close
Published : 22/01/2022 21:02 IST

కుంకుళ్లను ఇలా కూడా వాడచ్చు..!

ఒకప్పుడు తలస్నానం చేయడానికి కుంకుడు కాయలనే ఉపయోగించేవారు. అయితే ఆ తర్వాత మార్కెట్లోకి షాంపూలు అందుబాటులోకి వచ్చాక వాటి వాడకం బాగా తగ్గింది. అయినా మన అమ్మ, బామ్మల తరానికి చెందినవారు నేటికీ కుంకుడు కాయలతోనే తలస్నానం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. కేవలం శిరోజాలను శుభ్రపరచడానికే కాకుండా ఇంట్లో ఇతరత్రా పనులకు కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా.. అసలు కుంకుడు కాయలను విభిన్న రూపాల్లో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం రండి..

లిక్విడ్ సోప్‌గా..

ప్రతి కప్పు నీటికి రెండు కాయల చొప్పున కుంకుళ్లు, నీళ్లు తీసుకోవాలి. వీటిని కలిపి ముప్ఫై నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత పలుచని వస్త్రాన్ని తీసుకొని వడపోసుకోవాలి. దీనికి మీకు నచ్చిన ఫ్లేవర్‌లోని అరోమా ఆయిల్‌ని కలుపుకోవాలి. అనంతరం శుభ్రంగా కడిగి పొడిగా ఆరబెట్టుకున్న బాటిల్‌లో ఈ మిశ్రమాన్ని పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని స్నానం చేసేటప్పుడు సబ్బుకి బదులుగా ఉపయోగించవచ్చు.

గ్లాస్ క్లీనర్‌గా..

కిటికీల అద్దాలను తుడవడానికి సాధారణంగా మార్కెట్లో దొరికే క్లీనింగ్ లిక్విడ్‌లను ఉపయోగిస్తాం. అయితే వీటికి బదులుగా కుంకుడు కాయలను ఉపయోగించి కూడా ఇంట్లోనే గ్లాస్‌క్లీనర్‌ను తయారు చేసుకోవచ్చు. దీనికోసం కుంకుడు కాయలతో తయారుచేసుకున్న లిక్విడ్ సోప్ ఒక టేబుల్ స్పూన్, రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, అరకప్పు నీటిని తీసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి బాగా షేక్ చేయాలి. అనంతరం దీన్ని కిటికీ అద్దంపై స్ప్రే చేసి మెత్తటి వస్త్రంతో తుడిచేయాలి. ఇలా చేస్తే కిటికీ అద్దాల మీద ఉన్న దుమ్ము పోవడమే కాకుండా అవి కొత్తవాటిలా మెరిసిపోతాయి.

పట్టు వస్త్రాలకు..

డిటర్జెంట్ సోప్, డిటర్జెంట్ పౌడర్‌లో ఉండే రసాయనాల కారణంగా దుస్తులు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పట్టు, జరీ దుస్తులపై ఈ రసాయనాల ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అందుకే వీటిని ఉతకడానికి డిటర్జెంట్‌కి బదులుగా కుంకుళ్లను వాడితే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. దీనికోసం ఎనిమిది కుంకుడు కాయలను చల్లటి నీటిలో నానబెట్టి వాటి రసాన్ని తీసుకోవాలి. దీన్ని దుస్తులు ఉతకడానికి ఉపయోగించవచ్చు. ముఖ్యంగా పట్టు, జరీ వస్త్రాలను ఉతకడానికి ఉపయోగించినట్త్లెతే అవి ఎక్కువ కాలం మన్నడంతో పాటు రంగు మారకుండా ఉంటాయి.

కిచెన్ క్లీనర్‌గా..

అరకప్పు కుంకుడు కాయ రసానికి రెండు చెంచాల వైట్ వెనిగర్, కొద్దిగా నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రేబాటిల్‌లో వేసి బాగా షేక్ చేసుకోవాలి. దీంతో కిచెన్ ప్లాట్‌ఫాం, వాష్‌బేసిన్ లాంటివి శుభ్రం చేసుకోవచ్చు. అలాగే దీన్ని బాత్‌రూం క్లీనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

నగలు శుభ్రపరచడానికి..

బంగారం, వెండితో తయారుచేసిన ఆభరణాలను, వస్తువులను శుభ్రం చేయడానికి కూడా కుంకుళ్లు బాగా ఉపయోగపడతాయి. దీనికోసం కుంకుడుకాయ రసంలో వాటిని కాసేపు నానబెట్టాలి. అనంతరం మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దితే సరిపోతుంది. ఇది సహజసిద్ధమైన ఉత్పత్తి కాబట్టి ఇందులో రసాయనాలు ఉండవు. ఫలితంగా ఆభరణాలు నల్లగా మారతాయన్న భయం ఉండదు.

దోమల బారినుంచి..

దోమల బారినుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మస్కిటో రిపెల్లెంట్స్‌ని ఉపయోగించడం సాధారణంగా జరిగేదే. దీనికోసం మార్కెట్లో దొరికే రిపెల్లెంట్‌లను వాడుతూ ఉంటాం. అయితే వీటిని రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తారు. ఫలితంగా అలర్జీలు, శ్వాస సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుంకుడుకాయలను దోమల రిపెల్లెంట్‌గా ఉపయోగిస్తే అలర్జీల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీనికోసం కుంకుడు కాయలతో తయారు చేసిన లిక్విడ్ సోప్‌ను శరీరానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోమలు కుట్టకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.


Advertisement

మరిన్ని