరోలా వ్యవహరిస్తుంటే.. ఎప్పుడో ఒకసారి దొరికిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మీపై మీ భాగస్వామి నమ్మకం కోల్పోయి క్రమంగా మీ అనుబంధం సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొత్తగా అకౌంట్ ప్రారంభించినా, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసినా.. ఇలా ప్రతి విషయంలోనూ పారదర్శకత అవసరం అంటున్నారు నిపుణులు.

లేనిది ఉన్నట్లుగా చెబుతున్నారా?

కరోనా ప్రభావంతో ఎదురైన అనిశ్చితి కొంతమంది విషయంలో ఇంకా తొలగిపోలేదు. ఈ క్రమంలో తిరిగి ఉద్యోగం సంపాదించలేక.. ఉపాధి కోసం ఏదో ఒక ఉద్యోగంలో చేరడం లేదా ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించడం.. ఇంట్లో మాత్రం అనుకున్న ఉద్యోగంలో చేరానంటూ కబుర్లు చెప్పడం.. ఇలాంటి అబద్ధాలు కూడా అనుబంధాలు బీటలు వారేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ విషయంలో ఉన్నది ఉన్నట్లుగా చెబితే.. సంపాదన పరంగా మీ భాగస్వామి కూడా మీతో ఓ చేయి కలిపే వీలుంటుంది. తద్వారా పరిస్థితి చక్కబడే దాకా ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండచ్చు.. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల అనుబంధమూ దృఢమవుతుంది.

ఇవనే కాదు.. దాంపత్య బంధంలో ఏ విషయంలోనూ దాపరికం, అబద్ధాలు చెప్పుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. తద్వారా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి నమ్మకం పెరిగి అనుబంధమూ దృఢమవుతుందని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని