Published : 23/01/2022 14:53 IST

వంట నూనెను ఇలా వాడితేనే మేలు!

సాధారణంగా అందరూ ఆరోగ్యకరమైన ఆహారం గురించే మాట్లాడతారు. కానీ, ఆరోగ్యకరంగా ఆహారం వండడం గురించి ఎక్కువగా మాట్లాడరు. ఈ క్రమంలో హెల్దీ కుకింగ్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నూనె వాడకం. సాధారణంగా మన వంటల్లో నూనె కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనకు తెలియకుండానే తీసుకునే ఈ ఆయిల్‌ వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఆయిల్‌ వాడకానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు.

నూనెను నీళ్లలా వాడితే అంతే!

నూనె లేని వంటలు ఆరోగ్యానికి మంచివని తెలిసినా... వంటకానికి మంచి రుచి కావాలంటే గిన్నెలో ఆయిల్‌ పడాల్సిందే. అయితే నూనెను ఎలా పడితే అలా నీళ్లలా వాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం వినియోగించే అన్ని రకాల నూనెల్లోనూ ఎసెన్షియల్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వుల శాతం పెరిగిపోతుంది. ఇవి ధమనుల్లోని రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. ఫలితంగా హార్ట్‌ ఎటాక్‌, గుండెపోటు, బ్రెస్ట్‌, ఒవేరియన్‌ క్యాన్సర్‌, డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, ఊబకాయం, కీళ్ల నొప్పులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో నూనె వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రుచికరమైన ఆహారంతో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది.

నూనెను తగ్గిద్దామిలా!

* వేపుళ్ల బదులు తాలింపు, బేకింగ్‌, గ్రిల్లింగ్‌, స్టీమింగ్‌కు ప్రాధాన్యమివ్వండి. దీంతో ఎ,డి,కె-విటమిన్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి.

* ఫ్రైడ్ స్నాక్స్‌కి బదులు రోస్ట్‌ చేసిన, లేదా స్టీమ్‌ చేసిన స్నాక్స్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

* నూనెలు కాస్త తక్కువగా వాడేవారు... వంటలో పొరపాటున కాస్త ఎక్కువైతే తినడానికి ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు నూనెను కొలత ప్రకారం వాడుకోవడమే అందుకు సరైన పరిష్కారం. ఇందులో భాగంగా డైరెక్ట్‌గా బాటిల్‌లో నుంచి నూనెను పోసే బదులు టీస్పూన్‌ లాంటి వాటితో ఆయిల్‌ వేయండి. అప్పుడు ఎంత నూనె వాడుతున్నారో మీకు తెలుస్తుంది.

* ఎల్లప్పుడూ ఒకే నూనెను కాకుండా కాంబినేషన్ ఆయిల్స్‌ను వాడితే మంచిది. సన్‌ఫ్లవర్, రైస్‌ బ్రాన్‌, నువ్వులు, వేరుశెనగ, కొబ్బరి నూనెల్లో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్‌శ్యాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి చాలా అవసరం. మన శరీరం వాటిని స్వయంగా తయారుచేసుకోలేదు. వంట నూనె ద్వారానే అవి శరీరానికి అందుతాయి. అందుకే వేరు వేరు నూనెల్ని కలిపి వాడుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.

* అప్పడాలంటే అందరికీ ఇష్టమే. కానీ ఇవి వేయించాలంటే చాలా నూనె కావాలి. దీని కారణంగా అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా ఆవిరైపోతాయి. కాబట్టి అప్పడాలని సన్నటి మంట పైన కాల్చుకుంటే ఆయిల్‌ వాడాల్సిన అవసరమే ఉండదు.

* నూనె వినియోగానికి సంబంధించి నెలకు ఎంత వాడుతున్నామో ఒక లెక్క వేసి చూసుకోండి. అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. దీన్ని బట్టి అవసరం అనుకుంటే ఈ టిప్స్‌ ద్వారా నూనె వాడకాన్ని తగ్గించవచ్చు.

* వేపుళ్లకి వాడిన నూనెని మళ్లీ వేయించడానికి ఉపయోగించకండి. ఇందువల్ల శరీరంలోకి ట్యాక్సిన్స్‌ చేరే ప్రమాదం ఉంది.

ఇవి కూడా పాటించండి!

* వంట నూనెను ఎక్కువ సేపు వేడి చేస్తే అందులో ఉండే విటమిన్లు శరీరానికి అందవు. అంతేకాదు... ఏ నూనెనైనా నాలుగుసార్ల కంటే ఎక్కువ వేడి చేసి వాడకూడదు.

* ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటికే వాడిన నూనెతో తాజా నూనెను కలపకండి.

* నూనెను వేడి చేసినప్పుడు వాటి టెంపరేచర్‌ కూడా మారుతుంది. ఏ టెంపరేచర్‌ వద్ద నూనె పొగ రావడం మొదలు పెడుతుందో దానిని ‘స్మోకింగ్‌ పాయింట్‌’ అంటారు. దీనిపై కొంచెమైనా అవగాహన కలిగి ఉండాలి. ప్రత్యేకించి ఫ్రై చేయాల్సిన అవసరం వస్తే ఎక్కువ స్మోకింగ్‌ పాయింట్‌ ఉన్న నూనెను మాత్రమే వాడాలి. డబుల్‌ రిఫైన్డ్‌ ఆయిల్స్‌ను ఎంత వేడి చేసినా వాటి నుంచి పొగ రాదు. అదే వేరుశెనగ, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలను వేడి చేస్తే పొగలు వస్తాయి.

* ఒకసారి వాడిన నూనెను మరోసారి వాడే ముందు పాత్రలో అడుగున ఉన్న ఆయిల్‌ను వదిలేస్తే మంచిది. లేదంటే వడగట్టుకుని వాడాలి.

* వంట నూనెపై సూర్యరశ్మి పడకుండా చూడాలి. నేరుగా ఎండ పడడం వల్ల నూనెలో కొన్ని రసాయనిక మార్పులు జరిగే అవకాశం ఉంది.

* వంట నూనె కొనే ముందు అందులో ఉన్న కొవ్వు శాతం చూసి మరీ కొనాలి. వంటకు వాడే నూనెలో 8 నుంచి 10 శాతం శ్యాచురేటెడ్‌ కొవ్వు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరం.


Advertisement

మరిన్ని