Ukraine Crisis: అలా చేసి పుతిన్‌కు చికాకు పుట్టించొచ్చు.. దేశ వాసులకు జర్మనీ మంత్రి పిలుపు

ఉక్రెయిన్‌పై సైనిక చర్యను వ్యతిరేకిస్తూ.. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తోన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో రష్యా నుంచి ఇంధన దిగుమతులపై కట్టడి అంశం కూడా ఉంది. అయితే, మాస్కో సహజవాయువుపై పెద్దఎత్తున ఆధారపడిన...

Published : 16 Apr 2022 02:00 IST

బెర్లిన్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్యను వ్యతిరేకిస్తూ.. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో రష్యా నుంచి ఇంధన దిగుమతులపై కట్టడి అంశం కూడా ఉంది. అయితే, మాస్కో సహజవాయువుపై పెద్దఎత్తున ఆధారపడిన జర్మనీ మాత్రం.. జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో దిగుమతులను తగ్గించుకునేందుకు.. స్థానికంగా ఇంధన పొదుపు పాటించాలని జర్మనీ ఆర్థికశాఖ మంత్రి రాబర్ట్‌ హబెక్‌ తాజాగా దేశవాసులకు పిలుపునిచ్చారు. రష్యా గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం.. పుతిన్‌ను చికాకు పరుస్తుందన్నారు. ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సులభమైన చిట్కాలతో దాదాపు 10 శాతాన్ని ఆదా చేయొచ్చన్నారు. రాత్రి వేళల్లో ఇళ్లలో ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండేందుకు కర్టెన్లు మూసి ఉంచాలని, టెంపరేచర్‌ను ఒక డిగ్రీ తగ్గించుకోవడం ద్వారా పొదుపు చేయొచ్చని సూచించారు.

‘ఈస్టర్‌ రోజు రైళ్లలో ప్రయాణించొచ్చు. బైక్‌పై వెళ్లొచ్చు. ఇది మీ పాకెట్‌ మనీని ఆదా చేస్తుంది. ఈ చర్యలు.. పుతిన్‌ను చికాకూ పెడతాయి’ అని హబెక్ చెప్పారు. రష్యా నుంచి గ్యాస్‌ను దిగుమతులను నిషేధించాలన్న ఈయూ దేశాల పిలుపులను జర్మనీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా నిషేధం విధిస్తే.. జర్మనీ తీవ్ర మాంద్యంలోకి కూరుకుపోతుందని ప్రముఖ ఆర్థిక సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దిగుమతులను క్రమంగా తగ్గించడం ప్రారంభించింది. రష్యా గ్యాస్ దిగుమతుల్లో జర్మనీ తన వాటాను యుద్ధానికి ముందు ఉన్న 55 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. మాస్కో నుంచి పూర్తిస్థాయి దిగుమతుల నిలిపివేతకు 2024 మధ్యవరకు సమయం పట్టొచ్చని హబెక్ ఇటీవల చెప్పారు. మరోవైపు జర్మన్ అధికారులు గ్యాస్ కొరతను ఊహించి అత్యవసర ప్రణాళికలనూ ప్రారంభించారు. ఇళ్లకు, వ్యాపారాల నిర్వహణకు గ్యాస్ రేషనింగ్‌ చేపట్టే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని